నిరుపేదకు నీడనిచ్చిన ‘ఫేస్‌బుక్‌’ మిత్రులు

29 Mar, 2018 08:30 IST|Sakshi
నిర్మించిన ఇంటి వద్ద లబ్ధిదారుతో సత్యసాయి సేవా సమితి సభ్యులు 

రూ.1.02 లక్షలతో ఇంటి నిర్మాణం

 ప్రారంభించిన సత్యసాయి అభయహస్తం సభ్యులు

ధర్మపురి: ఫేస్‌బుక్‌ మిత్రుల సాయంతో ఓ నిరుపేదకు నూతన గృహాన్ని నిర్మించగా.. జగిత్యాలకు చెందిన సత్యసాయి అభయహస్తం స్వచ్ఛంద సభ్యులు ధర్మపురి తహసీల్దార్‌ నవీన్‌కుమార్, సీఐ లక్ష్మీబాబుతో కలిసి బుధవారం ప్రారంభించారు. వెల్గటూర్‌ మండలం ఎండపెల్లి గ్రామానికి చెందిన  నిరుపేద అయిన కుంకునాల పోశవ్వ భర్త సూరయ్య గతంలో అనారోగ్యంతో మృతిచెందాడు. ఓ పూరిగుడిసెలో ఉంటూ.. కూలి పనిచేస్తూ.. ఇద్దరు కుమారులను చదివిస్తోంది. పోశవ్వ దీనస్థితిని ఫేస్‌బుక్‌ వేదికగా ధర్మపురికి చెందిన సామాజిక సేవకుడు రేణికుంట రమేష్‌ గత నెల పోస్ట్‌ చేశాడు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఫేస్‌బుక్‌ మిత్రులు రూ.90 వేలు విరాళం అందించారు.

స్థానికులంతా కలిసి మరో రూ.12వేలు అందించారు. పోశవ్వకు సొంతస్థలం లేకపోవడంతో  సర్పంచ్‌ అందుర్థి గంగాధర్‌ పంచాయతీ తీర్మానంతో కొంత స్థలం కేటాయించారు. దీంతో రమేష్‌ నూతన గృహాన్ని నిర్మించి అన్ని వసతులు కల్పించారు. కార్యక్రమానికి హాజరైన తహసీల్దార్‌ పోశవ్వ కుమారుల చదువు ఖర్చుల కోసం రూ.ఐదువేలు సాయం అందించారు. కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్‌ రవి, ఆర్‌ఐ గంగాధర్, సామాజిక సేవకులు బోనాల సునీత, పాల్తెపు భూమేశ్వర్, ప్రభుత్వ ఉపాధ్యాయులు వినోద, దహగం గణేష్, విద్యార్థులు, గ్రామస్థులు తదితరులున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా