మామూళ్ల మత్తులో ఎక్సైజ్‌ శాఖ

21 Jun, 2019 11:46 IST|Sakshi

వైన్సులు, బార్ల నుంచి నెలవారీ వసూళ్లు

ఏసీబీ తనిఖీలతో వెలుగులోకి వ్యవహారం

సాక్షి, నిజామాబాద్‌: ఎక్సైజ్‌శాఖ మామూళ్ల మత్తులో జోగుతోంది. కొందరు అధికారులు ప్రతినెలా వసూళ్ల దందాకు పాల్పడుతున్నారు. తనిఖీలు, పరిశీలనల పేరుతో అందిన కాడికి దండుకుంటున్నారు. యథేచ్ఛగా సాగుతున్న ఈ వ్యవహారం ఏసీబీ జరిపిన విచారణతో వెలుగులోకి వచ్చింది. ఓ కల్లుడిపో యజమాని నుంచి రూ.40 వేలు  డిమాండ్‌ చేసిన ఎక్జైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ సీఐ జె వెంకట్‌రెడ్డి, ఎస్సై స్రవంతిలపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు బుధవారం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. కలకలం సృష్టించిన ఎక్సైజ్‌ సీఐ, ఎస్సైల అరెస్టు ఆ శాఖలో కొనసాగుతున్న వసూళ్ల పర్వానికి అద్దం పడుతోంది. సర్కారు ఖజానాను నింపే ఎక్సైజ్‌ శాఖ అధికారుల జేబులు కూడా నింపుతోంది. 

జిల్లాలో ఐదు ఎక్సైజ్‌ పోలీస్‌స్టేషన్లు ఉండగా, వాటి పరిధిలో 95 మద్యం దుకాణాలున్నాయి. మద్యం షాపుల నుంచి నెలవారీ మామూళ్లు కొనసాగుతున్నాయి. ప్రతినెలా ఠంచనుగా మామూళ్లు ముట్టజెప్పుకోవాల్సి వస్తోందని మద్యం షాపుల యజమానులు కొందరు వాపోతున్నారు. ఒక్కో వైన్సు నుంచి నెలకు రూ.ఐదు వేల నుంచి రూ.10 వేల వరకు స్థాయిని బట్టి అధికారులకు ముట్టజెప్పాల్సిందే. మద్యం అమ్మకాలు ఎక్కువగా ఉండే వైన్సుల నుంచి అదనపు వసూళ్లు ఉంటాయి.

తక్కువ అమ్మకాలుండే వైన్సుల నుంచి కొంత తక్కువ మొత్తం ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఎక్సైజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్న అన్ని వైన్సుల నుంచి ఈ మొత్తాన్ని రాబడుతున్నారు. ఆయా సర్కిల్‌ విభాగాలకే ప్రతినెలా సుమారు రూ.9.50 లక్షల నుంచి రూ.పది లక్షల వరకు చేతులు మారుతున్నట్లు అనధికారిక అంచనా. మామూళ్లు ఇవ్వని పక్షంలో ఎక్కడ కేసులు నమోదు చేస్తారో అనే భయంతో మద్యం షాపుల యజమానులు ఈ మొత్తాన్ని సమర్పించుకుంటున్నారు.

తనిఖీల పేరుతో..
ఆయా మద్యం షాపుల తనిఖీల కోసం వెళ్లినప్పుడు చేసే వసూళ్లు అదనం. డీజిల్‌ ఖర్చులంటూ ఒక రూట్‌కు వెళ్లినప్పుడు ఆ రూట్‌లో ఉన్న షాపుల నుంచి రూ.రెండు వేలు, రూ.మూడు వేలు ఇలా ఇచ్చుకోవాల్సిందే. దీనికి తోడు ఖరీదైన మద్యం బాటిళ్లు కూడా ఇవ్వాల్సి వస్తోందని మద్యం దుకాణాదారులు వాపోతున్నారు. 

‘ఖర్చు చేసి పోస్టింగ్‌ తెచ్చుకున్న..’ 
జిల్లాలో అత్యంత కీలకమైన సర్కిల్‌లో పనిచేస్తున్న ఓ అధికారి మామూళ్ల దందా శ్రుతి మించింది. ఈ పోస్టింగ్‌ కోసం పెద్ద మొత్తంలో ఉన్నతాధికారులకు సమర్పించుకుని వచ్చానని చెప్పుకునే అధికారి.. ఆ స్థాయిలోనే వసూళ్ల దందాకు పాల్పడుతుండటం ఆ శాఖ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ సర్కిల్‌ పరిధిలోని వైన్సులు, బార్లు, కల్లు డిపోల తనిఖీలు, పరిశీలన కోసం సిబ్బందితో కాకుండా ఒంటరిగా వెళ్లి అందిన కాడికి దండుకుని రావడం పరిపాటిగా తయారైందని ఆ సర్కిల్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

వసూళ్ల దందాపై శాఖాపరమైన విచారణ.. 
ఎక్సైజ్‌శాఖలో కొందరు అధికారుల వసూళ్ల దందా ఆ శాఖ ఉన్నతాధికారుల వరకు వెళ్లింది. ఈ వ్యవహారంపై శాఖ అంతర్గత విచారణ చేపట్టింది. ముగ్గురు అధికారులపై విచారణ కొనసాగినట్లు సమాచారం. విచారణ చేపట్టిన అధికారులు బలమైన ఆధారాలు సేకరించే పనిలో పడినట్లు తెలుస్తోంది.

మా దృష్టికి వస్తే చర్యలు..
ఎక్సైజ్‌శాఖలో మామూళ్ల వ్యవహారం మా దష్టిలో లేదు. ఆలాంటిదేమైనా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటాము. గతంలో కొందరిపై శాఖాపరమైన విచారణ కూడా చేపట్టాము.
- డేవిడ్‌ రవికాంత్, ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా