పంటల ‘బీమా’ నుంచి జిల్లాకు మినహాయింపు

19 Jul, 2014 03:26 IST|Sakshi

మోర్తాడ్: ఖరీఫ్ పంటల సాగుకు సంబంధించి జాతీయ పంటల బీమా పథకం నుంచి మన జిల్లాకు కంపెనీ యాజమాన్యం మినహాయింపునిచ్చింది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో జిల్లాలో సాగవుతున్న పంటలకు ఈ పథకం వర్తింప చేయకుండా కంపెనీ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని ఆరు జిల్లాల్లో సాగయ్యే పత్తి, మిరప, బత్తాయి, ఆయిల్‌ఫామ్ పంటలకు మాత్రమే బీమా వర్తింప చేస్తూ జాతీయ పంటల పథకాన్ని అమలు చేస్తున్న అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. ఈ మేరకు ప్రకటనను జారీ చేసింది.

 వర్షాభావ పరిస్థితులతో
 జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో బోరు బావులను ఆధారం చేసుకుని రైతులు పంటలను సాగు చేస్తున్నారు. ప్రధానంగా పసుపు, మొక్కజొన్న, సోయా, వరి పంటలను ఈ సీజనులో సాగు చేస్తున్నారు. ప్రతి ఖరీఫ్ సీజనుల్లో పంటల సాగుకు రైతులు బ్యాంకుల నుంచి తీసుకునే రుణాల నుంచి బీమా ప్రీమియంను ఇన్సూరెన్స్ సంస్థకు చెల్లించేవారు. ఒకవేళ రైతులు పంట రుణాలు తీసుకోకపోతే బ్యాంకుల ద్వారా బీమా ప్రీమియంను చెల్లించే అవకాశం ఉంది.

ఈసారి వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో బీమా చేసే విషయంలో కంపెనీ కొన్ని మార్పులు చేసింది. మిరప, బత్తాయి, పత్తి పంటలకు మాత్రమే బీమాను వర్తింపచేస్తూ.. మిగిలిన పంటలను మినహాయించింది. తెలంగాణలో ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో సాగు అవుతున్న పత్తి, మిరప, బత్తాయి పంటలకు మాత్రమే బీమాను వర్తింప చేస్తున్నారు.

 రైతులకు తప్పిన భారం
 గతంలో పసుపు పంటకు అత్యధికంగా ఎకరానికి రూ.2,500 వరకు ప్రీమియం వసూలు చేసేవారు. వరి, సోయా, మొక్కజొన్న పంటలకు కొంత తక్కువ ప్రీమియం ఉండేది. ఈసారి వర్షాలు కురవక పోవడంతో పంటల పరిస్థితి ఎలా ఉంటుందోననే సంశయంతో బీమా సంస్థ మన జిల్లాకు మినహాయింపు ఇచ్చింది. దీంతో రైతులు తమకు బీమా ప్రీమియం చెల్లించే భారం తప్పిందని చెబుతున్నారు. ప్రతీ సీజన్‌ల్లో పంటల బీమా చెల్లించినా తమకు ఎప్పుడు కూడా నష్టపరిహారం అందలేదని వారు పేర్కొంటున్నారు.
 

>
మరిన్ని వార్తలు