రెండోసారి విచారణకూ రవిప్రకాశ్‌ గైర్హాజరు

13 May, 2019 01:57 IST|Sakshi

తదుపరి చర్యల కోసం న్యాయ సలహా తీసుకుంటున్న పోలీసులు

సోమవారం హాజరుకాని పక్షంలో వారంట్‌ ద్వారా అరెస్టు చేసే చాన్స్‌

మూడోరోజు కూడా విచారణకు హాజరైన మాజీ సీఎఫ్‌ఓ మూర్తి

సాక్షి, హైదరాబాద్‌: టీవీ9 వాటాల వ్యవహారంలో నకిలీ పత్రాల సృష్టి, సంతకం ఫోర్జరీ కేసులో ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశ్‌ రెండో నోటీసుకు కూడా స్పందించకపోవడంతో సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తదుపరి చర్యలకు ఉపక్రమిస్తున్నారు.160 సీఆర్‌పీసీ కింద ఇప్పటికే రెండుసార్లు నోటీసులు జారీ చేసినా పోలీసు విచారణకు రవిప్రకాశ్‌ హాజరు కాకపోవడంతో తదుపరి చర్యల కోసం న్యాయసలహాను తీసుకుంటున్నారు. ఒకవేళ సోమవారం రవిప్రకాశ్‌ విచారణకు హాజరైతే ఓకే కానీ, లేనిపక్షంలో వారంట్‌ ద్వారా అరెస్టు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పోలీసు వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు చట్టబద్ధంగా అందుబాటులో ఉన్న ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా సోమవారం తర్వాత పరిణామాలు ఏవిధంగా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.

సీఆర్‌పీసీ 160 కింద శనివారం జారీ చేసిన నోటీసును బంజారాహిల్స్‌లోని రవిప్రకాశ్‌ ఇంటి గోడకు అంటించిన సంగతి తెలిసిందే. పోలీసుల విచారణకు ఒక్కరోజులో హాజరు కావాలంటూ ఆ నోటీసులో పేర్కొన్న ఆదివారం గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసు స్టేషన్‌కు రవిప్రకాశ్‌ రాలేదు. అయితే, అలంద మీడియా సంస్థ డైరక్టర్‌ కౌశిక్‌రావు ఇచ్చిన ఫిర్యాదుపై సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు ఏప్రిల్‌ 24, 30 తేదీల్లో రెండు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదైన విషయాలపై 160 సీఆర్‌పీసీ కింద రవిప్రకాశ్, సినీ నటుడు శివాజీ, మాజీ సీఎఫ్‌ఓ మూర్తికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. వీటికి మూర్తి ఒక్కరే స్పందించి గత మూడ్రోజుల నుంచి పోలీసుల ఎదుట హాజరై విచారణకు సహకరిస్తున్నారు. రవిప్రకాశ్, శివాజీలు మాత్రం ఇంత వరకు హాజరుకాలేదు.

అయితే రవిప్రకాశ్, శివాజీలు పది రోజుల గడువు కోరినప్పటికీ దర్యాప్తులో తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వారికి అంత సమయం ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఫోర్జరీ కేసులో విచారణకు టీవీ9 మాజీ సీఎఫ్‌ఓ మూర్తి ఆదివారం మూడోరోజూ సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసుల ఎదుట హాజరయ్యారు. అతనితో పాటు హెచ్‌ఆర్, అడ్మిన్, అకౌంట్స్‌ వ్యవహారాలు చూస్తున్న ముగ్గురు కూడా పోలీసుల ఎదుట హాజరైనట్టు తెలిసింది. వీరిచ్చిన వివరాలతో  పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఫోర్జరీ ఎవరు చేశారు.. ఎందుకు చేశారు.. ఎవరి కోసం చేశారు.. ఎలా చేశారు.. ఇలా ప్రతి ఒక్క విషయాన్ని సున్నితంగా తెలుసుకునే దిశగా విచారణ చేస్తున్నారు. సైబర్‌ క్రైం డీసీపీ రోహిణీ ప్రియదర్శిని సారథ్యంలోని సైబర్‌ క్రైమ్‌ బృందం ఈ కేసు విచారణను పకడ్బందీగా చేస్తోంది.

>
మరిన్ని వార్తలు