పార్టీలకతీతంగా మహనీయులకు నివాళి: కేటీఆర్‌ 

27 Jun, 2020 02:11 IST|Sakshi
శుక్రవారం పీవీ జ్ఞానభూమి వద్ద అధికారులతో మాట్లాడుతున్న కేటీఆర్‌

పీవీ శతజయంతి ఏర్పాట్ల పరిశీలన 

సాక్షి, హైదరాబాద్‌: దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు ఘననివాళులర్పించేందుకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. ఈనెల 28న ప్రపంచ వ్యాప్తంగా పీవీ శతజయంతి నిర్వహించనున్నారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ నెక్లెస్‌రోడ్డులోని పీవీ జ్ఞానభూమిని సందర్శించి ఏర్పాట్ల తీరును పరిశీలించారు. ఏడాది పొడవునా నిర్వహించే శతజయంతి కార్యక్రమాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరూ పాల్గొంటారని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. అంతకుముందు కేటీఆర్‌ ఎన్నారైలతో మాట్లాడుతూ తెలంగాణ అస్థిత్వానికి అండగా నిలిచిన మహనీయులను స్మరించుకునే దిశగా తమ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని, పార్టీలకతీతంగా ముందుకువెళ్తోందని తెలిపారు. అందులో భాగంగానే పీవీ, వెంకటస్వామి, ఈశ్వరీభాయి, కొమరంభీం, జయశంకర్‌ తదితరులకు ఘననివాళులర్పిస్తున్నామని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ ఏడాది మొత్తం జరిగే ఉత్సవాలకు సంబంధించి సమన్వయం చేసుకునేందుకు ఎన్‌ఆర్‌ఐ కోఆర్డినేటర్‌ మహేశ్‌ బిగాలను శత జయంత్యుత్సవాల కమిటీలో సభ్యుడిగా చేర్చుతున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు