నర్మెటలో కొనసాగుతున్న తవ్వకాలు

24 Mar, 2017 00:59 IST|Sakshi
నర్మెటలో కొనసాగుతున్న తవ్వకాలు

వెలుగుచూసిన ప్రాచీన మానవుడి అస్థికలు
నంగునూరు: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో పురావస్తుశాఖ అధికారులు చేపట్టిన తవ్వకాల్లో ఆదిమమానవుడి ఆనవాళ్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటికే మట్టి కుండలు, రాతి పనిముట్లను కనుగొన్న అధికారులు.. గురువారం ప్రాచీన మానవుడి అస్థికలను వెలికితీశారు. ఇందులో 1.80 సెం.మీ ఎముకతోపాటు, సుమారు పది వరకు చిన్నచిన్న ఎముక ముక్కలు ఉన్నాయి. ఆయుధాలను పదును పెట్టేందుకు ఉపయోగించే రాతి బండ కూడా దొరికింది.

 మెన్‌హీర్‌ వద్ద సుమారుగా పది అంగుళాల వరకు మట్టిని తొలగించారు. నాలుగు చోట్ల ఇంకా తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సందర్భంగా పురావస్తు శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నాగరాజు మాట్లాడుతూ తవ్వకాల్లో భాగంగా ఇప్పటికే మట్టి కుండలు, మృణ్మయ పాత్రలు, వేటకు ఉపయోగించే రాతి మొన, ఉలి లభించాయని చెప్పారు. మట్టి కుండల్లో ధాన్యాన్ని నిల్వ ఉంచినట్లు తెలుస్తోందన్నారు.

పాలమాకులలో నాలుగు రోజులుగా రెండు సమాధులను తవ్వుతున్నామని, వారం రోజుల్లో మరిన్ని అవశేషాలు బయటపడే అవకాశముందని పేర్కొన్నారు. తవ్వకాలను చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి ప్రజల భారీగా తరలివస్తున్నారు. సిద్దిపేట ఏసీబీ నర్సింహారెడ్డి, డీఆర్‌డీఓ సత్యనారాయణరెడ్డిసహా, పలువురు అధికారులు తవ్వకాలను ఆసక్తిగా తిలకించారు.

మరిన్ని వార్తలు