ముస్లింలకు అసదుద్దీన్‌ విజ్ఞప్తి

24 Apr, 2020 16:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పవిత్ర రంజాన్‌ ప్రార్థనలను ఇళ్లలోనే చేసుకోవాలని ముస్లింలకు ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో రాత్రి 7 గంటల నుంచి ఉదయం వరకు కర్ఫ్యూ ఉంటుంది కాబట్టి బయట తిరిగేందుకు ఎవరినీ అనుమతించరని తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇళ్ల వద్ద కూడా సమ్మేళన ప్రార్థనలకు దూరంగా ఉండాలని కోరారు. పేదలు ఎవరూ ఆకలితో ఉండకుండా చూడాలని, ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వడం అతిపెద్ద ధర్మమని ఆయన అన్నారు. 

లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపించే ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. మొత్తం లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తరువాత కొన్ని ఆర్థిక కార్యకలాపాలను అనుమతించాలి కోరారు. సినిమా హాల్స్‌, బహిరంగ సభలపై ఆంక్షలు కొనసాగించాలన్నారు. (అందరికీ న్యాయం జరగడం ముఖ్యం అంటున్న అఖిలేశ్‌)

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రణాళిక లేకుండా లాక్‌డౌన్‌ విధించారని.. ఇది పేదలు, వలస కూలీలకు తీవ్ర ప్రభావం చూపిందన్నారు. వలస కార్మికులను ఆదుకోవడం కేంద్రం విఫలమైందని ధ్వజమెత్తారు. రేషన్ కార్డులు, బ్యాంకు ఖాతాలు లేని వారికి ప్రభుత్వ సహాయం అందలేదని తెలిపారు. ఈ సంక్షోభం కారణంగా 10 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోవచ్చని, ఈ సమస్యను పరిష్కరించే ప్రణాళికను ప్రధాని వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. 90 శాతం వలసదారులకు ప్రభుత్వ రేషన్ రాలేదని, 90 శాతం మందికి జీతాలు ఇవ్వలేదని ఒక సర్వేలో తేలినట్టు వెల్లడించారు. 

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) గిడ్డంగులలో ఉన్న బియ్యాన్ని పేద, వలస కూలీలకు పంపిణీ చేయాలని సూచించారు. శానిటైజర్ల తయారీకి బియ్యాన్ని ఉపయోగించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను ఆయన విమర్శించారు. కోవిడ్ -19 నుంచి కోలుకున్న వారందరూ రెడ్‌క్రాస్‌కు రక్తదానం చేయాలని, ప్లాస్మా థెరపీ ద్వారా కరోనా బాధితులను కాపాడటానికి ఇది తోడ్పడుతుందని తెలిపారు. 

చదవండి: కరోనా మహమ్మారిపై పోరులో అదే కీలకం

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు