ఎస్సీ, ఎస్టీలకు పరిహారం పెంపు

14 May, 2015 02:05 IST|Sakshi
ఎస్సీ, ఎస్టీలకు పరిహారం పెంపు

* అత్యాచారాల నిరోధక చట్టం కింద సవరించిన పరిహారాలు..
* ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
* గత ఏడాది జూన్ 23 నుంచి వర్తింపు  
 
 సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్ కులాలు, తెగలకు చెందిన వారు అత్యాచారాలు, దాడులకు గురైన సందర్భం లో ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం,1989 కిం ద ఇచ్చే నష్టపరిహారాన్ని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం సవరించిన ఉత్తర్వులను జారీచేసింది. ఈ ఉత్వర్వులు గత ఏడాది 23 జూన్ నుంచి అమల్లోకి వస్తాయని బుధవారం రాత్రి ఎస్సీ అభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి (ఎఫ్‌ఏసీ) జె.రేమండ్‌పీటర్ ఆదేశాలు జారీచేశారు.
 
 ఆయా కేసులకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చే సవరించిన పరిహారాలు ఇలా...
-  ఎస్సీ, ఎస్టీలు వినియోగించే నీటి వనరులను ఎవరైనా కలుషితం చేస్తే రూ.3.75 లక్షల వరకు పరిహారం. లేదా మొత్తం నీటిని శుద్ధి చేస్తారు.
-   తప్పుడు పద్ధతుల్లో ఎవరైనా ఎస్సీ, ఎస్టీల భూమిని ఆక్రమించి, సాగు చేసుకుంటుంటే నేర తీవ్రతను బట్టి కనిష్టంగా రూ.90 వేలు అంత కంటే ఎక్కువ చెల్లిస్తారు.
 - మహిళలపై అత్యాచారం, లైంగికంగా వేధించడం వంటి వాటికి రూ. 1.8 లక్షల మొత్తం బాధితురాలికి చెల్లింపు.
-   హత్యకు గురైతే సంపాదన ఉన్న వ్యక్తి విషయంలో రూ.7.5 లక్షలు.. సంపాదన లేనివారికి రూ.3.75 లక్షలు.
-   దాడుల్లో వంద శాతం అంగవైకల్యానికి గురైతే కుటుంబ సంపాదన చేసేవారికి రూ.7.5 లక్షలు.. సంపాదన లేనివారికి రూ.3.75 లక్షలు.
 -  ఇళ్లు పూర్తిగా తగలబడడం లేదా ధ్వంసమైతే ఇటుకలతో ఇంటి నిర్మాణం లేదా దానికయ్యే ఖర్చును ప్రభుత్వ లెక్కల ప్రకారం చెల్లించడం.
-  హత్య, అత్యాచారం, గ్యాంగ్‌రేప్, పూర్తి అంగవైకల్యం, దోపిడీ వంటి కేసుల్లో ప్రభుత్వపరంగా స హాయంతో పాటు చనిపోయిన ఎస్సీ, ఎస్టీల భార్యలు లేదా వారిపై ఆధారపడినవారికి నెలకు రూ.4,500 చొప్పున పెన్షన్, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం లేదా వ్యవసాయ భూమి, లేదా ఒక ఇల్లు ఇస్తారు.
-   అవమాన ం, అడ్డుకోవడం వంటి వాటికి ఒక్కొక్కరికి రూ.90 వేల వరకు.
 -  భూమికి లేదా ఇతరత్రా దారి ఇవ్వకపోవడం.. రూ.3.75 లక్షల వరకు.
-   ఇంటిని వదిలిపెట్టి వెళ్లేలా చేసినందుకు ఒక్కో బాధితుడికి రూ.90 వేల చొప్పున చెల్లిస్తారు.
 -  ఎస్సీ, ఎస్టీలకు వ్యతిరేకంగా ఎవరైనా తప్పుడు సాక్ష్యం ఇచ్చిన కేసులో కనిష్టంగా రూ.3.75 లక్షలు లేదా పూర్తి నష్టపరిహారం
-  ఓటు హక్కును వినియోగించుకోకుండా ఎవరైనా నిరోధించిన కేసుల్లో రూ.75 వేల వరకు.

మరిన్ని వార్తలు