ఎస్‌బీఐ కనీస బ్యాలెన్స్‌ చార్జీల తగ్గింపు

14 Mar, 2018 00:38 IST|Sakshi

75 శాతం మేర తగ్గుదల

ఇకపై నగరాల్లో నెలకు రూ. 15, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 10

ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి

ముంబై: ఖాతాదారులకు ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) కనీస బ్యాలెన్స్‌ పెనాల్టీ చార్జీలను 75 శాతం మేర తగ్గించింది. దీంతో ఇకపై నగరాల్లో నెలకు సగటు బ్యాలెన్స్‌ పరిమితులను పాటించని పక్షంలో రూ. 15 (పన్నులు అదనం), సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో రూ. 12, గ్రామీణ ప్రాంతాల్లోనైతే రూ. 10 విధించనుంది. ప్రస్తుతం మెట్రోలు, అర్బన్‌ ప్రాంతాల్లో ఈ చార్జీలు గరిష్టంగా నెలకు రూ. 50 (పన్నులు అదనం), సెమీ అర్బన్‌.. గ్రామీణ ప్రాంతాల్లో రూ. 40గా ఉన్నాయి.

కొత్త మార్పులు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే, పెనాల్టీ చార్జీలను తగ్గించినప్పటికీ కనీస బ్యాలెన్స్‌ పరిమితులను మాత్రం ఎస్‌బీఐ యథాతథంగానే ఉంచింది. దీని ప్రకారం ఇకపై కూడా మెట్రో నగరాల్లో కనీస నెలవారీ బ్యాలెన్స్‌ పరిమితి రూ. 3,000 గాను, సెమీ అర్బన్‌ ఖాతాల్లో రూ. 2,000, గ్రామీణ ప్రాంతాల ఖాతాల్లో రూ. 1,000గాను కొనసాగుతుంది. కనీస బ్యాలెన్స్‌ నిబంధనలను అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా పెనాల్టీ చార్జీలు విధిస్తూ.. భారీ లాభాలు గడిస్తోందంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఎస్‌బీఐ తాజా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

పెనాల్టీ చార్జీల తగ్గింపుతో బ్యాంకు ఫీజు ఆదాయం కొంత మేర తగ్గనుంది. ‘ఖాతాదారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం చార్జీలను తగ్గించడం జరిగింది. కస్టమర్స్‌ ప్రయోజనాలే మా ప్రధాన లక్ష్యం‘ అని ఎస్‌బీఐ ఎండీ (రిటైల్, డిజిటల్‌ బ్యాంకింగ్‌) పి.కె. గుప్తా తెలిపారు. దాదాపు అయిదేళ్ల విరామం అనంతరం గతేడాది ఏప్రిల్‌లో కనీస నెలవారీ బ్యాలెన్స్‌ చార్జీలను మళ్లీ ప్రవేశపెట్టింది.

ఆ తర్వాత అక్టోబర్‌లో వీటిని కొంత సవరించింది. ఏప్రిల్‌–నవంబర్‌లో ప్రధానంగా ఇలాంటి చార్జీల ద్వారానే ఎస్‌బీఐ ఏకంగా రూ. 1,772 కోట్లు ఆర్జించినట్లు ఆర్థిక శాఖ గణాంకాల్లో వెల్లడైంది. ఇది బ్యాంకు రెండో త్రైమాసికం లాభం కన్నా అధికం కావడం గమనార్హం. దీనిపై తీవ్ర   విమర్శలు వెల్లువెత్తాయి. ఈ  నేపథ్యంలో ఎస్‌బీఐ తాజా చర్య తీసుకుంది. ఎస్‌బీఐకి 41 కోట్ల పొదుపు ఖాతాలు ఉన్నాయి.

వీటిలో 16 కోట్లు ప్రధానమంత్రి జన ధన యోజన/ బేసిక్‌ సేవింగ్స్‌ బ్యాంక్‌ డిపాజిట్స్, పింఛనర్లు మొదలైన వర్గాలకు చెందినవి. వీటిపై కనీస బ్యాలెన్స్‌ చార్జీలు లేవు. దీంతో ప్రస్తుత సవరణతో దాదాపు 25 కోట్ల ఖాతాదారులకు ప్రయోజనం చేకూరనుంది. కనీస బ్యాలెన్స్‌ చార్జీల బాదరబందీ లేకుండా సేవింగ్స్‌ ఖాతా నుంచి కావాలంటే ప్రాథమిక సేవింగ్స్‌ ఖాతా (బీఎస్‌బీడీ)కి కూడా బదలాయించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు గుప్తా వివరించారు.   

ఎస్‌బీఐలో 41.2 లక్షల ఖాతాలు క్లోజ్‌
ఇండోర్‌: ప్రభుత్వరంగ ఎస్‌బీఐ కనీస నిల్వలేమి కారణంగా గతేడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది జనవరి వరకు ఏకంగా 41.2 లక్షల సేవింగ్స్‌ బ్యాంకు ఖాతాలను మూసేసింది. కనీస బ్యాలెన్స్‌ల నిర్వహణలో విఫలమైతే చార్జీల విధింపును గతేడాది ఏప్రిల్‌ నుంచి బ్యాంకు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

అలాగే, ఏప్రిల్‌ నుంచి ఎస్‌బీఐలో అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకుల విలీనం జరిగిన విషయం గమనార్హం. కనీస నిల్వ లేని కారణంగా వాటికి నిధులు కేటాయింపులు చేయాల్సి ఉండటంతో 41.16 లక్షల ఖాతాలను మూసేసినట్టు సమాచార హక్కు చట్టం కింద వచ్చిన దరఖాస్తుకు ఎస్‌బీఐ సమాధానం ఇచ్చింది.

మరిన్ని వార్తలు