అందరూ ఓటేయాలి: జిల్లా ఎన్నికల అధికారి లోకేశ్‌

6 Dec, 2018 11:49 IST|Sakshi
మాట్లాడుతున్న జిల్లా ఎన్నికల అధికారి లోకేశ్‌కుమార్, పక్కన జేసీ హరీష్‌

ఉజ్వల భవిష్యత్‌కు ఓటు కీలకం

పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశాం 

1,345 ప్రాంతాల్లో 3,092 పోలింగ్‌ స్టేషన్లు 

అందుబాటులో అదనపు ఈవీఎంలు 

నేడు ఎన్నికల సామగ్రిని పోలింగ్‌ కేంద్రాలకు తరలిస్తాం 

జిల్లా ఎన్నికల అధికారి లోకేశ్‌కుమార్‌

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఈనెల ఏడో తేదీన జరిగే శాసనసభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి డీఎస్‌ లోకేశ్‌ కుమార్‌ విజ్ఞప్తి చేశారు. ఉజ్వల భవిష్యత్‌ కావాలంటే అందరూ పోలింగ్‌లో పాల్గొనాలని కోరారు. ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఎన్నికల నిర్వహణపై బుధవారం కలెక్టరేట్‌లోని కోర్టు హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 27.86 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు పేర్కొన్నారు. 1,345 ప్రాంతాల్లో మొత్తం 3,092 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. ఒకే ప్రాంతంలో రెండు మూడు పోలింగ్‌ కేంద్రాలు ఉంటే.. ఓటర్లకు తమ పోలింగ్‌ సెంటర్‌ వివరాలు తెలిపేందుకు గైడ్‌ సెంటర్లను అందుబాటులోకి తెచ్చామన్నారు. మొత్తం 527 సమస్యాత్మకమైన పోలింగ్‌ కేంద్రాలను గుర్తించామని, ఈ కేంద్రాల్లో వెబ్‌ క్యాస్టింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు.

పోలింగ్‌ తీరును పూర్తిగా వీడియో చిత్రీకరిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే అదనపు బలగాలను కూడా మోహరిస్తున్నట్లు చెప్పారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు బిగించి పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. 14 వేల మంది సిబ్బందిని నియమించి శిక్షణ ఇచ్చామన్నారు. ఏడో తేదీన ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. సాయంత్రం 5 గంటలలోపు క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని, ఆ తర్వాత వచ్చే వారిని లోనికి అనుమతించబోమని స్పష్టం చేశారు. గత ఎన్నికల వరకు పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్‌ శాతం తక్కువగా, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా నమోదైందన్నారు. ఈసారి రెండు ప్రాంతాల్లో పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు విస్తృత చర్యలు తీసుకున్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. తాగునీరు, షామియానాలు ఏర్పాటు చేస్తామన్నారు. 46 వేల మంది దివ్యాంగ ఓటర్లు పోలింగ్‌లో పాల్గొంటారని, వారికి ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నామన్నారు.

20 శాతం అదనంగా ఈవీఎంలు...
ఈవీఎం, కంట్రోల్‌ యూనిట్లు సరిపడా ఉన్నాయని తెలిపారు. అదనంగా 20 శాతం ఈవీఎంలను నిల్వ ఉంచామని, గురువారం ఎన్నికల సామగ్రిని పోలింగ్‌ కేంద్రాలకు తరలిస్తామని చెప్పారు. సామగ్రిని అధికారులకు పంపిణీ చేసేందుకు ప్రతి సెగ్మెంట్‌లో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్‌ పూర్తయ్యాక తిరగి సామగ్రిని ఇవే కేంద్రాల వద్ద అప్పగిస్తారని పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో పొల్గొంటున్న అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా పోస్టల్‌ బ్యాలెట్‌ విధానంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. పోలింగ్‌ తీరును పరిశీలించేందుకు కలెక్టరేట్‌లో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు.

677 కేసులు నమోదు...
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు 677 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.3.30 కోట్లను స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశామన్నారు. అలాగే 29 వేల లీటర్ల మద్యం కూడా సీజ్‌ అయిందన్నారు. 80 బెల్ట్‌ షాపులను మూసివేశామన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ హరీష్‌ పాల్గొన్నారు. 

ఓటరు ఐడీ తప్పనిసరి కాదు..
ఓటు వేయడానికి ఓటరు గుర్తింపు కార్డు తప్పనిసరి కాదని లోకేశ్‌కుమార్‌ చెప్పారు. ఓటరు జాబితాలో పేరుండి.. ఎన్నికల సంఘం గుర్తించిన 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదేని ఒకటి ఉంటే సరిపోతుందన్నారు. దీన్ని పోలింగ్‌ స్టేషన్‌లో అధికారులకు చూపించాలన్నారు. కాకపోతే, ఓటర్‌ కార్డు ఉంటే పోలింగ్‌ ప్రక్రియ వేగవంతం అవతుందన్నారు. ఇంటింటికీ ఓటరు స్లిప్పులను అందజేస్తున్నామని చెప్పారు.  ‘నా ఓటు’ యాప్‌ ద్వారా తమ ఓటు ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చన్నారు.

మరిన్ని వార్తలు