మరో ‘మెట్రో’

14 Jun, 2019 10:48 IST|Sakshi

అమీర్‌పేట్‌ – హైటెక్‌సిటీ మార్గంలో...  

ఐటీ ఉద్యోగుల రద్దీతో అదనపు రైలు  

సాక్షి, సిటీబ్యూరో: ఐటీ ఉద్యోగుల రద్దీ అధికంగా ఉండడంతో అమీర్‌పేట్‌ – హైటెక్‌సిటీ మార్గంలో అదనంగా మరో మెట్రో రైలును నడపనున్నట్లు హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. హైటెక్‌సిటీ, దుర్గం చెరువు మెట్రో స్టేషన్‌ల నుంచి ఉద్యోగులు కార్యాలయాలకు చేరుకునేందుకు వీలుగా పలు ఐటీ కంపెనీలు షటిల్‌ బస్సులను నడుపుతుండడంతో రద్దీ పెరిగింది. ప్రధానంగా తార్నాక, మెట్టుగూడ, సికింద్రాబాద్‌ ఈస్ట్, ఉప్పల్‌ తదితర ప్రాంతాల నుంచి వేలాదిగా ఐటీ ఉద్యోగులు మెట్రో రైళ్లలో ప్రయాణిస్తుండడంతో అదనపు రైలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ప్రతిరోజు ఉదయం 9 నుంచి 11గంటల మధ్య ఈ రూట్‌లో సుమారు 14వేల మంది ఉద్యోగులు ప్రయాణిస్తుండడంతో రైళ్లు కిటకిటలాడుతున్నాయని పేర్కొన్నారు.

రద్దీ అధికంగా ఉండడంతో అదనపు రైలు ఏర్పాటు చేశామన్నారు. హైటెక్‌సిటీ వద్ద మెట్రో రైలు రివర్సల్‌ సదుపాయం పూర్తయ్యే వరకు అదనపు రైలు రాకపోకలు సాగిస్తుందన్నారు. ప్రస్తుతం రివర్సల్‌ సదుపాయం లేకపోవడంతో ప్రతి 8 నిమిషాలకో రైలు ఈ మార్గంలో అందుబాటులో ఉందన్నారు. జూలై చివరి నాటికి రివర్సల్‌ సదుపాయం పూర్తవుందని.. దీంతో రైళ్ల ఫ్రీక్వెన్సీని తగ్గిస్తామని తెలిపారు. ఆగస్టులో రాయదుర్గం (మైండ్‌స్పేస్‌ జంక్షన్‌) వరకు మెట్రో రైళ్లు అందుబాటులోకి రానున్నాయని, ఈ మార్గంలో ఇప్పటికే పనులు పూర్తయ్యాయని చెప్పారు. ప్రస్తుతం నిత్యం ఎల్బీనగర్‌ – మియాపూర్, నాగోల్‌ – హైటెక్‌సిటీ రూట్‌లో 2.75 లక్షల మంది జర్నీ చేస్తున్నారని తెలిపారు.  

మరిన్ని వార్తలు