ఎన్నికలకు సర్వం సిద్ధం

12 Mar, 2019 12:55 IST|Sakshi

పార్లమెంట్‌ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు

మీడియా సమావేశంలో కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు 

సాక్షి, ఇందూరు(నిజామాబాద్‌ అర్బన్‌) : పార్లమెంట్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన సందర్భంగా ఆ క్షణం నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిందని, ఇటు ఎన్నికల నిర్వహణకు కూడా జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు వెల్లడించారు. సోమవారం స్థానిక ప్రగతిభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల ప్రకారం జిల్లాలో ఎన్నికలను విజయవంతం చేయడానికి అన్ని ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు.

 ఈనెల 18 నుంచి 25 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లను కార్యాలయంలో స్వీకరిస్తామన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్‌లు తీసుకుంటారు. రిటర్నింగ్‌ అధికారిగా జిల్లా కలెక్టర్‌ ఉంటారు.  ఈనెల 26న నామినేషన్ల పరిశీలన, 28 వరకు నామినేషన్‌ల ఉపసంహరణ, ఏప్రిల్‌ 11న పోలింగ్, మే 23న కౌటింగ్‌ ప్రక్రియ ఉంటుందని వివరించారు. నిజామాబాద్‌ పార్లమెంట్‌ సెగ్మెంట్‌ పరిధిలో ఆర్మూర్, బోధన్, నిజామాబాద్‌ అర్బన్, నిజామాబాద్‌ రూరల్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల్‌ నియోజకవర్గాలు ఉన్నాయన్నారు.

నిజామాబాద్‌ సెగ్మెంట్‌లో మొత్తం 15,53,577 మంది ఓటర్లు ఉండగా, 8,14,689 మంది మహిళలు, 7,38,577 మంది పురుషులు, 35 మంది ఇతరులున్నట్లు తెలిపారు. అయితే పోటీ చేసే అభ్యర్థే కాకుండా వారి ప్రపోజల్స్‌ కూడా నామినేషన్‌ వేయవచ్చన్నారు. అభ్యర్థితో కలిపి మొత్తం ఐదుగురు మాత్రమే నామినేషన్‌ వేయడానికి లోపలికి అనుమతించడం జరుగుతుందన్నారు.

నామినేషన్‌ వేయడానికి వచ్చిన సందర్భంలో అభ్యర్థులు, పార్టీలు ఖచ్చితంగా ఎన్నికల ప్రవర్తనా నియామావళిని పాటించాలని, కేవలం మూడు వాహనాలు మాత్రమే ఉపయోగించి వాటిని100 మీటర్ల పరిధిలోనే నిలిపివేయాలని తెలిపారు. పోటీ చేసే అభ్యర్థి రూ.25 వేలు డిపాజిట్‌ చేయాల్సి ఉంటుందని, ఎస్సీ, ఎస్టీకి చెందిన అభ్యర్థులకైతే రూ.12,500 డిపాజిట్‌ చేయాలన్నారు.

అదే విధంగా పార్టీలు, అభ్యర్థులు వివిధ అనుమతుల కోసం ‘సువిధ’ వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఫిర్యాదులు, సూచనల కోసం జిల్లా స్థాయిలో 1950 టోల్‌ఫ్రీ కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడానికి సంసిద్ధులుగా ఉన్నామని, నోడల్‌ అధికారులు, వివిధ రకాల బృందాలను ఏర్పాటు చేసి సన్నాహక సమావేశాలు నిర్వహించుకున్నట్లు తెలిపారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన సందర్భంగా ప్రభుత్వ, ప్రయివేటు ప్రాంతాల్లో, ఆస్తులపై ఉన్న పార్టీల, అభ్యర్థులకు చెందిన జెండాలు, ప్లెక్సీలు, గోడ రాతలు, ప్రభుత్వ పథకాల పోస్టర్‌లను తొలగిస్తున్నట్లు వివరించారు.

నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
ఆర్మూర్, బోధన్, నిజామాబాద్‌ అర్బన్,నిజామాబాద్‌ రూరల్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల

నిజామాబాద్‌ సెగ్మెంట్‌లో ఓటర్లు
పురుషులు : 7,38,577 
మహిళలు : 8,14,689
ఇతరులు : 35
మొత్తం ఓటర్లు :15,53,577 

రాజకీయ పార్టీలతో సమీక్ష...
పార్లమెంట్‌ ఎన్నికలు ప్రశాంతంగా, శాంతియుతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేందుకు రాజకీయ పార్టీలు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు కోరారు. ప్రగతిభవన్‌లో ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడారు. ఎన్నికల నియామవళి తప్పనిసరిగా అందరూ అమలు చేయాలన్నా రు. ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల ప్రకారం ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే సహకరించాలని కోరారు. నామినేషన్‌ వేసే అభ్యర్థులు పాటిం చాల్సిన నిబంధనలను ఈ సందర్భంగా కలెక్టర్‌ వారికి వివరించారు. 

మరిన్ని వార్తలు