ప్రతి దానికీ పీడీ యాక్టా..!

14 Jul, 2017 02:27 IST|Sakshi
ప్రతి దానికీ పీడీ యాక్టా..!

పోలీసుల తీరుపై ఉమ్మడి హైకోర్టు తీవ్ర ఆక్షేపణ
నేరాన్ని రుజువు చేయడంలో విఫలమవుతున్నారని వ్యాఖ్య


సాక్షి, హైదరాబాద్‌: నేర తీవ్రతతో సంబంధం లేకుండా పోలీసులు ప్రతీ నేరానికి పీడీ యాక్ట్‌ ప్రయోగిస్తుండటాన్ని ఉమ్మడి హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. సాధారణ నేర చట్టాల కింద కేసులు నమోదు చేయాల్సిన వ్యవహారాల్లోనూ పోలీసులు పీడీ యాక్ట్‌ ప్రయోగిస్తున్నారని, ఇది ఎంత మాత్రం సరికాదంది. సాధారణ కేసులు నమోదు చేసిన పోలీసులు సదరు వ్యక్తులపై నేరాన్ని రుజువు చేయడంలో విఫలమతున్నారని, దీంతో వారు సులభంగా బయటకు వచ్చేస్తున్నారని పేర్కొంది. ఓ వ్యక్తి చర్యలు మొత్తం వ్యవస్థకు ప్రమాదకరంగా మారినప్పుడే ‘పబ్లిక్‌ ఆర్డర్‌’కింద పీడీ యాక్ట్‌ ప్రయోగించాలే తప్ప... ఓ కుటుంబాన్నో, వ్యక్తినో బెదిరించినంత మాత్రాన దానిని ‘పబ్లిక్‌ ఆర్డర్‌’కు వి«ఘాతంగా చూపుతూ పీడీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేయడానికి వీల్లేదంది.

 ప్రస్తుత కేసులో పీడీ యాక్ట్‌ ఎదుర్కొంటున్న చిర్రబోయిన కృష్ణయాదవ్‌ అలియాస్‌ గొల్ల కిట్టుపై ఓ కుటుంబాన్ని బెదిరించారనే ఆరోపణలున్నాయని, ఇందుకు అతనిపై పీడీ యాక్ట్‌ ప్రయోగించారని, ఓ కుటుంబాన్ని బెదిరించినంత మాత్రాన మొత్తం ప్రజా వ్యవస్థ స్తంభించిపోదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇది సరికాందంటూ కృష్ణయాదవ్‌ నిర్భందానికి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది.

వ్యవస్థను ప్రక్షాళన చేయాలి...
రాష్ట్ర ప్రభుత్వం న్యాయ నేర వ్యవస్థలో ఉన్న లొసుగులను పూడ్చి మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేయాలని ధర్మాసనం స్పస్టం చేసింది. నిపుణులైన పోలీసు అధికారులను , అలాగే సమర్థత, తగిన విషయ పరిజ్ఞానం, నిజాయితీ ఉన్న న్యాయవాదులను పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లుగా నియమించుకోవాలంది.

మరిన్ని వార్తలు