ఎక్సైజ్‌కు రూ.34 కోట్ల ఆదాయం

23 Oct, 2019 11:05 IST|Sakshi
లక్కీడ్రా తీస్తున్న కలెక్టర్‌ రామ్మోహన్‌రావు (ఫైల్‌)

సాక్షి, నిజామాబాద్‌ : నిజామాబాద్‌ ఎక్సైజ్‌ సర్కిల్‌కు పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరింది. ప్రతి రెండేళ్లకు నిర్వహించే మద్యం దుకాణాల టెండర్లతో ఈసారి బాగా కలిసి వచ్చింది. ప్రభుత్వం దరఖాస్తు ఫీజు పెంచినా మద్యం వ్యాపారులు ఎక్కువ మొత్తంలో ఆసక్తి చూపారు. దీంతో 1072 దరఖాస్తుల ద్వారా రూ. 2 లక్షల చొప్పున రూ. 21 కోట్ల 44 లక్షల ఆదాయం వచ్చింది. దీంతో పాటు 83 మద్యం దుకాణాదారులు మొదటి కిస్తు చెల్లించడం ద్వారా రూ. 13 కోట్ల 18లక్షల ఆదాయం సమకూరింది. మొత్తంగా ఎక్సైజ్‌ శాఖకు రూ. 34 కోట్ల 62 లక్షల 75 వేల ఆదాయం వచ్చింది. నవంబర్‌ 1 నుంచి ఏర్పాటయ్యే నూతన మద్యం దుకాణాల్లో నిబంధనలు పాటించాలని, లేకుంటే దుకాణాల లైసెన్సు రద్దు చేస్తామని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే 83 మద్యం దుకాణాల లైసెన్సు ప్రక్రియను పూర్తి చేశారు.

గుడివిల్‌ పేరిట వల
మద్యం దుకాణాలు దక్కని కొంతమంది వ్యాపారులు లక్కీడ్రాలో షాపులు దక్కిన వారికి గుడ్‌విల్‌ పేరుతో వల వేస్తున్నారు. నూతనంగా మద్యం దుకాణాలను లక్కీ డ్రాద్వారా దక్కించుకున్న వారిని నేరుగా కలిసి గుడ్‌విల్‌ ఇస్తామని మద్యం దుకాణాలను మాకే అప్పగించాలని అడుగుతున్నారు. ఇప్పటికే పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నిజామాబాద్‌నగరంతో పాటు డిమాండ్‌ ఉన్న మద్యం దుకాణాలపై ఇప్పటికే వ్యాపారులు కన్నేశారు. నయానో, భయానో తమ దారిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కొత్తగా మద్యం వ్యాపారం ప్రారంభించాలంటే బడా వ్యాపారులతో కొన్ని ఇబ్బందులు తప్పవు. అందుకే కొత్తగా దుకాణాలు దక్కిన వారు సైతం సిండికేట్లకు లొంగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

లీజుకు ఇస్తే లైసెన్సు రద్దు
మద్యం దుకాణాలు దక్కిన వారు ఎవరైనా సరే కచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందే. అలా కాకుండా మద్యం దుకాణాలు ఇష్టారాజ్యంగా నడిపితే చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్‌ అధికారులు హెచ్చరిస్తున్నారు. మద్యం దుకాణాలు ఎవరికైనా లీజుకు ఇస్తే లైసెన్సులు రద్దు చేస్తామని చెబుతున్నారు.

24న 8 మద్యం దుకాణాలకు డ్రా
నిజామాబాద్‌ జిల్లాలో లక్కీ డ్రా నిలిచిపోయిన 8 దుకాణాలకు మళ్లీ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నెల 23 సాయంత్రం 4 గంటలలోపు దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఈ నెల 24న జిల్లా కలెక్టరేట్‌లో  లక్కీ డ్రా ఉంటుందన్నారు. నిజామాబాద్‌ నగరంలోని 18, 19 షాపులు, బోధన్‌లో 32, 41, 42, ఆర్మూర్‌లో 60, 61, 62 దుకాణాలకు 05 కన్నా తక్కువ దరఖాస్తులు రావడంతో డ్రా నిలిపివేశారు. మళ్లీ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. గతంలో తక్కువ దరఖాస్తులు వచ్చినా లక్కీడ్రా నిర్వహించారు. కానీ ఈ సారి గెజిట్‌లో నిబంధన లేకున్నా మళ్లీ దరఖాస్తులు స్వీకరిస్తున్నారని పలువురు మద్యం దుకాణా దారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

నిబంధనలు పాటించాలి
జిల్లాలో నూతన ఎౖక్సైజ్‌ పాలసీ నవంబర్‌ 1వ తేదీ నుంచి మొదలు కానుంది. 91 మద్యం దుకాణాల్లో 83 మద్యం దుకాణాలకు లైసెన్సు ప్రక్రియ పూర్తి చేశాం. ఇప్పటికే సుమారుగా రూ. 34 కోట్లకుపైగా ఆదాయం సమకూరింది. మరో 8 దుకాణాలకు సైతం దరఖాస్తులు తీసుకుంటున్నాం. 24న లక్కీ డ్రా ఉంటుంది. మద్యం దుకాణాదారులు కచ్చితంగా నిబంధనలు పాటించాలి. దుకాణాలు ఎవరికైనా లీజుకు ఇచ్చినా, నిబంధనలు పాటించకున్నా శాఖపరమైన చర్యలు తీసుకుంటాం.     
 – డాక్టర్‌ నవీన్‌చంద్ర, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌

మరిన్ని వార్తలు