తెలంగాణకు మొండిచేయి

2 Mar, 2015 03:45 IST|Sakshi
తెలంగాణకు మొండిచేయి

విభజన హామీలు తప్ప కొత్త కేటాయింపులేమీ లేవు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ తెలంగాణను నిరాశపరిచింది. ‘పునర్విభజన సందర్భంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చట్టపరంగా ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కేంద్రం కట్టుబడి ఉంది...’ అన్న మాటమాత్ర ప్రస్తావన తప్ప తెలంగాణకు ప్రత్యేక హోదా గానీ, నిధులు గానీ ఈ బడ్జెట్‌లో ఏమీ దక్కలేదు. రాబోయే ఐదేళ్లలో స్థాపించే కొత్త పరిశ్రమలకు 15 శాతం అదనపు పన్ను రాయితీ,  పన్ను తరుగుదలలో 15 శాతం రాయితీ ఇస్తున్నట్లు మాత్రం ప్రకటించారు.

2015 ఏప్రిల్ నుంచి 2020 మార్చి 31 వరకు స్థాపించే యూనిట్లకు ఈ సదుపాయం వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ పేర్కొనడం పరిశ్రమలకు ఊరటనిచ్చే పరిణామమే. అయినా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆశించిన విధంగా కేంద్రం నుంచి ప్రోత్సాహకాలు అందకపోవటం నూతన పారిశ్రామిక విధానాన్ని ఎంచుకున్న తెలంగాణ పురోగతికి కళ్లెం వేసినట్లయింది. గత బడ్జెట్‌లో ప్రస్తావించిన ఉద్యానవన వర్సిటీకి రూ.75 కోట్లు కేటాయించటం కొంత ఊరటనిచ్చింది.

వారసత్వ సంపద పరిరక్షణ చర్యల్లో భాగంగా హైదరాబాద్‌లోని కుతుబ్‌షాహీ టూంబ్స్‌కు చోటు దక్కడంతో పర్యాటకాభివృద్ధికి కొత్త బాటలు వేసినట్లయింది.  హైదరాబాద్ ఐఐటీకి రూ.55 కోట్ల కేటాయింపులు, గిరిజన వర్సిటీకి రూ.కోటి మాత్రం ఈ బడ్జెట్‌లో తెలంగాణకు సంబంధించిన పద్దులుగా కనిపించాయి. వాటర్ గ్రిడ్, మిషన్ కాకతీయ తదితర పథకాలకు ఆర్థిక సాయం చేయాలని సీఎం పలుమార్లు ఢిల్లీకి వెళ్లి చేసిన అభ్యర్థనలను కేంద్రం పట్టించుకోలేదు.
 
వాటా పెరిగినా అంతే..

కేంద్ర పన్నుల వాటాల్లో రాష్ట్రాలకు 42 శాతం కేటాయించాలన్న నిర్ణయంతో భారీ మొత్తంలో నిధులు వస్తాయని ఆశపడ్డ తెలంగాణకు, పంపిణీ వాటా తగ్గటంతో నష్టం వాటిల్లింది. పైగా రాష్ట్రాల్లో అమలవుతున్న కేంద్ర ప్రాయోజిత పథకాల వాటాను ఈ బడ్జెట్‌లో దాదాపు 27 శాతం మేరకు తగ్గించారు. దాంతో పది శాతం పన్నుల వాటా పెరిగినా మొత్తంమీద ఏటా కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులేమీ పెరగకపోవచ్చని ఆర్థిక శాఖ వర్గాలంటున్నాయి.
 
కొత్త సాయం అందకపోగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి (బీఆర్‌జీఎఫ్) పథకాన్ని రద్దు చేయటంతో తెలంగాణకు అన్యాయం జరిగింది. రాష్ట్రంలో 9 జిల్లాలు వెనుకబడిన ప్రాంతాల జాబితాలోనే ఉన్నాయి. ఏటేటా ఈ ప్రాంతాల్లో రోడ్డు, మౌలిక వసతుల కల్పనకు కేంద్రం బీఆర్‌జీఎఫ్  కింద రూ.255 కోట్లు విడుదల చేసేది. దీనికి తోడు గ్రామపంచాయతీల అభివృద్ధికి రాజీవ్‌గాంధి శశక్తీకరణ్ పథకంలో భాగంగా ఏటా రూ.150 కోట్లు కేంద్రం నుంచి విడుదలవుతున్నాయి. ఈ పథకాలను ఉపసంహరించుకోవటంతో ఏటా రూ.400 కోట్ల మేరకు లోటు ఏర్పడనుంది. సాగునీటి ప్రాజెక్టులకు ఇచ్చే ఏఐబీపీ ఈ బడ్జెట్టులో కనుమరుగైంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా