క్షణక్షణమూ నరకమే!

27 Jul, 2014 00:13 IST|Sakshi
క్షణక్షణమూ నరకమే!

 గజ్వేల్/తూప్రాన్: ‘‘మా బిడ్డ ఎంతో గొప్పది అవుదనుకున్నం.. గిట్ల మా కళ్ల ముందే కన్ను మూస్తదనుకోలేదు.. మిగిలిన ఇద్దరు పిల్లలు కూడా ఆసుపత్రిలో ఉన్నరు.. దేవుడా నువ్వే దిక్కు.. ఇట్లాంటి కష్టం పగోడికి కూడా రావోద్దు..’’.. మాసాయిపేట స్కూలు బస్సు-రైలు దుర్ఘటనలో కూతురును కోల్పోయి, మరో ఇద్దరు పిల్లలు ఆస్పత్రిలో ఉన్న శివ్వంపేట మల్లాగౌడ్-లత దంపతుల ఆవేదన ఇది. వారు అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమార్తె శృతి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.. మరో కుమార్తె రుచిత తీవ్రగాయాలతో ఆస్పత్రి బెడ్‌పై ఉంది.. కుమారుడు వరుణ్ చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు... వీరిదే కాదు... ఆ ప్రమాదంలో మృతిచెం దిన, గాయపడిన వారి కుటుంబాల దీనగాథ ఇది.
 
 ఈ పెను విషాదంలో పిల్లలను కోల్పోయినవారు, తీవ్ర గాయాల బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల తల్లిదండ్రులు క్షణ క్షణం నరకయాతన పడుతున్నారు. వెంకటాయపల్లి గ్రామానికి చెందిన శివ్వంపేట మల్లాగౌడ్-లత దంపతుల కుమార్తె శృతి ప్రమాదంలో మృతిచెందగా.. మరో కుమార్తె రుచిత ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కుమారుడు వరుణ్ ఇంకా సృ్పహలోకి రాలేదు. కానీ శృతి మరణించి మూడు రోజులు కావడంతో నిర్వహించాల్సిన సంస్కారాల కోసం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పిల్లలను వదిలి.. ఆ దంపతులు శనివారం తమ ఇంటికి  చేరుకున్నారు.
 
 కార్యక్రమాన్ని ముగించిన తర్వాత తిరిగి వెంటనే ఆస్పత్రికి వెళ్లిపోయారు. ఇదే గ్రామంలో మన్నె స్వామి-లావణ్య దంపతుల కుమారుడు సద్భావన్(నర్సరీ) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ  చిన్నారి ఆరోగ్యం ఎప్పుడు కుదుటపడుతుందోనంటూ వారు ఆందోళన చెందుతున్నారు. దేవతా సత్యనారాయణ-గాయత్రి దంపతుల కుమార్తె సాత్విక (ఫస్ట్ క్లాస్), తొంట స్వామి-నర్సమ్మల కుమారుడు ప్రశాంత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక జిన్నారం మండలం కానుకుంట గ్రామానికి చెందిన తప్పెట లక్ష్మన్-వీరమ్మల కుమారుడు సాయిరామ్ (యూకేజీ) వెంకటాయపల్లిలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ చదువుకుంటుండగా ఈ ప్రమాదంలో గాయపడ్డాడు. అయ్యాలం-నీలమ్మల కుమారుడు శివకుమార్, లంబ రమేష్-పార్వతిల కుమార్తె శ్రావణి, ఉప్పల దుర్గయ్య-కవితల కుమారుడు సందీప్‌ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ‘‘నా మనుమలను హాస్పటల్‌లో జూస్తుంటే జరమొచ్చింది.. బీపీ, షుగర్ పెరిగింది.. వారిని ఆ పరిస్థితిలో చూస్తుంటూ తట్టుకోలేక.. ఇంటికి వచ్చిన.. పిల్లలు బాగుండాలే.. ఇగ దేవుడే దిక్కు..’’..అంటూ  తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామానికి చెందిన అభినంద్-శరత్‌ల నానమ్మ నీలమ్మ ఆవేదన వ్యక్తం చేసింది.
 
 శుభకార్యానికి పోయి బయటపడ్డం :  జంగం ప్రవీణ్ (వెంకటాయపల్లి)
 ‘‘మా పిల్లలు మహాలక్ష్మీ (2వ తరగతి), కారుణ్య (నర్సరీ) కూడా కాకతీయ స్కూల్‌లోనే చదువుతున్నరు. మేం 21వ తేదీన మెదక్‌లో ఓ శుభకార్యానికి వెళ్లినం. 23న రావాల్సి ఉండె.. కానీ నా భార్యాపిల్లలు ఇంకోరోజు అక్కడే ఉంటామనడంతో ఒక్కడినే వచ్చిన. ఒకవేళ నాతోపాటే వచ్చి ఉంటే మా పిల్లలు కూడ స్కూల్ బస్సులో ప్రమాదానికి గురయ్యేవారు. జరిగింది తలుచుకుంటే భయం వేస్తోంది..’’
 

మరిన్ని వార్తలు