అందరూ శిక్షార్హులే!

18 Nov, 2017 03:46 IST|Sakshi

     ఆడపిల్ల అని పాపను అమ్ముకున్నందుకు.. కన్న తల్లిదండ్రులు 

     చట్టబద్ధంగా దత్తత తీసుకోనందున పెంచిన తల్లిదండ్రులు 

     తన్విత కేసు దర్యాప్తు పూర్తి..చర్యల కోసం కోర్టుకు నివేదిక

సాక్షి, మహబూబాబాద్‌:  చిన్నారి తన్విత దత్తత కేసులో మహబూబాబాద్‌ జిల్లా పోలీసులు దర్యాప్తు పూర్తిచేశారు. కన్నతల్లికి తెలిసే ఆ పాపను అమ్మారని నిర్ధారణకొచ్చిన పోలీసులు అటు కన్నతల్లిదండ్రులు, ఇటు పెంచిన తల్లిదండ్రులూ శిక్షార్హులేనని నిర్ణయించి, తదుపరి చర్యల నిమిత్తం మహబూబాబాద్‌ కోర్టుకు నివేదించారు. మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం చిన్నకృష్ణాపురానికి చెందిన మాలోతు బావ్‌సింగ్, ఉమ దంపతుల కూతురును రెండేళ్ల క్రితం భద్రాద్రి జిల్లా ఇల్లందు మండలం రోంపేడుకు చెందిన రాజేంద్రప్రసాద్, స్వరూప దంపతులకు దత్తత ఇచ్చారు.

తన భర్త తనకు తెలియకుండా దత్తత ఇచ్చాడని ఉమ గత నెలలో ఇల్లెందు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైన విషయం తెలిసిందే. భద్రాద్రి పోలీసులు ఈ కేసులో దర్యాప్తును చేపట్టి, రెండేళ్ల పాపను ఖమ్మంలోని శిశుగృహంలో ఉంచారు. ఈ క్రమంలో తన్వితను తనకే అప్పగించాలని కన్నతల్లి ఉమ, పెంచిన తల్లి స్వరూప పోరాడుతున్నారు. కాగా, తన్విత మహబూబాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జన్మించిందని, అక్కడే దత్తత జరిగిందని భద్రాద్రి జిల్లా పోలీసుల దర్యాప్తులో తేలడంతో, అక్కడి పోలీసులు కేసును మహబూబాబాద్‌ జిల్లా పోలీసులకు అప్పగించారు. ఎస్పీ కోటిరెడ్డి కేసు దర్యాప్తు చేపట్టారు. మహబూబాబాద్‌ పట్టణ పోలీసులు కూడా సదరు ప్రైవేటు ఆస్పత్రిలో విచారణ జరిపారు. తన్విత కన్నతల్లి ఉమకు తెలిసే ఈ దత్తత జరిగిందని, ఆ సమయంలో రాసిన ఒప్పందపత్రంలో చేసిన సంతకం ఉమదేనని విచారణలో నిర్ధారించారు. 

తన్వితను బాగా చూసుకోవడం లేదనే ఫిర్యాదు చేశా.. 
బావ్‌సింగ్, ఉమ దంపతులకు ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. మళ్లీ ఉమకు ఆడపిల్లే పుడుతుందని లింగనిర్ధారణ పరీక్షల్లో గ్రహించిన బావ్‌సింగ్‌ అబార్షన్‌ కోసం ప్రయత్నించాడు. అది తల్లీ బిడ్డలకు ప్రమాదమని వైద్యులు చెప్పారు. ఇదే సమయంలో ఆడపిల్ల కోసం ప్రయత్నిస్తున్న రాజేంద్రప్రసాద్, స్వరూప దంపతులకు వీరు తారసపడ్డారు. ఇందులో ఓ ఆర్‌ఎంపీ వైద్యుడు మధ్యవర్తిత్వం వహించాడు. తన్విత జన్మించాక వారికి అప్పగించి ఒప్పందపత్రం రాసుకున్నారు. దీనిపై పోలీసులు ఆర్‌ఎంపీతోపాటు బావ్‌సింగ్, ఉమలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పడంతో, ఉమ కేసును వాపసు తీసుకుంటానన్నారు. గుంటూరుకు చెందిన ఉన్నత కుటుంబానికి దత్తత ఇస్తున్నట్టు తనకు చెప్పారని, వీరు బాగా చూసు కోకపోవడం వల్లే పోలీసులకు ఫిర్యాదు చేశానని వాంగ్మూలమిచ్చారు. 

కోర్టు తీర్పు మేరకు పాప అప్పగింత 
దర్యాప్తును పూర్తి చేసిన పోలీసులు మహబూబాబాద్‌ కోర్టులో నివేదించారు. ఈ కేసులో కన్న తల్లిదండ్రులు, పెంచిన తల్లిదండ్రులు,  ఆర్‌ఎంపీ వైద్యుడు కూడా శిక్షార్హులేనని నిర్ధారణకొచ్చిన పోలీసులు, ఐసీడీఎస్‌ అధికారులు కోర్టు ఆదేశాల మేరకు చర్యలకు సిద్ధమవుతున్నారు. తన్వితను కోర్టు ఆదేశాల ప్రకారం ఎవరికీ అప్పగించమంటే, వారికి అప్పగిస్తామని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. 

తన్విత బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి
చిన్నారి తన్విత పోషణ బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ టి.వెంకటరత్నం అన్నారు. తన్వితను ఒకవేళ కన్నతల్లికి అప్పగించినా.. పోషించుకునే ఆర్థిక స్థోమతలేని ఆమె మళ్లీ అమ్ముకోదనే నమ్మకం లేదన్నారు.
– డాక్టర్‌ వెంకటరత్నం, రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ 

మరిన్ని వార్తలు