-

ముథోల్‌: పట్టున్నవారిని పట్టాలి..

29 Nov, 2018 17:30 IST|Sakshi

ఆకర్షణీయమైన వ్యూహాలు 

పావులు కదుపుతున్న పార్టీలు

భైంసా(ముథోల్‌): మండల, గ్రామస్థాయిలో పట్టున్న నాయకులకు ప్రస్తుతం మంచి డిమాండ్‌ ఉంది. ప్రధానంగా ఆ వ్యక్తిని పార్టీలోకి తీసుకుంటే ఎన్ని ఓట్లు వస్తాయని లెక్కలు వేసుకుంటున్నారు. గతంలో రాజకీయంలో వారికున్న అనుభవం. గ్రామంలో, మండలంలో, నియోజకవర్గంలో వారికున్న పట్టును లెక్కలు వేసుకుని ఆహ్వానిస్తున్నారు. అలాంటి వారు ఏ పార్టీలో ఉన్నారు. వారిని ఏ విధంగా తమ వైపునకు తిప్పుకోవాలో అని వ్యూహాలు రచిస్తున్నారు. ప్రస్తుతం మాజీ ప్రజాప్రతినిధులు, మహిళా ప్రతినిధులైన వారి భర్తలను పార్టీలోకి రప్పించుకుని ఓట్లు రాబట్టుకోవాలన్న ఎత్తుగడలు ముథోల్‌ రాజకీయంలో కొనసాగుతున్నాయి. పార్టీలో చేరకముందే పదవులు, ప్రాధాన్యం ఇలా అన్ని విషయాలపై ఒప్పందాలు చేసుకుని మరీ పార్టీలు మారుతున్నారు.

కాంగ్రెస్, ఎన్సీపీ కేంద్రంగా చేరికలు ముమ్మరమయ్యాయి. కాంగ్రెస్‌లో అధికంగా చేరికలు కనిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రచారంతో హోరెత్తిస్తున్న పార్టీల వారు మరో పార్టీకి చెందిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు సహా మాజీ ప్రజాప్రతినిధులను తమవైపు తిప్పుకుంటున్నారు. రానున్న ఎన్నికల్లో సర్పంచు, ఎంపీటీసీలు, ఎంపీపీలుగా అభ్యర్థిత్వం ఇస్తామంటూ భరోసా కల్పిస్తున్నారు. మాజీ ప్రజాప్రతినిధులకు పార్టీ పదవులు ఇతర చైర్మన్‌ పదవులు ఇచ్చేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్, ఎన్సీపీ, టీఆర్‌ఎస్‌లలో ఇవన్నింటిని అమలు చేసేందకు ఒక్కో నాయకుడికి ఒక్కో బాధ్యత అప్పగిస్తూ ఈ తతంగాన్ని నడుపుతున్నారు.  

మరిన్ని వార్తలు