మద్యం డంపు.. ఢమాల్‌!

26 Nov, 2018 09:02 IST|Sakshi
జేఎం ఫాంహౌస్‌లో పట్టుబడిన మద్యం డంపును స్వాధీనం చేసుకున్న డీఎస్పీ సృజన 

సాక్షి, పెద్దమందడి (కొత్తకోట): పై ఫొటోలో కనిపిస్తున్న కాటన్లు చూశారా?! అందులో ఏం ఉన్నాయని అనుకుంటున్నారు? ఇవన్నీ రూ.22 లక్షల విలువైన మద్యం సీసాలు కలిగి ఉన్న కాటన్లు! ఎన్నికల వేళ ఎవరు తెప్పించి డంప్‌ చేశారో ఇంకా తేలాల్సి ఉంది. పెద్దమందడి మండలం వెల్టూరు స్టేజీ సమీపంలోని గోదాంల్లో వీటిని నిల్వ చేయగా పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి సీజ్‌ చేశారు.
జాతీయ రహదారి వెల్టూరు స్టేజికి సమీపంలో గల జేఎం ఫాంహౌస్‌లో భారీగా మద్యం నిల్వలు ఉన్నాయనే సమాచారం మేరకు ఆదివారం తెల్లవారుజామున డీఎ స్పీ సృజన, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ నాసర్‌ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. అను కున్నట్టుగాగానే భారీ మధ్యం డంపును గుర్తిం చారు. అనంతరం మొత్తం మధ్యం స్టాక్‌ను పెద్దమందడి పోలీస్‌స్టేషన్‌కు తరలించి సీజ్‌ చేశారు.  


పక్కా సమాచారం మేరకే.. 
అనంతరం డీఎస్పీ సృజన ఈ విషయంపై విలేకరులకు వివరాలు వెల్లడించారు.  ఎన్నికల్లో మద్యంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు వెంకటస్వామి అనే వ్యక్తికి చెందిన ఫాంహౌస్‌లో భారీగా మధ్యం నిల్వలు చేశాడని, ఈ విషయం గురించి తమకు పక్కా సమాచారం అందిందని తెలిపారు.

వ్యాపారులు పసిగట్టేలోపే అప్రమత్తమై తెల్లవారు జామున 5 గంటల సమయంలో అక్కడికి వెళ్లి తనిఖీ చేయగా షెడ్డులో కర్ణాటకకు చెందిన 699 లిక్కర్‌ కాటన్లలో 33,552 (రాయల్‌ బ్లూ విస్కి) మద్యం సీసాలను గుర్తించి స్వాధీన పరుచుకున్నామని చెప్పారు.

అనంతరం ఎక్సైజ్‌ శాఖ  సీఐ ఓంకార్‌ వచ్చి విచారణ చేపట్టారని, పట్టుబడిన మద్యం దాదాపుగా రూ.22లక్షలు ఉంటుందని తెలిపారు. అక్కడే ఉన్న ఫాంహౌస్‌ వాచ్‌మెన్‌ కాశన్నను అదుపులోనికి తీసుకొని విచారించగా తనకేమి తెలియదని, పెద్దమందడి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు  సత్యారెడ్డి, వెల్టూర్‌కు చెందిన సాక వెంకటయ్య వచ్చి కాటన్లను ఇక్కడ ఉంచారని చెప్పినట్లు డీఎస్పీ వెల్లడించారు. పకడ్బందీగా విచారణ చేసిన అనంతరం దీని వెనకాల ఎవరున్నారనే విషయాన్ని రెండు రోజుల్లో ప్రకటిస్తామన్నారు.  

కర్ణాటక మద్యం 
 రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా అటు పోలీసులు, ఇటు ఎక్సైజ్‌శాఖ అధికారులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. దీంతో ఎన్నికల్లో పోటీకి దిగిన అభ్యర్థులు కొందరు గోవా, కర్ణాటక రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు చీఫ్‌ లిక్కర్‌ తెప్పిస్తున్నారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అనేక నియోజకవర్గాలకు కర్ణాటక సరిహద్దుగా ఉంది. ఇక గోవా కేంద్ర పాలిత ప్రాంతం కావడంతో అక్కడ మద్యంపై పన్నులు తక్కువగా ఉండడంతో ధర కూడా తక్కువే ఉంటోంది. తక్కువ ధరలో మద్యం లభిస్తుండడంతో పెద్దమొత్తంలో మద్యం తెప్పించి నిల్వ ఉంచినట్లు తెలుస్తోంది. వనపర్తి జిల్లాలోని వెల్టూరులో స్వాధీనం చేసుకున్న మద్యం కూడా ఆ ప్రాంతానికి చెందినదేనని తెలుస్తోంది. 
 

మరిన్ని వార్తలు