బ్యాలెట్‌ పాయె.. ఈవీఎం వచ్చె!

20 Mar, 2019 10:57 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: గతంలో జరిగిన ఎన్నికల్లో ఓటు వేసేందుకు బ్యాలెట్‌ను వాడేవారు. ప్రస్తుతం వాటి స్థానంలో ఈవీఎంలు రావడంతో చెల్లని ఓట్లు చెక్‌ పడింది. ఎన్నికల సంఘం ఈవీఎంలు ప్రవేశపెట్టాక ఆ సమస్య తొలగిపోయింది. ఈవీఎంలు రాకముందు బ్యాలెట్‌ పేపరుపై ఓటు వేసే పద్ధతి ఉండటంతో చెల్లని ఓట్ల సంఖ్య అధికంగా ఉండేది. బ్యాలెట్‌ పేపరుపై నచ్చిన అభ్యర్థి గుర్తుపై స్వస్తిక్‌ ముద్రతో ఓటు వేసేవారు. కొందరు ఓటర్లు తికతిక పడి ఒకటి, రెండు గుర్తులపై స్వస్తిక్‌ ముద్ర వేయడం, లేక ముద్ర పడకపోవడం, ఖాళీ పేపర్‌ బ్యాలెట్‌ బాక్స్‌లో వేయడంతో చెల్లని ఓట్లు అధికంగా ఉండేవి. ఈ క్రమంలో గెలిచిన అభ్యర్థులకు వచ్చిన మెజారిటీ కంటే చెల్లని ఓట్ల సంఖ్యే ఎక్కువగా ఉండేది. ఎన్నికల సంఘం కొత్తగా ప్రవేశపెట్టిన ఈవీఎంలతో చెల్లని ఓట్లకు చెక్‌ పడింది. గెలిచిన, ఓడిన అభ్యర్థుల ఓట్లు మాత్రమే పడుతున్నాయి. ఈ క్రమంలో ప్రతి ఓటరు తనకు నచ్చిన అభ్యర్థి పేరుకు ఎదురుగా ఉన్న బటన్‌ నొక్కాలి. అనంతరం తన ఓటు ఎవరికి వేశారో తెలుసుకునే విధంగా వీవీ ప్యాట్‌లను ప్రవేశపెట్టింది. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులెవరూ నచ్చకపోతే నోటా ఎంచుకునే వెసులుబాటును సైతం కల్పించింది ఎన్నికల సంఘం. దీంతో ఎన్నికల్లో చెల్లని ఓటంటూ లేదనే విషయం తేటతెల్లమైంది.

మరిన్ని వార్తలు