బాలికలకు ప్రత్యేకంగా 1,473 సీట్లు 

12 Jun, 2018 01:31 IST|Sakshi

  ఐఐటీ, ఎన్‌ఐటీ సీట్ల వివరాలను అందుబాటులోకి తెచ్చిన జోసా 

  15 నుంచి కౌన్సెలింగ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, జీఎఫ్‌టీఐల్లో 1,473 సీట్లను ప్రత్యేకంగా బాలికలకే కేటాయించేలా జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (జోసా) ప్రకటించింది. ఈ నెల 15 నుంచి ప్రవేశాల కౌన్సెలింగ్‌ చేపట్టిన నేపథ్యంలో సీట్ల వివరాలను జోసా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఐఐటీల్లో 800 సీట్లు, ఎన్‌ఐటీ, జీఎఫ్‌టీఐల్లో మిగతా సీట్లను కేటాయించనున్నట్లు తెలిపింది. ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, జీఎఫ్‌టీఐలలో 39,425 సీట్లను జోసా ద్వారా భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది.

సాధారణ పద్ధతిలో 37,952 సీట్లను భర్తీ చేయ నుండగా, ప్రత్యేకంగా బాలికలకే 1,473 సీట్లను కేటాయించనున్నట్లు వివరించింది. జోసా రిజిస్ట్రేషన్‌ సమయంలో వ్యక్తిగత వివరాలను మార్చుకోవడానికి వీలు లేదని తెలిపింది. వరంగల్‌ ఎన్‌ఐటీలో హోంస్టేట్‌ (తెలంగాణ)తోపాటు ఏపీ కోటా ఉంటుందని, అదర్‌ స్టేట్‌ కోటా కింద కూడా (ఏపీ కలుపుకొని) సీట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొంది. ఐఐటీల్లో ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులు టాప్‌–20 పర్సంటైల్, ఇంటర్మీడియేట్‌లో 75, ఎస్సీ, ఎస్టీ వికలాంగులైతే 65 మార్కులు సాధించి ఉండాలని వివరించింది.

 

మరిన్ని వార్తలు