ఈవీఎంల మొరాయింపు

8 Dec, 2018 09:29 IST|Sakshi
మున్సిపల్‌ ఇండోర్‌ స్టేడియంలో మొరాయించిన ఈవీఎంను మరమ్మతు చేస్తున్న సిబ్బంది

కొన్నిచోట్ల రెండు గంటలు ఆలస్యంగా పోలింగ్‌ ప్రారంభం   

క్యూలో నిల్చొనే ఓపిక లేక నిరాశతో వెనుదిరిగిన ఓటర్లు  

పోలింగ్‌ కేంద్రాల్లో కనిపించని వీల్‌చైర్లు  

ఇబ్బందులు ఎదుర్కొన్న దివ్యాంగులు, వృద్ధులు   

పలు నియోజకవర్గాల్లో ఓట్ల గల్లంతు

సాక్షి, సిటీబ్యూరో: ఎన్నికల వేళ ఈవీఎంలు మొరాయించాయి. అప్రమత్తమైన అధికారులు కొన్నిచోట్ల వెంటనే రీప్లేస్‌ చేసినప్పటికీ.. మరికొన్ని చోట్ల రెండు గంటలు ఆలస్యంగా పోలింగ్‌ ప్రారంభమైంది. దీంతో ఓటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం 7గంటలకే మహిళలు, వృద్ధులు భారీగా పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నప్పటికీ... తీరా ఈవీఎంలు మొరాయించడంతో గంటల తరబడి క్యూలైన్‌లో నిలబడే ఓపిక లేక చాలామంది నిరాశతో వెనుదిరిగారు. ఇక కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో కనీసం లైటింగ్‌ కూడా లేకపోవడంతో ఈవీఎంలపై అభ్యర్థుల ఫొటోలు, గుర్తులు సరిగా కనిపించక ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేశామని అధికారులు చెప్పినప్పటికీ... పాతబస్తీ సహా ఏ ఒక్క కేంద్రంలోనూ వీల్‌చైర్లు కనిపించలేదు. దీంతో వారిని వలంటీర్లు కుర్చీలపై లోపలికి తీసుకెళ్లారు.  

ఎక్కడెక్కడ అంటే...  
కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ ఓటు ఉన్న రామ్‌నగర్‌లోని జేవీ హైస్కూల్‌లోని బూత్‌ నెంబర్‌.229లోని ఈవీఎం మొరాయించింది.  
ఖైరతాబాద్‌ నియోజకవర్గం బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌.1,2లోని బూత్‌ నెంబర్‌ 245లో సుమారు 1200 ఓట్లు జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలోని బోరబండ డివిజన్‌కు మారాయి. దీంతో వారు ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. అధికారుల నిర్వాకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  
ఎల్లారెడ్డిలోని పీజేఆర్‌ కమ్యూనిటీ హాల్‌ పోలింగ్‌ బూత్‌ సహా న్యూటౌన్‌ స్కూల్లోని పోలింగ్‌ బూత్‌లలో  ఈవీఎంలు మొరాయించడంతో ఓటింగ్‌ ఆలస్యమైంది.  
రామంతాపూర్‌లోని బూత్‌ నెంబర్‌ 259లో ఈవీఎం బ్యాటరీ చార్జింగ్‌ అయిపోవడంతో మెషిన్‌ మొరాయించింది. ఓటింగ్‌ మొదలై రెండు గంటలు దాటినా సమస్య పరిష్కారం కాకపోవడంతో ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప్పల్‌ హెచ్‌బీ కాలనీలో భారీగా ఓట్లు గల్లంతయ్యాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటు వేసిన వారి ఓట్లు సైతం ప్రస్తుత ఎన్నికల్లో లేకపోవడంతో వారంతా ఆందోళనకు దిగారు. చర్లపల్లిలోని శాంతినికేతన్‌ స్కూల్లో ఈవీఎం మొరాయించింది. మల్లాపూర్‌ జాన్సీ స్కూల్లోని 143 పోలింగ్‌ బూత్‌లో ఓటింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. నాచారం ఎర్రకుంటలోని 187 పోలింగ్‌ బూత్‌లోని ఈవీఎం మొరాయించడంతో అధికారులు కొంతసేపు పోలింగ్‌ను నిలిపివేశారు.  
కూకట్‌పల్లి బూత్‌ నెంబర్‌.12లోని ఈవీఎం మొరాయించడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే ఈవీఎంను రీప్లేస్‌ చేసి సమస్యను పరిష్కరించారు. ఇదే నియోజకవర్గ పరిధిలోని బూత్‌నెంబర్‌ 203లో ఈవీఎం పనిచేయకపోవడంతో ఓటర్లు నిరాశతో వెనుదిరిగారు. అదే విధంగా ఫతేనగర్‌లోని బూత్‌నెంబర్‌ 135లో ఈవీఎం పనిచేయలేదు. మూసాపేట మున్సిపల్‌ కార్యాలయంలోని 193 పోలింగ్‌ బూత్‌లో లైటింగ్‌ లేకపోవడంతో ఐవీ ప్యాడ్‌పై అభ్యర్థుల ఫొటో, పార్టీ గుర్తు కన్పించకపోవడంతో ఓటర్లు ఇబ్బంది పడాల్సి వచ్చింది.  
కంటోన్మెంట్‌లోని బూత్‌ నెంబర్‌ 78లో ఈవీఎం మొరాయించడంతో ఓటర్లు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది.  
రాంగోపాల్‌పేట కుర్మబస్తీలో సెయింట్‌ ఆంథోనిస్‌ స్కూల్లోని పోలింగ్‌ బూత్‌ 11లో 11మంది తమ ఓట్లు వేసిన తర్వాత మెషిన్‌ మొరాయించింది. ఓల్డ్‌బోయిగూడలోని బూత్‌ నెంబర్‌.46లో కూడా మెషిన్‌  మొరాయించింది.
మలక్‌పేట నియోజకవర్గ పరిధిలోని బూత్‌ నెంబర్‌ 185, 58లతోని ఈవీఎంలు మొరాయించాయి. ఓటర్లు గంటల తరబడి క్యూలైన్‌లో ఎదురుచూడాల్సి వచ్చింది. వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.  
మల్కజ్‌గిరిలోని ఆనంద్‌బాగ్‌లోని గుడ్‌షప్పర్డ్‌ స్కూల్‌లో పని చేయలేదు. బాలుర ఉన్నత పాఠశాలలో ఈవీఎం మొరాయించింది.  
చాంద్రాయణగుట్ట రాజన్నబావి సెయింట్‌ మేరీస్‌ స్కూల్‌లో ఈవీఎం మొరాయించింది. యాకుత్‌పురా నియోజకవర్గం కుర్మగూడలోని బూత్‌ నెంబర్‌78లో ఈవీఎం మొరాయించడం తో ఓటర్లు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది.  
జాంబాగ్‌ డివిజన్‌లో భారీగా ఓట్లు గల్లంతవడంతో ఓటర్లు ఆందోళనకు దిగారు.  
శేరిలింగంపల్లి బూత్‌ నెంబర్‌ 69, విట్టల్‌రావునగర్‌ ఇమేజ్‌ ఆస్పత్రి ఎదురుగా ఉన్న పోలింగ్‌ కేంద్రం, చందానగర్‌లోని సరస్వతి విద్యామందిలోని బూత్‌ నెంబర్‌ 87 సహా భవానీపురం బూత్‌ నెంబర్‌ 141, ఆల్వీన్‌కాలనీ మాంటిస్సోరీ స్కూల్లోని బూత్‌నెంబర్‌ 462లోని ఈవీఎంలు సైతం మొరాయించాయి.  

మరిన్ని వార్తలు