హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచుతా

3 Jun, 2014 02:49 IST|Sakshi
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచుతా
  •      అరాచక శక్తులపై ఉక్కుపాదం
  •      నేరాల అదుపులో ప్రజల భాగస్వామ్యం
  •      నగర పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన మహేందర్ రెడ్డి
  •  సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌గా ఎం.మహేందర్‌రెడ్డి సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు నగర సీపీగా పనిచేసిన, ప్రస్తుత డీజీపీ అనురాగ్‌శర్మ తన చేతుల మీదుగా బషీర్‌బాగ్‌లోని కమిషనర్ కార్యాలయంలో మధ్యాహ్నం మూడు గంటలకు మహేందర్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు.

    అనంతరం మహేందర్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేలా పనిచేస్తామన్నారు. నగరంలో శాంతిభద్రతల అమలు, నేరాల నివారణతో పాటు నిందితులకు శిక్షలు పడేలా చేయటంలోనూ ప్రజలను భాగస్వాములను చేస్తామన్నారు. బాధితుడు నిర్భయంగా ఠాణాకు వచ్చి ఫిర్యాదు చేసే పరిస్థితిని కల్పిస్తామన్నారు. నిజాయితీగా పనిచేసే ప్రతి పోలీసు అధికారికి పూర్తి సహకారం అందిస్తామన్నారు.

    ఇక నగరంలోని అన్ని కూడళ్లలో సర్వేలెన్స్ కెమెరాల ఏర్పాటు ద్వారా నిఘా వ్యవస్థను పటిష్టపరిచి, ప్రపంచంలోనే ఉత్తమ నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. అరాచక, అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. సమాచార వ్యవస్థ బలోపేతం, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, సిబ్బంది కొరత వంటి విషయాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామన్నారు. కేసుల విషయంలో ఎవరితో రాజీపడకుండా బాధితులకు సంపూర్ణ న్యాయం చేసేలా పనిచేస్తామన్నారు.

    దేశంలో ఉగ్రవాద దాడులు ఎక్కడ జరిగినా దాని మూలాలు హైదరాబాద్‌లోనే ఉన్నాయనడం సరికాదన్నారు. సైబరాబాద్‌ను నగర కమిషనరేట్‌లో విలీనం చేసే ప్రతిపాదనేదీ ప్రస్తుతానికి లేదన్నారు. కాగా, ఇప్పటివరకు ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసిన ఆయన దాదాపు ఐదేళ్ల తరువాత సోమవారం పోలీసు యూనిఫామ్‌లో కనిపించారు.

    నూతనంగా బాధ్యతలు చే పట్టిన ఆయనను నగర అదనపు పోలీసు కమిషనర్లు జితేందర్, సందీప్‌శాండిల్య, జాయింట్ పోలీసు కమిషనర్లు సంజయ్‌కుమార్‌జైన్, మల్లారెడ్డి, అబ్రహంలింకన్, శివప్రసాద్, డీసీపీలు కమలాసన్‌రెడ్డి, జయలక్ష్మి, సత్యనారాయణ, త్రిపాఠి, షానవాజ్ ఖాసిం, సుధీర్‌బాబు, శ్యాంసుందర్, టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీలు కోటిరెడ్డి, లింబారెడ్డి కలిసి అభినందించారు.
     
    రెండు ప్రభుత్వాలకు భద్రత
     
    తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు రెండూ నగరంలోనే ఉండడం, దీనికి తోడు వాటి ప్రధాన కార్యాలయాలు సైతం ఇక్కడే ఉండడంతో అందరికీ భద్రత కల్పించేందుకు త్వరలో నియమ నిబంధనలు తయారు చేస్తామని నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. రెండు ప్రభుత్వాల ప్రజాప్రతినిధులు, ప్రముఖులకు పూర్తి భద్రత కల్పిస్తామన్నారు. తమ ముందు చాలా సవాళ్లున్నా.. అధిగమిస్తామన్న ధీమాను ఆయన వ్యక్తపరిచారు.
     

>
మరిన్ని వార్తలు