ఇట్లు.. మీ విధేయులు

1 Jan, 2019 04:22 IST|Sakshi

ఎమ్మెల్సీ స్థానాల కోసం టీఆర్‌ఎస్‌లో పోటాపోటీ..

ఉమ్మడి జిల్లాకు నలుగురు చొప్పున ఆశావహులు 

శాసనమండలిలో ఖాళీ అవుతున్న 13 స్థానాలు 

రాజీనామాలతో ఇప్పటికే నాలుగు ఖాళీ.. 

మార్చితో మరో 9 మంది పదవీకాలం పూర్తి 

ఫిబ్రవరి, మార్చిలో ఎన్నికలు 

కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంతో రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌.. పార్టీ నేతలకు పదవుల పంపకంపై దృష్టి పెడు తోంది. ఫిబ్రవరి, మార్చిలో జరగనున్న శాసన మండలి ఎన్నికల నుంచే ఈ ప్రక్రియను ప్రారంభిం చాలని భావిస్తోంది. టీఆర్‌ఎస్‌లో మొదటి నుంచి పని చేస్తున్న వారికి, పార్టీ విధేయులకు, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పని చేసిన వారికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. రాజీనామాల కారణంగా మండలిలో ఇప్పటికే 4 స్థానాలు ఖాళీ అయ్యాయి. పదవీ కాలం ముగుస్తుండటంతో మార్చిలో మరో తొమ్మిది స్థానాలు ఖాళీ అవుతున్నాయి.

ఈ ఖాళీ స్థానాల్లో అవకాశం కోసం టీఆర్‌ఎస్‌ నేతలు చాలా మంది పోటీపడుతున్నారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు తమ మనసులోని కోరికను చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావును కూడా కలసి పార్టీ కోసం తాము చేసిన పనులను వివరించి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.  రాష్ట్ర శాసనమండలిలో మొత్తం 40 స్థానాలున్నాయి. ఎమ్మెల్యేల కోటా 14, స్థానిక సంస్థల కోటా 14, గవర్నర్‌ కోటా 6, ఉపాధ్యాయుల కోటా 3, పట్టభద్రుల కోటా 4 స్థానాలు ఉన్నాయి. ప్రతి రెండేళ్లకు ఒకసారి మూడింట్లో రెండో వంతు స్థానాలు ఖాళీ అవుతాయి. కేంద్ర ఎన్నికల సంఘం వీటికి ఎన్నికలు నిర్వహిస్తుంది. మార్చిలో 9 స్థానాలు ఖాళీ అవుతున్నాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలు అయిన ముగ్గురు ఎమ్మెల్సీలతోపాటు టీఆర్‌ఎస్‌లో నుంచి కాంగ్రెస్‌లో చేరిన మరో ఎమ్మెల్సీ రాజీనామా చేశారు. ఇలా మొత్తం 13 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం... ఎమ్మెల్యే కోటాలోని ఒక స్థానం మినహా అన్ని అధికార పార్టీకే దక్కనున్నాయి. ఎన్నికల వరకు ప్రతిపక్ష ఎమ్మెల్యేల సంఖ్య ఇంకా తగ్గితే అన్ని టీఆర్‌ఎస్‌ గెలుచుకునే పరిస్థితి ఉంటుంది. అయితే టీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్సీ స్థానాలు ఆశించే వారి సంఖ్య సైతం భారీగానే ఉంది.  

  • ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న హోం మంత్రి మహమూద్‌ అలీ (టీఆర్‌ఎస్‌), మహమ్మద్‌ సలీం (టీఆర్‌ఎస్‌), టి.సంతోశ్‌కుమార్‌ (టీఆర్‌ఎస్‌), మహమ్మద్‌ షబ్బీర్‌అలీ (కాంగ్రెస్‌), పొంగులేటి సుధాకర్‌రెడ్డి (కాంగ్రెస్‌) పదవీకాలం మార్చి ఆఖరుతో ముగుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైన మైనంపల్లి హనుమంతరావు (టీఆర్‌ఎస్‌) రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానం సైతం ఎమ్మెల్యే కోటాలోనిదే. ఇలా ఆరు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం ప్రకారం వీటిలో ఐదు స్థానాలను టీఆర్‌ఎస్‌ గెలుచుకునే పరిస్థితి ఉంది. పదవీకాలం ముగుస్తున్న ముగ్గురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలకు ఆ పార్టీ అధిష్టానం మళ్లీ అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. వీరితోపాటు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ రాజకీయ సలహాదారు శేరి సుభాశ్‌రెడ్డికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్‌రావుకు టీఆర్‌ఎస్‌ కొత్తగా ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే తెలంగాణ ఉద్యమం, 2014 వరకు టీఆర్‌ఎస్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా పని చేసిన అందరికీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్‌లు దక్కాయి. వరంగల్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించిన రవీందర్‌రావుకు ఈసారి ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ భావిస్తున్నట్లు తెలిసింది. 
  • అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలు అయిన కారణంగా మైనంపల్లి హనుమంతరావు (టీఆర్‌ఎస్‌), పట్నం నరేందర్‌రెడ్డి (టీఆర్‌ఎస్‌), కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (కాంగ్రెస్‌) రాజీనామా చేశారు. ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కొండా మురళీధర్‌రావు (టీఆర్‌ఎస్‌) సైతం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. పట్నం నరేందర్‌రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల కోటా స్థానానికి మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎం.సుధీర్‌రెడ్డి, క్యామ మల్లేశ్, కంజర్ల చంద్రశేఖర్‌రెడ్డి పోటీ పడుతున్నారు. కె.రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన నల్లగొండ స్థానిక సంస్థల స్థానం నుంచి తేరా చిన్నపరెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, వేనేపల్లి చందర్‌రావు పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొండా మురళీధర్‌రావు రాజీనామాతో ఖాళీ అయిన వరంగల్‌ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయ్యింది. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పేరును అధిష్టానం ఈ స్థానానికి పరిశీలిస్తోంది. శ్రీనివాస్‌రెడ్డికి ఎమ్మెల్యే కోటాలో అవకాశం కల్పిస్తే ఇతర పేర్లను పరిశీలించే అవకాశం ఉంది.  
  • హైదరాబాద్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎం.ఎస్‌.ప్రభాకర్‌రావు (టీఆర్‌ఎస్‌) పదవీకాలం మార్చి ఆఖరుతో ముగుస్తోంది. టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఈ స్థానంలో ఎం.ఎస్‌.ప్రభాకర్‌రావుకు మళ్లీ అవకాశం కల్పించనుంది.  
  • కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ కె.స్వామిగౌడ్‌ (టీఆర్‌ఎస్‌) పదవీకాలం మార్చితో ముగుస్తోంది. శాసనమండలి చైర్మన్‌గా ఉన్న స్వామిగౌడ్‌కు ఇదే స్థానంలో పోటీ చేసే అవకాశం కల్పించనుంది. స్వామిగౌడ్‌కు ఎమ్మెల్యే కోటాలో అవకాశం కల్పిస్తే ఇక్కడ కరీంనగర్‌ మేయర్‌ రవీందర్‌సింగ్, గ్రూప్‌–1 అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్‌లలో ఒకరిని టీఆర్‌ఎస్‌ బరిలో దింపే అవకాశం ఉంది. 
  • కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి (టీఆర్‌ఎస్‌) పదవీకాలం మార్చిలో ముగుస్తోంది. టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఈ స్థానంలో మరోసారి పాతూరికే అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. 
  • వరంగల్, నల్లగొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ పూల రవీందర్‌ (స్వతంత్ర) పదవీకాలం మార్చిలో ముగుస్తోంది. పూల రవీందర్‌ అధికార పార్టీకి అనుబంధంగానే కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకే టీఆర్‌ఎస్‌ మద్దతు తెలిపే అవకాశం ఉంది.  
మరిన్ని వార్తలు