మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య కన్నుమూత

10 Apr, 2020 02:55 IST|Sakshi
కావేటి సమ్మయ్య(ఫైల్‌)

కాగజ్‌నగర్‌: కుమురం భీం జిల్లా సిర్పూర్‌ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు కావేటి సమ్మయ్య (63) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో గుండెపోటు రావడంతో స్థానికంగా ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా..చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు భార్య కావేటి సాయిలీల, ముగ్గురు కుమారులు ఉన్నారు. తొలుత కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న సమ్మయ్య 2007లో టీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాగజ్‌నగర్‌ పట్టణంలో సాగిన 300 రోజుల రిలే దీక్ష శిబిరాన్ని ముందుండి నడిపించారు.

2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున బరిలో నిలిచి కాంగ్రెస్‌ అభ్యర్థి కోనేరు కోనప్పపై 7 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రాష్ట్ర సాధనలో భాగంగా 2010లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ ఉప ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్‌ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిపై 15 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్రత్యేక రాష్ట్రం కోసం 2012లో అసెంబ్లీ భవనంపై ఎక్కి నల్ల జెండాతో నిరసన తెలిపారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కావేటి సమ్మయ్య బీఎస్పీ అభ్యర్థి కోనేరు కోనప్ప చేతిలో ఓటమి పాలయ్యారు. కొన్ని కారణాల వల్ల 2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు సమ్మయ్య మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు.

కావేటి మృతిపై కేసీఆర్‌ సంతాపం 
సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కావేటి చేసిన సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు.

తెలంగాణ ఉద్యమంలో కావేటి పాత్ర మరువలేనిది: కేటీఆర్‌ 
కావేటి సమ్మయ్య మరణం పట్ల టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌సహా పలువురు సంతాపం తెలిపారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో సమ్మయ్య చురుగ్గా పనిచేశారని కేటీఆర్‌ గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమకారుడిగా కావేటి పాత్ర మరువలేనిదని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, పువ్వాడ అజయ్, శ్రీనివాస్‌గౌడ్, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ తదితరులు సమ్మయ్య మరణం పట్ల సంతాపం ప్రకటించారు.

మండలి చైర్మన్, స్పీకర్‌ సంతాపం 
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుకుగా పనిచేసిన కావేటి సమ్మయ్య మరణం పట్ల శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో సంతాపం వ్యక్తం చేశారు. సమ్మయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మరిన్ని వార్తలు