కరోనా ‘పరీక్షల’ పద్ధతి మార్చాలి

16 Jun, 2020 05:01 IST|Sakshi

స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కరోనా టెస్టులు చేపట్టాలి

గవర్నర్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో నిపుణుల సూచన

ఈ అంశాలపై త్వరలో ప్రభుత్వానికి తమిళిసై నివేదిక  

సాక్షి, హైదరాబాద్‌: ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలకు పూర్తిగా కట్టుబడి ఉండకుండా, స్థానిక పరిస్థితుల ఆధారంగా రాష్ట్రంలో హేతుబద్ధమైన కరోనా నిర్ధారణ పరీక్షల విధానం రూపొందించాలని పలువురు నిపుణులు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు సూచించారు. ముఖ్యంగా వైరస్‌ వ్యాప్తి ఆధారంగా టెస్టింగ్‌ చేపట్టాలని, కాంటాక్టులను సమర్థంగా గుర్తించాలన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రతను అర్థం చేసుకోవడానికి కరోనాతో మరణించిన వారికీ పరీక్షలు నిర్వహించాలన్నారు. టెస్ట్, ట్రేస్, ట్రీట్‌ మాత్రమే దీర్ఘకాలంపాటు అనుసరించగల వ్యూహమని స్పష్టం చేశారు. కరోనాపై పోరులో అనుసరించాల్సిన వ్యూహంపై గవర్నర్‌ తమిళిసై సోమవారం రాజ్‌భవన్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివిధ రంగాల నిపుణులతో మాట్లాడి వారి సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా, కేంద్ర వైద్యారోగ్య శాఖ రిటైర్డ్‌ కార్యదర్శి సుజాతరావు, రిటైర్డ్‌ డీజీపీ హెచ్‌జే దొర, అపోలో ఆస్పత్రుల అధ్యక్షుడు డాక్టర్‌ హరిప్రసాద్, ఐఎంఏ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్‌ విజయేందర్‌రెడ్డి, అమెరికాలో కోవిడ్‌ చికిత్స అందిస్తున్న డాక్టర్‌ స్వామినాథన్, ప్లాస్లా థెరపీ ద్వారా కోలుకున్న తొలి రోగి కె. వంశీమోహన్‌ పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా నిర్మూలనకు ప్రభుత్వం ఈ సలహాలు, సూచనలు వినియోగించుకునేలా సమగ్ర నివేదికను సమర్పిస్తామని గవర్నర్‌ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

గవర్నర్‌కు అందిన సూచనల్లో ముఖ్యమైనవి...
► హాట్‌స్పాట్‌లు, రెడ్‌జోన్లలో అందరికీ పరీక్షలు చేయాలి.
► సామాజిక వ్యాప్తి గుర్తించడానికి యాంటీబాడీ పరీక్షలు జరపాలి.
► హాట్‌స్పాట్లలో ఒకే కిట్‌తో సామూహిక టెస్టులు చేయాలి.
► మొబైల్‌ పరీక్ష ప్రయోగశాలల సేవలను ఉపయోగించుకోవాలి.
► ఆర్టీ–పీసీఆర్‌ టెస్టులను మరింత వేగంగా నిర్వహించాలి.
► వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది, మీడియా వ్యక్తులు, పోలీసులు, సామాజిక సేవ చేస్తున్న వ్యక్తులు, శానిటరీ కార్మికులు వంటి ఫ్రంట్‌లైన్‌ యోధులకు క్రమం తప్పకుండా పరీక్షలు జరపాలి.
► వైద్యులు, పారామెడికల్‌ సిబ్బందిపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలను తీసుకోవాలి.
► ఆరోగ్యశ్రీలో ఉన్న వ్యాధుల జాబితాలో కరోనాను చేర్చాలి.
► పీపీఈ కిట్లు, చేపట్టిన అదనపు పారిశుద్ధ్య చర్యలపై ఆస్పత్రులు చేసిన ఖర్చులను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వ, ప్రైవేటు బీమా సంస్థలను కోరాలి.
► ఆన్‌లైన్‌ కన్సల్టేషన్, టెలి మెడిసిన్‌ సౌకర్యాన్ని మెరుగుపరచాలి. 

మరిన్ని వార్తలు