నేడే సర్వే

19 Aug, 2014 03:00 IST|Sakshi
నేడే సర్వే
  •     సమగ్ర కుటుంబ సర్వేకు అంతా రెడీ
  •      జిల్లాలో 10.69 లక్షల కుటుంబాలు
  •      విధుల్లో 42,840 మంది ఉద్యోగులు
  •      స్వగ్రామాలకు చేరుకున్న ప్రజలు
  •      కిక్కిరిసిన బస్సులు, రైళ్లు
  •      పల్లెల్లో పండుగ వాతావరణం
  • సాక్షిప్రతినిధి, వరంగల్ : సమగ్ర కుటుంబ సర్వేకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ ప్రజల సామాజిక స్థితిగతులపై సమాచార సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వేను చేపట్టింది. అన్ని సంక్షేమ పథకాలకు, భవిష్యత్ ప్రణాళికలకు ఈ సర్వే సమాచారమే ప్రామాణికమని ప్రభుత్వం చెబుతోంది. దీంతో సర్వేలో వివరాలు నమోదు చేసుకునేందుకు ప్రజలు సొంత ఊళ్ల బాట పట్టారు. ఉద్యోగాలు, ఉపాధి కోసం గుజరాత్, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారు సర్వే కోసం ఊరికి వస్తున్నారు. వరంగల్ నగరం, ఇతర పట్టణాల్లో స్థిరపడిన వారు సొంత ఊళ్లకు చేరుకుంటున్నారు.

    సమగ్ర కుటుంబ సర్వే ఒక్కరోజే ఉండడంతో అందరూ ఒకేసారి సొంత ప్రాంతాలకు వెళ్తున్నారు. దీంతో రైళ్లు, బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. ప్రైవేటు వాహనాలు దొరకడం లేదు. సర్వే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం సెలవు ప్రకటించింది. కార్మిక శాఖ సైతం ప్రత్యేకంగా సెలవు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సోమవారం నుంచే అన్ని పాఠశాలలు, కళాశాలలు, వ్యాపార సంస్థలు సెలవును ప్రకటించేశాయి. అన్ని వర్గాల ప్రజలు ఒకేసారి ఊళ్లకు చేరుతుండడంతో గ్రామాల్లో పండగ వాతావరణ నెలకొంది. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి కొన్నేళ్లుగా ఊళ్లకు రాని వారు సైతం ఇప్పుడు సొంత ప్రాంతాలకు వచ్చారు. ఇతర దేశాల్లో స్థిరపడిన వారు సైతం సర్వేలో వివరాలు నమోదు చేసుకునేందుకు వచ్చారు.
     
    సర్వే నిర్వహణ ఇలా..
     
    2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో మొత్తం 8,86,279 కుటుంబాలు ఉన్నాయి. సమగ్ర సర్వే నేపథ్యంలో వివరాలు తీసుకోవాల్సిన కుటుంబాల సంఖ్యను తేల్చేందుకు జిల్లా యంత్రాంగం ప్రస్తుతం ఉన్న కుటుంబాల సంఖ్యను గుర్తించింది. నాలుగేళ్ల క్రితం నిర్వహించిన జనాభా లెక్కల్లో ఉమ్మడి కుటుంబాలు ఉన్న కొందరు ఇప్పుడు వేర్వేరుగా నమోదు చేసుకుంటున్నారు. ప్రస్తుత అంచనాల ప్రకారం జిల్లాలో 10,69,506 కుటుంబాలు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు.

    ఈ కుటుంబాల వివరాల సేకరణకు ప్రభుత్వ, కాంట్రాక్టు, ప్రైవేటు ఉద్యోగులు కలిపి 42,840 మందిని నియమించారు. ఒక్కో ఉద్యోగి సగటున 30 కుటుంబాల వివరాలను సేకరిస్తారు. మొదట ఒక ఉద్యోగికి 25 కుటుంబాలే అని నిర్ణయించారు. కుటుంబాల సంఖ్య ఎక్కువగా ఉండడంతో వివరాలు సేకరించే ఉద్యోగికి కుటుంబాలను పెంచారు. ఎన్నికల నిర్వహణ తరహాలోనే.. సర్వేలో పాల్గొనే ఉద్యోగులు, సిబ్బందిని గ్రామాలకు తరలించేందుకు 1500 వాహనాలను వినియోగిస్తున్నారు. ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల బస్సులను ఎక్కువగా వినియోగిస్తున్నారు.
     
    సర్వేపై టోల్‌ఫ్రీ నంబర్ల ఏర్పాటు
     
    సమగ్ర కుటుంబ సర్వేపై సందేహాలు, ఫిర్యాదులు ఉన్న వారి కోసం జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా టోల్‌ఫ్రీ నెంబర్లును ఏర్పాటు చేసింది. కలెక్టరేట్ కార్యాలయంలో 18004252747 నంబరుతో టోల్‌ఫ్రీ నెంబరును ఏర్పాటు చేశారు. అలాగే సందేహాలు ఉన్న వారు నేరుగా కలెక్టర్ జి.కిషన్ వినియోగించే 9000114547కు మెస్సేజ్ చేయవచ్చు. వరంగల్ నగర పరిధిలోని వారి కోసం నగరపాలక సంస్థ ప్రత్యేకంగా 18004251980 టోల్‌ఫ్రీ నంబరును ఏర్పాటు చేసింది. ప్రభుత్వం రూపొందించిన వివరాల సేకరణ పత్రంలోని అంశాలను ప్రజలు ఎన్యూమరేటర్(ఉద్యోగులకు)కు వివరించాల్సి ఉంటుంది. వివరాలు సేకరించే వారు... తమ ఇళ్లకు రాకున్నా, అనవసరమైన విషయాలును అడిగినా వీటికి ఫిర్యాదు చేయవచ్చు.
     

మరిన్ని వార్తలు