గాడ్జెట్ల వాడకంతో కంటి సమస్యలు

16 Sep, 2018 01:55 IST|Sakshi

  ‘ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రి’ కార్యక్రమంలో గవర్నర్‌ నరసింహన్‌ 

  గ్రామాలతోపాటు పట్టణాలపైనా దృష్టి పెట్టాలని సూచన 

  23న జన్‌ ఆరోగ్య యోజన ప్రారంభం: కేంద్ర మంత్రి నడ్డా 

  పథకంలో భాగంగా 55 కోట్ల మందికి గోల్డ్‌ ఆరోగ్య కార్డులు 

  ఏడాదికి రూ.5 లక్షల ఆరోగ్య కవరేజీ ఉంటుందని వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: కంప్యూటర్లు, మొబైల్‌ ఫోన్లు లాంటి గాడ్జెట్ల వాడకంతో పట్టణ ప్రాంతాల్లో కంటి సమస్యలు మరింత పెరిగాయని గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ అన్నారు. కాబట్టి పట్టణాల్లోనూ కంటి సమస్యలను తగ్గించాల్సిన అవసరం ఉందని, దీనిపై ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రి దృష్టి సారించాలన్నారు. ఎల్వీ ప్రసాద్‌ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ సామాజిక నేత్ర సంరక్షణ విభాగం ‘గుళ్లపల్లి ప్రతిభారావు ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌మెంట్‌ ఆఫ్‌ రూరల్‌ ఐ కేర్‌’20వ వార్షికోత్సవం శనివారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్‌ మాట్లాడుతూ.. చాలా మంది ఆరోగ్య పరీక్షలపై దృష్టి సారించడం లేదని, కంటి సమస్యలను ముందే గుర్తించకపోతే తర్వాత మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు పెరిగాయన్నారు. ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రి ప్రజలకు చేస్తున్న సేవలను కొనియాడారు.  

55 కోట్ల మందికి గోల్డ్‌ ఆరోగ్య కార్డులు: నడ్డా 
దేశవ్యాప్తంగా 55 కోట్ల మంది కోసం ఈ నెల 23న ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా వెల్లడించారు. పథకాన్ని అమలుకు 29 రాష్ట్రాలూ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయన్నారు. పథకంలో భాగంగా ప్రజలకు గోల్డ్‌ ఆరోగ్య కార్డులు ఇస్తామని, కార్డులున్న వారికి ఏడాదికి రూ. 5 లక్షల ఆరోగ్య కవరేజీ ఉంటుందన్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య కవరేజీ కార్యక్రమమన్నారు. 1,350 రకాల వ్యాధులకు అవసరమైన చికిత్సలు, శస్త్ర చికిత్సలు దీని ద్వారా చేయించుకోవచ్చని చెప్పారు. ఇందులో కంటి శస్త్రచికిత్సలూ ఉన్నాయన్నారు.  

2022 నాటికి అన్నీ వెల్‌నెస్‌ సెంటర్లే 
కేంద్ర ప్రభుత్వం 2017లో సమగ్ర ఆరోగ్య విధానాన్ని ప్రకటించిందని, కొత్త విధానం ద్వారా వైద్యాన్ని ప్రజలకు చేరువ చేశామని నడ్డా చెప్పారు. దేశ ప్రజలంతా జీవితాంతం ఆరోగ్యంగా ఉండేందుకు ఆయుష్మాన్‌ భారత్‌ తీసుకొచ్చామన్నారు. దేశంలోని లక్షన్నర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), ఉప కేంద్రాలన్నింటినీ వెల్‌నెస్‌ సెంటర్లుగా మారుస్తామన్నారు. గతేడాది 4 వేలు, ఈ ఏడాది 5 వేలు.. ఇలా 2022 నాటికి అన్ని కేంద్రాలనూ మార్చేస్తామని చెప్పారు. మహిళలకు సర్వైకల్‌ కేన్సర్‌ వ్యాధి నిర్ధారణ పరీక్షలు మొదలు అన్ని రకాల సమగ్ర పరీక్షలు వెల్‌నెస్‌ సెంటర్లలో చేస్తారని చెప్పారు. ఎల్వీ ప్రసాద్‌ సేవలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా విస్తరించాలని, అందుకు కేంద్రం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ దక్షిణాసియా ప్రాంతీయ డైరెక్టర్‌ పూనం ఖేత్రపాల్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.    

మరిన్ని వార్తలు