మళ్లీ నిఘా..

10 Jan, 2019 11:15 IST|Sakshi

మోర్తాడ్‌(బాల్కొండ): పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకోవడానికి మద్యం పంపిణీ చేయకుండా నిరోధించడానికి మద్యం అమ్మకాలపై ఎక్సైజ్‌ అధికారులు నిఘా ఉంచారు. ముందుస్తు ఎన్నికల తరహాలో మద్యం వ్యాపారుల నుంచి రోజువారి లెక్కలను సేకరిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడింది. అలాగే రెండో విడత, మూడో విడత ఎన్నికలకు కూడా నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఈ నేపథ్యంలో మద్యం వ్యాపారులు గతేడాది ఇదే నెలలో ఎంత మేర మద్యం విక్రయించారో అంతే మొత్తంలోమద్యం విక్రయిస్తున్నారా లేక ఎక్కువగా విక్రయిస్తున్నారా తేల్చడానికి ఎక్సైజ్‌ అధికారులు రంగంలోకి దిగారు. నిజామాబాద్‌ జిల్లాలో 530 గ్రామ పంచాయతీలు, కామారెడ్డి జిల్లాలో 526 గ్రామ పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించనున్నారు.

తొలి విడత పోలింగ్‌ ఈనెల 21న, రెండో విడత పోలింగ్‌ 25న, మూడో విడత పోలింగ్‌ 30న జరగనుంది. సర్పంచ్‌ స్థానాలకు, వార్డు స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ గెలుపుకోసం ఓటర్లకు మద్యం, మాంసంతో విందు ఏర్పాటు చేయడం కొనసాగుతుందని ఎన్నికల సంఘం అధికారులు భావిస్తున్నారు. మద్యం అమ్మకాలను నియంత్రిస్తే ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించవచ్చని భావించిన ఎన్నికల సంఘం.. మద్యం అమ్మకాలపై నిఘా ఉంచాలని ఎక్సైజ్‌ అధికారులను ఆదేశించింది.

రోజువారి అమ్మకాలకంటే ఎక్కువ మద్యం విక్రయిస్తే వ్యాపారులు అందుకు తగిన కారణాలను ఎన్నికల సంఘానికి నివేదించాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం ఆదేశాలను ఎక్సైజ్‌ అధికారులు పాటిస్తూ మద్యం వ్యాపారులతో సమన్వయం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 150 వరకు మద్యం దుకాణాలు ఉండగా.. మండల కేంద్రాలు, మేజర్‌ పంచాయతీల్లోనే దాదాపు 100 వరకు మద్యం దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాల పరిధిలో ఎంత మద్యం విక్రయిస్తున్నారు, ఎవరైనా నాయకులు కొనుగోలు చేస్తున్నారా లేక సాధారణ ప్రజలే మద్యం కొనుగోలు చేస్తున్నారా అనే అంశాలపై ఎక్సైజ్‌ అధికారులు వివరాలను సేకరించనున్నారు. మూడు విడతల ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు మద్యం అమ్మకాలపై నిఘా కొనసాగనుంది.   

మరిన్ని వార్తలు