ఎక్స్‌ప్రెస్‌ వేను ప్రారంభించిన కేటీఆర్‌

1 May, 2018 11:22 IST|Sakshi
ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ : ఔటర్‌ రింగు రోడ్డులో భాగంగా కండ్లకోయ వద్ద నిర్మించిన 1.10 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్‌వేను తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీ రామారావు ప్రారంభించారు. సుమారు రూ.125 కోట్ల వ్యయంతో నిర్మించిన కండ్లకోయ ఎక్స్‌ప్రెస్‌వేతో 158 కిలోమీటర్ల  ఔటర్‌ రింగ్‌ రోడ్డు మొత్తం వినియోగంలోకి రానుంది. ఔటర్‌ రింగ్‌ రోడ్డు మొత్తం రూ.6696 కోట్ల జైకా నిధులతో పూర్తి చేశారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణం 2005లో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో ప్రారంభమైంది.

ఆయన హయాంలోనే దాదాపు 78 కిలోమీటర్ల ఔటర్‌ రింగు రోడ్డు వినియోగంలోకి వచ్చింది. ఆ తర్వాత రాష్ట్ర విభజన గొడవలతో పనుల్లో వేగం మందగించింది. తెలంగాణ ఏర్పాటై టీఆర్‌ఎస్‌ పాలనలోకి వచ్చిన తర్వాత పనులు వేగిరం పుంజుకున్నాయి. టోల్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్‌తోపాటు, టోలు వసూలు, టోలు కనోపీలను మంత్రి ప్రారంభించారు. కండ్లకోయ ఇంటర్‌చేంజ్‌ వద్ద 8 లేన్లతో నిర్మించిన రోడ్డులో రెండు ఎంట్రీ, రెండు ఎగ్జిట్‌ ర్యాంపులను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్‌ మాట్లాడుతూ..కోర్టులో ఎన్ని చిక్కులు ఎదురైనా ఈ రోజు ఔటర్‌ రింగు రోడ్డు  ప్రారంభమైందన్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై చాలా మంది ప్రయాణం కొనసాగిస్తున్నారని, అలాగే హైదరాబాద్ మహానగరంలో ఎస్‌ఆర్‌డీపీ పేరుతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. 19 ఇంటర్ చేంజ్‌లలో 19 టోల్ మెనేజ్మెంట్ బిల్డింగ్లకు ఈరోజు శంకుస్థాపన చేశామని తెలిపారు. నగరాన్ని కూడా విస్తరిస్తున్నామని, 35 రేడియల్ రోడ్డులను కూడా పూర్తి చేస్తామని వివరించారు. భవిష్యత్తులో ఔటర్ రింగ్ రోడ్డులో టౌన్ షిప్లను కూడా త్వరలోనే ప్రారంభిస్తామని వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన ముఖ్యమైన పనులు కూడా ప్రారంభిస్తామని చెప్పారు. మిషన్ భగీరథ పేరుతో ఔటర్ రింగ్ రోడ్డులో మొత్తం వాటర్ సదుపాయం కల్పించామని అన్నారు. ప్రజల అవసరాలను తీర్చే విధంగా ఇంటర్ గ్రిడ్ని కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు