దిగువ మానేరు ఆయకట్టుకు ధీమా!

11 May, 2017 01:52 IST|Sakshi
దిగువ మానేరు ఆయకట్టుకు ధీమా!

► కాకతీయ కాల్వను 0.50 మీటర్‌ లోతుకు తవ్వితే చాలు
► 8.63 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వొచ్చు
► 8,500 క్యూసెక్కుల సామర్థ్యంతో 8 వేలైనా ఇవ్వొచ్చు
► నీటి పారుదల శాఖకు నిపుణుల కమిటీ నివేదిక
► దీనిపై పరిశీలన జరుపుతున్న రాష్ట్ర ప్రభుత్వం


సాక్షి, హైదరాబాద్‌: దిగువ మానేరు డ్యామ్‌(ఎల్‌ఎండీ) పరిధిలో ఉన్న శ్రీరాం సాగర్‌ స్టేజ్‌–1, స్టేజ్‌–2 కింద పూర్తి స్థాయి ఆయకట్టుకు నీళ్లందించే కార్యాచరణ ప్రణాళిక శరవేగంగా సిద్ధమవుతోంది. కాళేశ్వరం కింద నిర్దేశించిన కాల్వల ద్వారా నీటి తరలింపు ప్రక్రియ ఆలస్యమవుతున్న దృష్ట్యా, ఈలోగా ఎల్‌ఎండీ దిగువన కాకతీయ కాల్వల ద్వారా ఎస్సారెస్పీ ఆయకట్టుకు నిళ్లిచ్చే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం పదును పెడుతోంది. కాక తీయ కాల్వల సామర్థ్యాన్ని పూర్తి స్థాయికి తేవడం ద్వారా నీళ్లివ్వొచ్చని ఇటీవల ప్రభు త్వం నియమించిన ఇంజనీర్లతో కూడిన నిపు ణుల కమిటీ నివేదిక ఇవ్వడంతో ఆ దిశగా ఆలోచనలు చేస్తోంది.

కాకతీయ ప్రధాన కాల్వ లోయర్‌ మానేరు డ్యామ్‌ గుండా వెళు తూ 146వ కిలోమీటర్‌ నుంచి 284వ కిలో మీటర్‌ వరకు ఎస్సారెస్పీ స్టేజ్‌–1 పరిధిలోని 4.93 లక్షల ఎకరాలకు, 284వ కిలోమీటర్‌ నుంచి 347వ కిలోమీటర్‌ వరకు ఎస్సారెస్పీ స్టేజ్‌–2లోని 3.70 లక్షల ఎకరాలకు కలిపి మొత్తంగా 8.63 లక్షల ఎకరాలకు నీళ్లిస్తుంది. బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌గా ఉన్న దిగువ మానేరు డ్యామ్‌ సామర్థ్యం 22 టీఎంసీలు కాగా, సొంతంగా 7.5 టీఎంసీలు దానికి నీటి లభ్యత ఉంది. మిగతా నీరు కాకతీయ కెనాల్‌ ద్వారా దీనికి చేరుతుంది. అయితే కాకతీయ కాల్వల పూర్తి ప్రవాహ సామర్థ్యం 8,500 క్యూసెక్కులు కాగా అందులో 50% కూడా ప్రవాహం ఉండ టం లేదు.

గత ఏడాది మర మ్మతులతో 5 వేల క్యూసెక్కుల వరకు గరిష్ట ప్రవాహం సాధ్యౖ మెంది. అయినా ఈ ఏడాది రబీలో 4 వేల నుంచి 5 వేల క్యూసెక్కులు వదిలితేనే 4 చోట్ల గండ్లు పడి, కాల్వలు తెగిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో పూర్తి స్థాయి ఆయకట్టుకు నీరందడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రిటైర్డ్‌ ఇంజనీర్లు బి.అనంతరాములు, పి.వెంకట రామారావు, జి.దామోదర్‌రెడ్డి, సీఈలు బి.శంకర్, అనిల్‌కుమార్, బంగారయ్యతో కలిపి కమిటీని నియమించింది. కాకతీయ కాల్వల పరిధిలో పర్యటించిన కమిటీ ఇటీవలే తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.

కాల్వను వెడల్పు చేయడం వంటి భారీ మరమ్మతులు అవసరం లేదని, కాల్వ బెడ్‌ను 0.50 మీటర్‌ లోతుగా తవ్వితే చాలని సూచించింది. అర మీటర్‌ లోతుగా తవ్వడం వల్ల 8 వేల క్యూసెక్కుల మేర నీటి ప్రవాహాలు ఉంటాయని, లోతు తవ్వడం వల్ల ఎక్కడైనా స్వల్ప మరమ్మతులు అవసరమైతే చేసుకోవచ్చని సూచించింది. కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా ఎస్పారెస్పీ కింది ఆయకట్టుకు నీళ్లందించే అవకాశం ఉన్నా, దానికి సమయం పడుతున్నందున, కాకతీయ కాల్వల ద్వారా నీళ్లివ్వడమే ఉత్తమమని తెలిపింది. ఈ నివేదికపై ప్రభుత్వం ప్రస్తుతం పరిశీలన చేస్తోంది. అనంతరం దిగువ మానేరు ఆయకట్టుకు ధీమా ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేయనుంది.

కాల్వల రిపేర్లకు రూ.96.50 లక్షలు
కాకతీయ ప్రధాన కాల్వల పరిధిలో డీబీఎం–7బీ, డీబీఎం–13 డిస్ట్రిబ్యూటరీలో అత్యవసరమైన నిర్మాణాల మరమ్మతులు, లైనింగ్‌ పనులకు రూ.96.50 లక్షలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బుధవారం నీటిపారుదల శాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు.

మరిన్ని వార్తలు