అకౌంటింగ్‌.. కేర్‌ఫుల్‌..

25 May, 2020 08:57 IST|Sakshi

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’కు పెరిగిన సమయం

‘నెట్‌ వర్క్స్‌ని సురక్షితంగా మార్చుకోవాలి

సిటీ అకౌంటెంట్లకు హనాది ఖలీఫా సూచన

సాక్షి, సిటీబ్యూరో:  ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని రకాల ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయడానికి అలవాటు పడుతున్నారు. ఇదే సమయంలో ఇలాంటి ఎందరో ఉద్యోగుల, వ్యాపారుల ఖాతాలను నిర్వహించే ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌(ఎఫ్‌ అండ్‌ ఏ) వృత్తి నిపుణుల వర్కింగ్‌ స్టైల్‌ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు సిద్ధమవడంతో పాటు మారిన పనితీరుకు అనుగుణంగా తమను తాము తీర్చిదిద్దుకోవాలని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెంట్స్‌ (ఐఎమ్‌ఎ)కు చెందిన హనాది ఖలీఫా సూచిస్తున్నారు. దాదాపు అన్ని రకాల వ్యాపారాలకు సేవలు అందించే ఎఫ్‌ అండ్‌ ఏ నిపుణులు గతంలోని తమ పనిశైలికి భిన్నమైన శైలిని అలవర్చుకోవాలన్నారామె.

ఓ సదస్సులో భాగంగా నగర అకౌంటెంట్లకు ఆమె శుక్రవారం పలు సూచనలు చేశారు. ప్రస్తుతం వార్షిక ఆదాయపు పన్ను ఫైలింగ్‌ జూన్‌ నెలకు పొడిగంచడంతో ఆర్థిక ఖాతాల నిర్వాహక నిపుణులకు సిద్ధమయ్యేందుకు తగిన సమయం లభించిందన్నారు. పలు కంపెనీలకు సంబంధించిన వ్యాపార రహస్యాలతో పాటు అత్యంత విలువైన డేటా తదితర సమాచారాలను నిర్వహిస్తుంటారు కాబట్టి తమ ఇంటికి సంబంధించిన ‘నెట్‌ వర్క్స్‌ని పూర్తి సురక్షితంగా మార్చుకోవడం చాలా అవసరమన్నారు. పనిలో సౌలభ్యత కోసం అకౌంటింగ్‌ నిపుణులు క్లౌడ్‌ కంప్యూటింగ్‌ అకౌంటింగ్‌ సాఫ్ట్‌వేర్‌ను సమకూర్చుకోవాలని సూచించారు. జూమ్‌ లేదా స్కైప్‌ వంటివి వినియోగిస్తూ ఏ మాత్రం కమ్యూనికేషన్‌ ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలన్నారు. దీర్ఘకాలిక మార్పులకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతిక సామర్థ్యాలను సంతరించుకునేందుకు తమను తాము అన్ని రకాలుగా తీర్చిదిద్దుకునేందుకు ప్రస్తుత సంక్షోభాన్ని ఉపయోగించుకోవడం వారికి మేలు చేస్తుందన్నారు. 

మరిన్ని వార్తలు