‘ప్రాణహిత’ సాధించే వరకు పోరాటం

20 Jul, 2018 12:43 IST|Sakshi
ఐక్యత చాటుతున్న అఖిలపక్షం నేతలు

మంచిర్యాలటౌన్‌: వార్దానది ప్రాజెక్టును ఆపే వరకు పోరాడి, ప్రాణహిత ప్రాజెక్టును సాధించే వరకు పోరాటం తప్పదని అఖిలపక్షం నేతలు అన్నారు. పట్టణంలోని ఎఫ్‌సీఏ ఫంక్షన్‌హాలులో గురువారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో నీటికి కొదువ లేదని, కానీ ఒక్క ఎకరానికి కూడా సాగునీటిని అందించే ప్రాజెక్టులు లేవన్నారు. మన జిల్లాలో పారుతున్న నదుల నీటిని ఇతర జిల్లాలకు తరలిస్తున్నారని, అక్కడ రెండు నుంచి మూడు పంటలకు సాగునీరు అందుతుందని, మన వద్ద కనీసం ఒక్క పంటకు కూడా సరిపడా నీటిని అందించని దౌర్భాగ్యపు పరిస్థితి ఉందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ హయాంలోనే సాగునీటి ప్రాజెక్టులను ఒక ప్రణాళిక ప్రకారం డిజైన్‌ చేసి, వాటి నిర్మాణం కోసం కృషి చేస్తే, కేసీఆర్‌ ఆ ప్రాజెక్టుల డిజైన్లు మార్చి, దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఉమ్మడి జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీటిని అందించే వరకు తమ పోరాటం తప్పదన్నారు.

అనంతరం ఇతర నేతలు మాట్లాడుతూ ప్రాణహిత ప్రాజెక్టును వార్ధానదిపైకి మార్చి కేసీఆర్‌ తమ ముంబాయి 148 మీటర్ల ఒప్పందాన్ని తనే తుంగలో తొక్కారని, కమీషన్ల కోసం కాళేశ్వరానికి మార్చి ప్రాణహిత ప్రాణం తీశారని అన్నారు. కేసీఆర్‌ నిర్ణయంపై మరో తెలంగాణ ఉద్యమం మాదిరి, నీటి కోసం ఉద్యమాన్ని చేపడతామని, గతంలో ప్రాణహిత ప్రాజెక్టు కోసం 70 శాతం పైప్‌లైన్‌ పనులను పూర్తి చేసిందని, కేవలం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తే సరిపోయేదని అన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు మార్పుతో కనీసం వెయ్యి ఎకరాలకు కూడా నీరు పారేందుకు అవకాశం లేదని, ప్రజల్లోకి ఇదే విషయాన్ని తీసుకెళ్లి, ప్రభుత్వంతో పోరాటం చేసేందుకు అన్ని పార్టీల నేతలు సిద్ధంగా ఉండాలని కోరారు.

తెలంగాణకు ఎనలేని మేలుచేసే ప్రాణహితను 148 మీటర్ల మైలారం నుంచి 138 మీటర్ల గోదావరి(సుందిళ్ల 132 మీ)లకు అనుసంధానం చేస్తే సంపూర్ణ గ్రావిటీ కాలువకు, కేసీఆర్‌ ప్రభుత్వం తీసుకున్న వార్దా్టకు బదులు ప్రాణహిత ప్రాజెక్టును మార్చే నిర్ణయం గొడ్డలిపెట్టులాంటిది అన్నారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కలవేని శంకర్, సీపీఐ(ఎంఎల్‌), కాంగ్రెస్‌ పార్టీకి చెందిన దుర్గం అశోక్, చిట్ల సత్యనారాయణ, గరిగంటి కొమురయ్య, టీడీపీ పట్టణ అధ్యక్షుడు గోపతి మల్లేశ్, ఐఆర్‌సీపీ నాయకులు నైనాల వెంకటేశ్వర్లు, జయరావు, జలసాధన సమితి అధ్యక్షుడు నైనాల గోవర్దన్, రాజేశ్‌ నాయక్, రఘునాథరెడ్డి, తెలంగాణ జనసమితి నాయకులు శ్యాంసుందర్‌రెడ్డి, క్యాతం రవికుమార్, దుర్గం నరేశ్, బదావత్‌ రమేశ్‌ నాయక్, వొడ్నాల శ్యాం, రాంచందర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు