ప్రతి ఒక్కరి సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం

11 Jun, 2019 01:43 IST|Sakshi

బీసీలకు 238 గురుకుల కాలేజీలను ఏర్పాటు చేశాం 

మంత్రి కొప్పుల ఈశ్వర్‌ వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: ప్రతి ఒక్కరి సంక్షేమం ప్రభుత్వ లక్ష్యమని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. కేజీ టు పీజీ మిషన్‌లో భాగంగా తలపెట్టిన గురుకుల పాఠశాలలు అద్భుత ఫలితాలు సాధిస్తున్నాయని, విద్యార్థుల సంఖ్యకు తగినట్లు కొత్త గురుకులాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వివరించారు. సోమవారం సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. అంతకుముందు బీసీ గురుకుల సొసైటీ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ నెల 17 నుంచి కొత్తగా 119 గురుకుల పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడారు. గురుకుల బోధన ఉన్నతంగా ఉండాలనేది సీఎం కేసీఆర్‌ ఆశయమని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు కేవలం 19 బీసీ గురుకులాలు మాత్రమే ఉండేవని, ఇప్పుడు వీటిసంఖ్య 257కు పెరిగిందన్నారు. 2017–18 విద్యా సంవత్సరంలో 119 గురుకుల పాఠశాలలు ప్రారంభించగా 2019– 20 విద్యాసంవత్సరంలో మరో 119 గురుకులాలు అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించారు. అలాగే 19 జూనియర్‌ కాలేజీలు, ఒక మహిళా డిగ్రీ కాలేజీని  ప్రారంభించినట్లు చెప్పారు.  

కొత్త గురుకులాలకు భవనాలు సిద్ధం 
కొత్తగా ఏర్పాటయ్యే 119 గురుకుల పాఠశాలలకు భవనాలు సిద్ధం చేశామని మంత్రి ఈశ్వర్‌ చెప్పారు. ఈ పాఠశాలల్లో 2019–20 విద్యాసంవత్సరంలో 5, 6, 7 తరగతులు ప్రారంభిస్తున్నామని, ఇప్పటికే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ప్రిన్సిపాళ్ల బాధ్యతల విషయంలో పాత స్కూల్‌లో పనిచేస్తున్నవారికి కొత్త స్కూళ్ల అదనపు బాధ్యతలు ఇచ్చామని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే వరకు ఈ బాధ్యతల్లో కొనసాగాల్సి ఉంటుందని చెప్పారు. కొత్త స్కూళ్లకు 3,689 పోస్టులు ప్రభుత్వం మంజూరు చేసిందని, వీటిని వివిధ దశల్లో భర్తీ చేస్తామన్నారు. అప్పటి వరకు పాత పాఠశాలల నుంచి ఇద్దరు టీచర్ల చొప్పున కొత్త పాఠశాలలకు డిప్యుటేషన్‌ మీద పంపు తున్నట్లు చెప్పారు.

అవసరమున్నచోట పీఈటీ, స్టాఫ్‌ నర్సులు, బోధనేతర సిబ్బందిని ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో తీసుకునేలా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. 98 శాతం పాఠశాలలకు నోటు పుస్తకాలు, పాఠ్యపుస్తకాల సరఫరా పూర్తి అయిందని పేర్కొన్నారు. అన్ని పాఠశాలల ప్రిన్సిపాళ్లకు రూ.2 లక్షలు ప్రొవిజన్స్‌ కోసం మంజూరు చేశామన్నారు. సమావేశంలో మల్లయ్యభట్టు, వీవీ రమణారెడ్డి, బాలాచారి తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు