పోలీసు వ్యవస్థపై నమ్మకం కల్పించారు

28 Feb, 2020 03:43 IST|Sakshi
ఏసీపీ భుజంగరావు కాళ్లు మొక్కుతున్న పాముల ప్రవీణ్‌ 

హాజీపూర్‌ బాధిత కుటుంబాల భావోద్వేగం

శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష అమలుచేయాలని డిమాండ్‌

కంటతడి పెట్టించిన ముఖాముఖి సమావేశం

బొమ్మలరామారం: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో గ్రామస్తులు, బాధితులతో అధికారులు ఏర్పాటు చేసిన సమావేశం ఆద్యంతం భావోద్వేగంగా సాగింది. రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేష్‌ భగవత్, కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ హాజీపూర్‌లో గురువారం ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఓ బాధితురాలి బాబాయ్‌ ప్రవీణ్‌ ఏసీపీ భుజంగరావు కాళ్లపై పడి బోరుమన్నాడు. పోలీసు వ్యవస్థపై నమ్మకం కల్పించారని ప్రశంసల వర్షం కురిపించారు. ముగ్గురు బాలికల తండ్రులు మల్లేష్, నర్సింహ, తుంగని నందం మాట్లాడుతూ నిందితుడికి ఉరి శిక్ష త్వరగా అమలు చేయాలని, వాడి ప్రాణం పోయినప్పుడే తమ పిల్లల ఆత్మలు శాంతిస్తాయన్నారు. గ్రామానికి వంతెన మంజూ రు చేయాలనే ప్రజల వినతిపై కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ స్పందించి రూ. కోటి 70 లక్షలతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు వెల్లడించారు. సాంకేతిక కారణాలతో ఓ కుటుంబానికి ప్రభుత్వసాయం అందడం లేదని, కోర్టు ద్వారా అíప్పీల్‌కు వెళితే తప్పక న్యాయం జరుగుతుందని కలెక్టర్‌ హామీ ఇచ్చారు.  

కలెక్టర్‌ గారూ  ఆదుకోండి.. 
రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం మాది. పెద్ద కూతురుకు మానసిక సమస్య. ఉన్న ఒక్క కొడుకు వికలాంగుడు. ఉండేందుకు ఇల్లు కూడా సరిగా లేదు. ఇంటి పెద్ద పనిచేస్తేనే పూట గడుస్తుంది. చురుకుగా ఉన్న నా చిన్న కూతురు ను కిరాతకుడు శ్రీనివాస్‌రెడ్డి పొట్టన పెట్టుకున్నాడు. ప్రభుత్వం నుంచి వచ్చిన సాయం రూ.లక్ష దాటలేదు. ఇప్పుడేమో తమకు ప్రభుత్వ సాయం అందదని తెలిసింది. ఎలాంటి ఆధారం లేని తమను మీరే పెద్ద మనసు చేసుకొని ఆదుకోవాలి. జీవనోపాధి కోసం ఉద్యోగం ఇప్పించాలి. – మైసిరెడ్డిపల్లి బాలిక కుటుంబ సభ్యులు

మరిన్ని వార్తలు