వార్డెన్‌ భర్తా.. మజాకా?!

26 Mar, 2017 00:58 IST|Sakshi

ఆశ్రమ పాఠశాల విద్యార్థినులపై అసభ్యకర ప్రవర్తన
భరించలేక హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసిన విద్యార్థినులు
అధికారుల విచారణలో వెలుగుచూసిన అరాచకం


చందంపేట (దేవరకొండ): తండ్రి స్థానంలో ఉండాల్సిన ఆ వ్యక్తే విద్యార్థినుల పట్ల నిత్యం అసభ్యంగా ప్రవర్తిస్తూ ఇబ్బంది పెట్టాడు.. అతను తమ వార్డెన్‌ భర్త కావడంతో చెప్పుకున్నా ప్రయోజనం ఉండదని భావించిన విద్యార్థినులు ఆలోచించి నేరుగా ఛైల్డ్‌ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశారు.. దీంతో ఈ నిర్వాకం వెలుగులోకి వచ్చింది.. నల్లగొండ జిల్లా నేరెడుగొమ్ము మండల కేంద్రంలో ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాలలో విజయరాణి వార్డెన్‌గా ఉన్నారు. 55 ఏళ్ల వయసున్న ఆమె భర్త రాజు కూడా హాస్టల్‌లోనే నివాసం ఉంటున్నాడు.

అయితే విద్యార్థినుల పట్ల నిత్యం అసభ్యంగా ప్రవర్తించడం, రాత్రి వేళలో వారిని నిద్రలేప డం, వివిధ రకాలుగా మాటలతో మానసికంగా ఇబ్బంది పెట్టడం వంటి చర్యలకు పాల్పడుతున్నాడు. అయితే దీనికి విసిగిపోయిన విద్యార్థినులు చైల్డ్‌ హెల్ప్‌ లైన్‌ టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసి తమ బాధను వివరించారు. దీంతో ఉన్నతాధికారులు ఈ కేసును దేవరకొండ పట్టణంలో ఉన్న గ్రామ్య స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులకు తెలియజేశారు.

ఈ విషయమై గ్రామ్య నిర్వాహకులు ట్రైబల్‌ వెల్ఫేర్‌ పీడీకి విషయాన్ని తెలియజేశారు. ఈ మేరకు యంత్రాంగం కదలడంతో గ్రామ్య కోఆర్డినేటర్‌ రవి, ట్రైబల్‌ వెల్ఫేర్‌ అధికారి డి.వెంకటేశ్వర్‌నాయక్‌ పాఠశాలకు వెళ్లి అసలు విషయాన్ని ఆరా తీశారు. విడివిడిగా రాజు ప్రవర్తనపై విద్యార్థినులను అడగడంతో ఫిర్యాదులో వాస్తవం ఉందని గ్రహించారు. ఈ విషయమై పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు కూడా కొందరు అతని ప్రవర్తన పట్ల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ మేరకు వారు నేరెడుగొమ్ము పోలీసులకు కేసు వివరాలను తెలియజేసి అతడిపై ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు