‘హాక్ ఐ’..నేరాలకు బై!

1 Jan, 2015 06:23 IST|Sakshi
‘హాక్ ఐ’..నేరాలకు బై!

సాక్షి, సిటీబ్యూరో: నూతన సాంకేతిక పరిజ్ఞానంతో నగరంలో నేరాల నియంత్రణ దిశగా పోలీసులు అడుగులేస్తున్నారు. ఇందులో భాగంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా ‘హాక్ ఐ’ అనే మొబైల్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి బుధవారం దీన్ని ప్రారంభించారు. సామాన్యులను పౌర పోలీసులుగా మార్చడమే దీని లక్ష్యమని ఆయన తెలిపారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజలకు, పోలీసులకు ఇది ఉపయోగపడే తీరును వివరించారు. ఈ యాప్‌ను నగర ప్రజలకు నూతన సంవత్సర కానుకగా ఇస్తున్నామని మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. దేశంలోని పోలీసు వ్యవస్థలోనే ఇది తొలి ప్రయోగమని వెల్లడించారు. ప్రజానుకూల, స్నేహపూర్వక పోలీసింగ్‌కు ‘హాక్ ఐ ’ యాప్ ఉపయోగపడుతుందన్నారు.
 
ఇలా డౌన్‌లోడ్ చేసుకోవాలి...

ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లు ‘గూగుల్ ప్లేస్టోర్’ నుంచి, ఐఓఎస్ (ఆపిల్) యూజర్లు యాప్ స్టోర్ నుంచి ‘హాక్ ఐ’ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఐఓఎస్ వినియోగదారులకు వారం రోజుల్లోపే ఇది అందుబాటులోకి వస్తుంది. ‘హాక్ ఐ’ హైదరాబాద్ పోలీస్’ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే డౌన్‌లోడ్ అవుతుంది.

యాప్ విశిష్టతలు...              
యాప్‌ను ఓపెన్ చేయగానే కింది ఫీచర్లు కనిపిస్తాయి.
     
రిపోర్ట్ వయొలేషన్ టు పోలీస్ (ఇతరులకు అసౌకర్యం కలిగించే వారి వివరాలు పోలీసుల దృష్టికి తీసుకురావచ్చు.)
     
వుమెన్/గర్ల్స్ ట్రావెల్ మేడ్ సేఫ్
     
రిజిస్టర్ డీటెయిల్స్ ఆఫ్ సర్వెంట్/వర్కర్/టెనంట్
     
ఎస్‌ఓఎస్ (సేవ్ ఆఫ్ మై సోల్)
     
ఎమర్జెన్సీ పోలీస్ కాంటాక్ట్స్
     
కమ్యూనిటీ పోలీసింగ్ ఎందుకు నమోదు చేయించుకోవాలి?

నౌకర్లు, కిరాయిదారులు నేరాలు చేసి తప్పించుకుంటే.. వారి వివరాలను సేకరించడం చాలా కష్టం. కొందరు లెసైన్సు కాపీ చూడకుండానే డ్రైవర్లను నియమించుకుం టుంటారు. వాహనం దొంగిలించడం లేదా ఇతర నేరాలు చేసి పారిపోతే వాళ్ల వివరాలు ఎక్కడా దొరకవు. నేరగాళ్లు/ఉగ్రవాదులు కిరాయికి ఇళ్లు తీసుకున్నా, వారి వివరాలు ఉండవు. ఇలాంటి వాళ్లు కిరాయిదారుల ముసుగులో వచ్చి నేరాలు చేసినట్టు చాలాసార్లు తేలింది. ప్రమాదం జరిగిన తరువాతే వీటి అవసరం తెలుస్తుంది. అందుకే ఉద్యోగులు/కిరాయిదారుల వివరాలు పోలీసులకు తెలియజేస్తే.. వాటిని అన్ని పోలీసు స్టేషన్ల సర్వర్లలో నిక్షిప్తం చేస్తారు. వాళ్ల ఫొటోలు, ఇతర వివరాలు ఉంటాయి కాబట్టి నేరాలు చేసేందుకు జంకుతారు. నేరం జరిగితే సత్వరం స్పందిందేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది.
 
ఆరు నెలల సమయం పట్టింది: శ్రీనాథ్‌రెడ్డి

ఈ ప్రత్యేక యాప్ తయారు చేసేందుకు ఐటీ సెల్ బృందానికి ఆరు నెలల సమయం పట్టింది. దేశంలోనే ఇది కొత్త తరహా యాప్. ప్రజలకు 24 గంటలూ ఉపయోగపడుతుంది. ఫిర్యాదుదారులు పంపే ఫోటోలు, వీడియో క్లిప్పింగ్స్ అన్నీ సర్వర్‌లో డేటాబేస్‌లో రికార్డు అవుతాయి. ప్రతి ఠాణాలోనూ దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను పొందుపరిచాం. నిందితులకు శిక్ష  పడేందుకు కూడా ఈ యాప్ ఉపయోగపడుతుంది.
 
యాప్‌తో అందించే సేవలు
మహిళలు ముందుగా తమ ప్రయాణ వివరాలను తెలియజేయడం ద్వారా సురక్షితంగా ప్రయాణించవచ్చు.
     
అపాయకర పరిస్థితి ఎదురైనప్పుడు యాప్‌లోని ‘ఎస్‌ఓఎస్’ బటన్ నొక్కాలి. దీని ద్వారా ముందుగా రికార్డు చేసిన సందేశం (ప్రి రికార్డెడ్) బాధితురాలి బంధువులు, స్నేహితులు, సంబంధిత పోలీసు అధికారులు, పెట్రోలింగ్ పోలీసులకు చేరుతుంది.
     
ఈ యాప్‌తో పోలీసులకు ట్రాఫిక్ ఉల్లంఘనల సమాచారం ఇవ్వవచ్చు.
     
మీ కళ్ల ముందు జరిగే నేరాల వివరాలు తెలియజేయవచ్చు.
     
పోలీసింగ్‌ను మరింత మెరుగుపరిచేందుకు అవసరమైన సలహాలు, సూచనలు అందించవచ్చు. వారు చేపట్టే మంచి పనులను అందరికీ తెలియజేయవచ్చు.
     
పోలీసులతప్పులపైనా ఫిర్యాదు చేయవచ్చు.
     
మీ ఇంటి పని మనుషులు/ఉద్యోగులు/కిరాయిదారుడి వివరాలను పోలీసులకు తెలపడం ద్వారా అపాయకర పరిస్థితులు ఎదురవకుండా జాగ్రత్త వహించవచ్చు.
     
ఈ యాప్ కమ్యూనిటీ పోలీసింగ్ అమలుకు ఎంతో ఉపయోగపడుతుంది.
     
హైదరాబాద్ నగర పోలీసుల ఫోన్ నంబర్లన్నీ పొందవచ్చు.
     
ఏదైనా ఫిర్యాదు/రిపోర్టుల స్టేటస్‌ను తెలుసుకోవచ్చు.
 

మరిన్ని వార్తలు