లాక్‌డౌనే అసలు మందు!

31 Mar, 2020 02:55 IST|Sakshi

‘సాక్షి’ ఇంటర్వ్యూలో ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి 

కరోనా వైరస్‌ సోకినా చనిపోరు.. 90 శాతం మంది కోలుకుంటారని వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌కు నిర్దిష్టంగా మందు లేదు. మనిషి సాంఘిక జీవి కాబట్టి సామాజిక దూరం అని చెప్పడం కంటే భౌతికంగా మాత్రమే ఎడంగా ఉంటూ.. సామాజికంగా దగ్గరగా ఉండాలి. ఇందుకు మొబైల్స్‌ వంటివి ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే మొబైల్స్‌ మీద వైరస్‌ చాలా ఎక్కువ సేపు ఉంటుంది. కాబట్టి మొబైల్‌ హైజీన్, మొబైల్‌ శానిటైజేషన్‌ పాటించాలి. అన్నిటికంటే ముఖ్యం లాక్‌డౌన్‌ను తప్పక పాటిస్తే.. వ్యాధి తీవ్రత తగ్గడమే కాదు.. మనం త్వరగా ఈ కష్టకాలం నుంచి బయటపడతామంటున్నారు ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ అధినేత డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి. ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కరోనా గురించి పలు అంశాలు చెప్పారు. వివరాలివీ..

 సాక్షి: ఈ ప్రపంచంలోని జీవరాశి మొత్తం బరువు కంటే.. ఈ లోకంలో ఉన్న వైరస్‌ల బరువే ఎక్కువంటారు. అంత ఎక్కువ మొత్తంలో వైరస్‌లు ఉన్నదే వాస్తవమైతే, ఆ వైరస్‌లన్నింటితో ముప్పు లేదెందుకు? ఈ వైరస్‌తోనే ఇంత ముప్పు ఎందుకు?  
డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి: పరిణామక్రమంలో ఈ ప్రపంచంలోకి మొదటే వైరస్‌లు వచ్చాయి. దాదాపు 500 మిలియన్‌ సంవత్సరాల పూర్వం నుంచి వైరస్‌లు ఉన్నాయి. మనం భూమ్మీదికి చాలా లేట్‌గా వచ్చాం. చాలా ముందు నుంచి ఉండటం వల్ల ఈ భూమికి నిజమైన యజమానులు వైరస్‌లే అనుకోవచ్చు. అయితే అవి తమంతట తాము మనుగడ సాగించలేవు కాబట్టి ఒంటెలు, గబ్బిలాలు.. ఇలాంటి చాలా వాటిని ఆశ్రయించి మనుగడ సాగిస్తూ వచ్చాయి. చాలా అటవీ జంతువుల్లో వైరస్‌లు ఎప్పుడూ ఉంటాయి. అవి తమ హద్దులు (బ్యారియర్స్‌) దాటకుండా బతికేస్తూ ఉంటాయి. వాటి వాటి జన్యువులను బట్టి ఏ జంతువుకు పరిమితమైన వైరస్‌లు ఆ జంతువులోనే ఉండిపోతాయి. కొన్నికొన్ని మ్యుటేషన్స్‌ వల్ల అవి జన్యుస్వరూపం మార్చుకోవడం వల్ల మనుషులకు వస్తాయి. ఇప్పుడు మనం ఈ ఉత్పాతాన్ని చూస్తున్నాం. కానీ పరిణామక్రమంలో చాలా చాలా వైరస్‌ల ఆర్‌ఎన్‌ఏలూ, డీఎన్‌ఏలూ మన జీన్స్‌లోకి వచ్చి.. వాటిలోకి పూర్తిగా ఇంకిపోవడం వల్ల పరిణామంలో చాలా సానుకూల ఫలితాలే వచ్చాయి. ఇప్పుడు వస్తున్న వైరస్‌ కూడా నేరుగా మానవులకు రాలేదు. మొదట గబ్బిలాలు, అక్కణ్నుంచి మరికొన్ని జంతువుల్లోకి వెళ్లి.. అలా మానవులకు వచ్చాయి. నిజానికి మనిషి తన పరిధులను అతిక్రమించి అటవీ జంతువుల ప్రపంచంలోకి వెళ్లడం వల్లనే.. ప్రస్తుతం ఉన్న వైరస్‌ మానవులకు సోకేలా మార్పు చెంది, మనుషుల్లో వ్యాధికి కారణమవుతోంది. 

విటమిన్‌–సి వల్ల రోగనిరోధక శక్తి బాగా పెరిగి వైరస్‌ ప్రభావం లేకుండా చేసే అవకాశాలున్నాయంటున్నారు. చాలామందికి నిమ్మ, నారింజ, కమలాల వంటి సిట్రస్‌ ఫ్రూట్స్, మరికొందరికి పుచ్చకాయ వంటివి తినగానే జలుబు చేస్తుంది. అలాంటివారి సంగతేమిటి?  
నిమ్మ, నారింజ, కమలాల వంటి సిట్రస్‌ ఫ్రూట్స్‌ వల్ల జలుబు చేయడం, దగ్గు రావడం జరుగుతుందని చాలామంది అంటుంటారు గానీ సైంటిఫిక్‌గా దానికి తగిన తార్కాణాలు లేవు. అయితే కొంతమందికి వారి వ్యక్తిగత శారీరక స్వభావం బట్టి ఇలా జరుగుతున్నప్పుడు మందులు దుకాణాల్లో దొరికే విటమిన్‌–సి టాబ్లెట్స్‌ రోజుకొకటి వాడుకోవచ్చు.  

చాలామంది ఇది శ్వాస సమస్యలనే కలగజేస్తుందంటున్నారు. కానీ కొందరిలో నీళ్ల విరేచనాలు, రుచులు, వాసనలు తెలియకపోవడం, ఒళ్లునొప్పులు, కడుపునొప్పి వంటి లక్షణాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయట కదా? 
జ్వరం, శ్వాస సరిగా ఆడకపోవడం వంటి ప్రధాన లక్షణాలతో పాటు.. రుచులు, వాసనలు తెలియకపోవడం ఉంటాయి. 20 నుంచి 30 శాతం మందిలో నీళ్ల విరేచనాలు (డయేరియా), వికారం (నాజియా), వాంతుల వంటి లక్షణాలు కనిపించవచ్చు. మరో 20 శాతం మందిలో రుచులు, వాసనలు తెలియకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. జలుబు చేసినప్పుడు వాసనలు తెలియకపోవడం మామూలే కదా అని అనుకోవచ్చు. కానీ ఈ వైరస్‌ ప్రత్యేకత ఏమిటంటే.. జలుబు లేనప్పటికీ ఇది సోకినప్పుడు మనకు వాసనలు తెలియకుండా పోతాయి.
 
చైనా, ఇటలీ, అమెరికాలలో దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉంది.. కానీ ఇండియాలో తక్కువగానే ఉందంటున్నారు. కారణాలేంటి? 
మొదట ఈ వైరస్‌ చైనాలో వచ్చినప్పుడు ‘ఎస్‌’, ‘ఎల్‌’అనే తరహాలను చూశాం. కానీ ఇప్పుడు ‘ఎస్‌’వేరియెంట్, ‘ఎల్‌’వేరియెంట్‌ అనే భావనలు పూర్తిగా పోయాయి. అనేక కొత్త అంశాలు తెలియవచ్చాయి. మన దేశంలో, ఇటలీలో, యూఎస్‌ఏలో, చైనాలో కనిపించిన వైరస్‌ల తాలూకు జీన్స్‌ చాలా నిశితంగా అధ్యయనం చేస్తున్నాం. కరోనా వైరస్‌కు పైన ముళ్లు ముళ్లులా అంటే స్పైక్స్‌లా ఉండటం బొమ్మల్లో చూశారు కదా. ఇటలీలో కనుగొన్న కరోనా వైరస్‌లోని జీనోమ్‌లో మూడు మ్యూటేషన్ల ద్వారా మార్పులు వచ్చినట్లు కనుగొన్నారు. దాంతో అక్కడి ‘కరోనా’లో తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఇక భారత్‌లో వచ్చిన కరోనా వైరస్‌ రకంలో వచ్చి న ఒక మ్యూటేషన్‌ కారణంగా ఈ స్పైక్‌ ప్రోటీన్‌లో మార్పు వచ్చి అది సరిగా కణానికి అతుక్కోకపోవడాన్ని చూస్తున్నాం. దీని వల్లనే మన దగ్గర తీవ్రత తక్కువగా ఉందా తెలియడం లేదు. దీనిపై అధ్యయనం జరగాలి.

ఈ వైరస్‌ తనలాంటి ఎన్నో కాపీలను ప్రొడ్యూస్‌ చేసుకుంటుందట కదా నిజమేనా?  
ఈ వైరస్‌ చాలా తెలివైనది. అదో త్రీడీ మెషీన్‌ వంటి జిరాక్స్‌ మెషీన్‌ సహాయంతో ఎన్నెన్నో కాపీలను పుట్టించినట్లుగా తన కాపీలను (అం టే తనలాంటి వైరస్‌లను) పుట్టించుకుంటుంది. ఇందుకు మన కణాలను ఉపయోగించుకుంటుంది.
 
‘స్పీషిస్‌ బ్యారియర్‌’అంటే ఏమిటో చెప్పండి. ఆ బ్యారియర్‌ లేకపోవడం వల్లనే ఇది మన మానవుల్లో విపరీతంగా విస్తరిస్తోందట కదా?  
ప్రతి జీవిలోనూ చాలా వైరస్‌లు ఎప్పుడూ నివసిస్తుంటాయి. మన కడుపులో ఈ క్షణంలోనూ ఎన్నెన్నో వైరస్‌లు ఉంటాయి. అవన్నీ మనలోనే ఉన్నా.. మనకు నిరపాయకరంగా ఉంటాయి. మనకు నిరపాయకరమైన ఈ వైరస్‌లు ఇతర జీవుల్లోకి వెళ్లినప్పుడు వాటికి అపాయకరం కావచ్చు. ఇలా ఒక ప్రజాతికి (స్పీషి స్‌కు) నిరపాయకరంగా ఉండటాన్ని స్పీషిస్‌ బ్యారియర్‌ అంటారు. అయితే ఇది వేరే స్పీషీస్‌కు చేరినప్పుడు అది వాటికి అపాయక రం కావచ్చు. ఇలా ఇతర జీవుల్లో నిరపాయకరంగా ఉన్న వైరస్‌.. మ్యుటేషన్లకు గురై మనకు రావ డం వల్ల అపాయకరం గా పరిణమించిందనే అభిప్రాయం కొంతమంది నిపుణుల్లో ఉంది. అయితే ఇది చాలా రోజులు మనలోనే ఉండిపోయిందనుకోండి. కాలక్రమంలో ఇది కూడా మనపట్ల నిరపాయకరం గా మారిపోవచ్చు. అప్పుడు ఇది మనకే పరిమితమైపోతుంది. ఇలా మనకు పరిమితం కావడాన్ని మళ్లీ స్పీషిస్‌ బ్యారియర్‌గా చెప్పవచ్చు.

కొన్ని ఆఫీసుల్లో కామన్‌ బాత్‌రూమ్‌ల వల్ల ఇది విస్తరించే ప్రమాదం ఉందా?  
మూత్రవిసర్జన ప్రాంతాలతో ఎలాంటి ప్రమాదం లేదన్నది స్పష్టమే అయినా.. మలం ద్వారా వైరస్‌ వ్యాపిస్తుందనేది కొందరి అభిప్రాయంగా ఉన్నప్పటికీ దీనికి స్పష్టమైన ఆధారాలు లేవు. వాస్తవానికి బాత్‌రూమ్‌ల కంటే వాటి డోర్‌ నాబ్స్, గొళ్లేల వంటివి చాలా ప్రమాదం. అలాంటివి తాకినప్పుడు చేతులను చక్కగా కడుక్కోవడం అవసరం. శానిటైజర్లతో ఈ బాత్‌రూమ్‌ డోర్‌ నాబ్స్‌ను శుభ్రం చేస్తూ ఉండాలి. ఇక బాత్‌రూమ్‌ విషయానికి వస్తే, వెస్ట్రన్‌ కమోడ్‌ విషయంలో దాన్ని ఉపయోగించాక ఫ్లష్‌ చేసిన తర్వాత, దాని పైన ఉండే మూత వేసి పెట్టాలి. ఒకరు బాత్‌రూమ్‌ వెళ్లి వచ్చాక.. వెంటనే మరొకరు వెళ్లడం కంటే... ఇలా మరొకరు వెళ్లాల్సి వచ్చినప్పుడు కాస్తంత వ్యవధి తర్వాతే వెళ్లడం మంచిది.

 శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారిలో కంటే గుండెజబ్బులు, డయాబెటిస్‌ ఉన్నవారే ఎక్కువగా బలయ్యారు. కారణమేంటి?  
గుండె సమస్యలు ఉన్నవారికి చికిత్సగా ఏసీఈ–2 రిసెప్టార్స్‌ను ఇస్తుంటాం. దాంతో వారిలో ఏసీఈ–2 రిసెప్టార్స్‌ ఎక్కువగా ఉంటాయి. అర్థమయ్యేలా చెప్పాలంటే... ఈ ఏసీఈ–2 రిసెప్టార్స్‌ అనేది తాళం చెవి రంధ్రాలు అనుకుంటే, వైరస్‌కు ఉండే స్పైక్స్‌ తాళం చెవులుగా చెప్పుకోవచ్చు. గుండెజబ్బులున్న వారిలో తాళం చెవి రంధ్రాలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల స్పైక్స్‌ దూరిపోడానికి అవకాశాలెక్కువ. దానివల్ల వైరస్‌ గుండెజబ్బులున్నవారి కణాల్లోకి దూరిపోవడం మిగతావారికంటే సులువు. అందుకే వారిలో ముప్పూ ఎక్కువే. మరణాలూ ఎక్కువే. ఇక డయాబెటిస్‌ ఉన్నవారి శరీరాల్లో రోగనిరోధక శక్తి తక్కువ. అందుకే గుండెజబ్బులూ, డయాబెటిస్‌ ఉన్నవారిలో ముప్పు ఎక్కువ. ఆ తర్వాత ఊపిరితిత్తుల సమస్యలున్నవారిలోనూ ముప్పు ఎక్కువే.

మాంసాహారం మానేయడం వల్ల వైరస్‌ తీవ్రత తగ్గుతుందా? 
చికెన్, మటన్, ఫిష్‌ వంటి వాటిల్లో ప్రోటీన్‌లు ఎక్కువ. మనం ఆరోగ్యంగా ఉండటం వల్ల వైరస్‌ అంత తేలిగ్గా సోకదు. కాబట్టి మాంసాహారం తినేవారు నిరభ్యంతరంగా తినవచ్చు.

ఒక ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఒకే సబ్బు, ఒకే దువ్వెన వాడటం సురక్షితమేనా? 
ఆ ఇంట్లో ఉండేవారు అందరూ ఆరోగ్యవంతులైతే ఈ దువ్వెనలూ వంటి వాటిని వాడుకోవచ్చు. వాటి కంటే ముఖ్యంగా మొబైల్‌ ఫోన్‌ శానిటేషన్‌ చాలా ప్రధానం. మన ఫోన్‌ ఇంకెవ్వరికీ ఇవ్వకూడదు. మన ఫోన్‌ను ఎవరైనా వాడినా వెంటనే దూదిని కాస్తంత శానిటైజన్‌లో ముంచి దాన్ని శుభ్రం చేసి వాడాలి. ప్లాస్టిక్, స్టీల్‌ మీద వైరస్‌ దాదాపు 36 నుంచి 48 గంటలకు పైగా జీవించి ఉంటుందన్న విషయం తెలిసిందే కదా.
   
హెర్డ్‌ ఇమ్యూనిటీ’అంటే ఏమిటి? అది వస్తే ఎలాంటి ప్రమాదమూ ఉండదా?  
మన జనాభాలో 60 శాతం కంటే ఎక్కువ మందికి ఇమ్యూనిటీ వచ్చిందనుకోండి. అప్పుడు ఆ జనాభా అంతటికీ ఇమ్యూనిటీ వచ్చిందని అనుకోవడాన్నే ‘హెర్డ్‌ ఇమ్యూనిటీ’అంటారు. ఇలా ఒక ప్రాంతంలోని సమూహానికి ఇమ్యూనిటీ వచ్చినప్పుడు.. మళ్లీ వైరస్‌ దాడి చేసినా నష్టం చాలా తక్కువగా ఉంటుంది. అయితే మైల్డ్‌గా ఉండే వైరస్‌ల విషయంలో హెర్డ్‌ ఇమ్యూనిటీ అన్నది సేఫ్‌ అని అనుకోవచ్చు. మరణాలు చాలా ఎక్కువగా ఉండే వైరస్‌ విషయంలో ‘హెర్డ్‌ ఇమ్యూనిటీ’రావడాన్ని సురక్షితమైన అంశంగా భావించడానికి వీలుండదు. కరోనా విషయంలోనూ తదుపరి సీజన్‌కల్లా మనకు హెర్డ్‌ ఇమ్యూనిటీ వచ్చేస్తుందని అనుకోవచ్చు. దానివల్ల మనకు కలిగే రక్షణా ఎక్కువే అయినా.. హెర్డ్‌ ఇమ్యూనిటీని నమ్మడం కంటే జాగ్రత్త చర్యలు తీసుకోవడమే మేలు.
 
మీరు ప్రజలకు ఇచ్చే సందేశం ఏమిటి?  
లాక్‌డౌన్‌ వంటి చర్యలు చాలా అవసరం. అవి వైరస్‌ వ్యాప్తిని అరికడతాయి. అందుకే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలను, వాళ్లు పడుతున్న కష్టాలను గుర్తించి, ప్రజలంతా సహకరించాలి. లాక్‌డౌన్‌ను పాటించాలి. ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. అతిగా ఆందోళన పడితే, ఆ ఒత్తిడి ప్రభావం దేహంపై పడి రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అలాగని పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తే మొదటికే ముప్పు వస్తుంది. అందువల్ల అనవసరంగా ఆందోళన పడకండి. అలాగని అప్రమత్తత వీడి నిర్లక్ష్యంగానూ ఉండకండి. ఈ రెండిటి మధ్య విభజన రేఖ ఎక్కడ గీయాలో తెలుసుకుని విజ్ఞతతో మెలగండి.  

వార్తాపత్రికలతో వైరస్‌ వ్యాపిస్తుందనే అనుమానాల్లో నిజమెంత?
న్యూస్‌పేపర్‌ వల్ల వైరస్‌ వ్యాపిస్తుందని చాలామంది అపోహ పడుతున్నారు. కానీ దీనిపై అమెరికాలో జరిగిన అధ్యయనంలో న్యూస్‌పేపర్లపై ఒక గంట సేపటి కంటే వైరస్‌ ఉండే అవకాశం లేదని తెలిసింది. ఇక ‘సాక్షి’వంటి పెద్దపెద్ద సంస్థలన్నీ శానిటైజ్‌ చేసే ఇస్తున్నారు. దానివల్ల ప్రమాదమే లేదు. ఇక అంతగా అనుమానం ఉందనుకోండి. మీకు పేపర్‌ వేసిన గంట తర్వాత తీసి, దాన్ని హాయిగా చదువుకోవచ్చు.

ఒకవైపు మందులు లేవంటున్నారు. మరోవైపు హైడ్రాక్సీ క్లోరోక్విన్, అజిథ్రోమైసిన్‌తో ఫలితం కనిపిస్తుందంటున్నారు. ఇదెంతవరకు కరెక్ట్‌? 
ఈ వ్యాధికి యాంటీవైరల్‌ డ్రగ్స్‌ ఇంతవరకు కనుక్కోలేదు. ఇంకా రీసెర్చ్‌ కొనసాగుతూ ఉంది. రెండు మూడు ట్రయల్స్‌ జరిగాయి. ఒకటి జపాన్‌ నుంచి వచ్చిన మందు అవిగాన్‌ అని ఉంది. దాన్ని చైనాలో వాడారు. ఒక ట్రయల్‌ ఫ్రాన్స్‌లో జరిగింది. అందులో రోగులకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌తో పాటు అజిథ్రోమైసిన్‌ కాంబినేషన్‌గా వాడారు. ఇది 22 మంది రోగుల మీద జరిగింది. ఫలితాలు చాలా సానుకూలంగా వచ్చాయి. ఇంత చిన్న సమూహం మీద జరిగిన ట్రయల్‌ను ఎలా ప్రాతిపదికగా తీసుకుంటారనే విమర్శలున్నాయి.ఇప్పుడు చైనాలో, యూఎస్‌ఏలో దీనిమీదే అధ్యయనం జరుగుతోంది. దీని ఫలితాలు మే కల్లా వస్తాయి. ఇప్పుడు ఐసీఎమ్‌ఆర్, డబ్ల్యూహెచ్‌ఓ వాళ్లు ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్, అజిథ్రోమైసిన్‌లను ప్రొఫిలాక్టిక్‌ చికిత్సగా అంటే.. జబ్బు రాకుండా ఉండేం దుకు ముందుజాగ్రత్త చర్యగా వాడుకోవచ్చ ని చెప్పాయి. అవి కూడా రెండు వర్గాలకు మాత్రమే. మొదటిది డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందికీ, రెండోది కుటుంబంలో ఎవరికైనా పాజిటివ్‌ వస్తే.. ఆ కుటుంబ సభ్యులకు జబ్బు రాకుం డా నివారణ కోసం.. ఇలా ఈ ఇరువర్గాలకు మందు ఇవ్వవచ్చని సిఫార్సు చేశారు. ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ 200 ఎంజీ మోతాదులో వారంలో రెండు సార్లు ఇవ్వవచ్చని సూచించారు. ఇక విటమిన్‌–సి, విటమిన్‌–డి, జింక్‌ వంటి పోషకాలు దీని నివారణలో చాలా ప్రధాన భూమిక పోషిస్తాయి.

డాక్టర్లు ప్రొఫిలాక్టిక్‌ ట్రీట్‌మెంట్‌గా తీసుకుంటున్నారంటున్నారు కదా.. అలాంటప్పుడు దేశంలోని ప్రతి ఒక్కరికీ వాటిని ఇవ్వడం ద్వారా వైరస్‌ను అరికట్టలేమా?  
ఆ మందుల వల్ల కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. గుండెజబ్బులు ఉన్న వారిలో కొన్ని సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చే అవకాశం ఉంది. కొంతమందిలో వికారం, వాంతులు వంటివి ఉండవచ్చు. పూర్తిగా 100 శాతం సురక్షితం అని నిరూపణ కాలేదు కాబట్టి అందరికీ ఇవ్వలేం. 

మనలాంటి వేడి ఎక్కువగా ఉండే దేశాల్లోని ఉష్ణోగ్రత ప్రభావం వల్ల వైరస్‌ తీవ్రత అంత ఎక్కువగా ఉండదంటున్నారు నిజమేనా? ఒకవేళ వేసవిలో తగ్గినా.. మళ్లీ వర్షాకాలం, శీతాకాలంలో విజృంభించే అవకాశం ఉంది కదా? 
దాదాపు 32 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత దాటాక ఈ వైరస్‌ బతికి ఉండటం లేదని ల్యాబ్‌ ఫలితాలు చెబుతున్నా.. వాటిని బయట ఉన్న వాతావరణ పరిస్థితులకు అన్వయించలేం. బయట 32 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ.. మన గది ఉష్ణోగ్రత సాధారణంగా 25 డిగ్రీల నుంచి 27 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉండవచ్చు. మనం గదుల్లో ఉన్నప్పుడే ఒకరి నుంచి మరొకరికి వచ్చే అవకాశాలు ఎక్కువ కదా. అలాగే చలికాలంలో మళ్లీ వచ్చేందుకు అవకాశాలు కూడా ఎక్కువే. అయితే అప్పటికే చాలామందిలో ఈ వ్యాధి వచ్చి తగ్గిపోయినందువల్ల వారిలోని యాంటీబాడీస్‌ వల్ల ఇమ్యూనిటీ ఉంటుంది. దానివల్ల ఇంతటి తీవ్రత ఉండకపోవచ్చు. ఇక ఆపై ఏడాది వచ్చే చలికాలానికి అసలు సమస్యే ఉండకపోవచ్చు. ఎందుకంటే... దాదాపు 16 నెలల వ్యవధిలో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చేస్తుంది. 

మిగతావాళ్లతో పోలిస్తే దాదాపు 70, 80 ఏళ్ల కంటే పెద్దవాళ్లలోనే రిస్క్‌ అంటున్నారు కదా.. వాళ్ల పట్ల ఏవైనా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలా?  
వయసు విషయానికి వస్తే రెండు అంశాలున్నాయి. మొదటిది బయలాజికల్‌ ఏజ్, రెండోది ఫిజికల్‌ ఏజ్‌. బయలాజికల్‌ ఏజ్‌ అంటే కాలం గడుస్తున్న కొద్దీ పెరిగిపోయే వయసు. ఇక ఫిజికల్‌ ఏజ్‌ అంటే.. ఉదాహరణకు మనకు 65 ఏళ్ల వయసనుకుందాం. కానీ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, స్మోకింగ్‌ లాంటి దురలవాట్లు లేకపోవడం, మంచి పోషకాహారం తీసుకోవడం వల్ల ఏ 50.. 52 ఏళ్ల వ్యక్తిలా ఉన్నామనుకోండి. ఇలాంటివారిలో ముప్పు తక్కువ. అదే ఎలాంటి వ్యాయామం లేకుండా, స్మోకింగ్‌ లాంటివి చేసేవారు, మద్యం అలవాటు ఉన్నవారు, ఏ గుండెజబ్బులో, కేన్సరో ఉన్నవారైతే వారికి బయలాజికల్‌ వయసు తక్కువే అయినా ఫిజికల్‌గా సరిగా లేకపోతే.. వాళ్లకు ముప్పు ఎక్కువ. ఇలాంటివారి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్ల చాలా ప్రాణాలు కాపాడవచ్చు. ఈ జబ్బు వస్తే చాలావరకు చచ్చిపోతారు అనే అభిప్రాయం ఉంది. అది సరికాదు. జబ్బు వచ్చిన వారిలో 90 శాతం మంది కోలుకుంటారు.  

మరిన్ని వార్తలు