‘జాడ’ను ఇట్టే పట్టేయొచ్చు..!

17 Jun, 2018 03:56 IST|Sakshi

వాంటెడ్, మిస్సింగ్‌ కేసులు ఛేదించేందుకు రంగంలోకి ఫేస్‌ రికగ్నైజేషన్‌..

టీఎస్‌ కాప్‌కు అనుసంధానం

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఓ గుర్తు తెలియని మహిళ పోలీసులకు కనిపించింది. ఆమె ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చింది.. అన్న వివరాలు ఎలా గుర్తించాలో కష్టసాధ్యమైంది. అయితే ప్రస్తుతం పోలీస్‌ శాఖ ప్రవేశపెట్టిన టీఎస్‌కాప్‌ యాప్‌ ద్వారా క్షణాల్లో ఆ మహిళ వివరాలన్నీ ఆన్‌లైన్‌ ద్వారా తెలిసిపోతాయి.

రాష్ట్రవ్యాప్తంగా అదృశ్యమైన వారి జాబితా, ఫొటోలు టీఎస్‌కాప్‌ యాప్‌కు అనుసంధానించారు. దీంతోపాటు అదృశ్యమైన రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఉన్నా ఫొటోలను ట్యాబ్‌ ద్వారా తీసి ఫేస్‌ రికగ్నైజేషన్‌తో సరిపోల్చే సౌకర్యాన్ని పోలీసులు అందుబాటులోకి తీసుకొచ్చారు.

దీంతో ఆదిలాబాద్‌కు చెందిన మహిళ సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఉన్నట్లు గుర్తించి సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. ఇలా ఏళ్ల నుంచి ఎక్కడున్నారో ఏమైపోయారో తెలియని వారి జాడను టెక్నాలజీ ద్వారా సులువుగా గుర్తించే విధానం దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలోనే అందుబాటులోకి వచ్చింది.  

‘వాంటెడ్‌ క్రిమినల్స్‌’కి సైతం..
నేరాల నియంత్రణలో టెక్నాలజీ వినియోగం పెరిగిపోవడంతో అనుమానిత వ్యక్తులను అక్కడికక్కడే గుర్తించేందుకు ఈ ఫేస్‌ రికగ్నైజేషన్‌ ఉపయోగపడుతుందని పోలీస్‌ శాఖ భావిస్తోంది. నేరాలు జరిగిన ప్రాంతాలను ఇప్పటికే క్రైమ్‌ హాట్‌స్పాట్స్‌గా గుర్తించింది.

అలాగే 70 వేల మందికి పైగా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న వారి జాబితాను టీఎస్‌కాప్‌ డేటా సర్వర్‌లోకి అప్‌లోడ్‌ చేశారు. పెట్రోలింగ్‌ చేస్తున్న సందర్భంలో కానీ, నాకాబందీ చేస్తున్న సమయంలో కానీ, వేరే సమయంలో కానీ అనుమానిత వ్యక్తి కనిపిస్తే అతడు పాతనేరస్తుడా.. లేదా కొత్త వ్యక్తా అన్న వివరాలను తెలుసుకునేందుకు ఫేస్‌ రికగ్నైజేషన్‌ ఉపయోగపడనుంది. అనుమానితు డిని ట్యాబ్‌ ద్వారా ఫొటో తీసి టీఎస్‌కాప్‌ పాత చిత్రంతో పోలుస్తుంది.

ఒకవేళ కొత్త వ్యక్తి అయితే వదిలేస్తారు. పాత నేరస్తుడిగా రుజువైతే అదుపులోకి తీసుకొని విచారించేందుకు సులభంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటివరకు అనుమానితులపై ఉన్న పాత కేసులను రికార్డులు తిరగేస్తే కానీ తెలిసేవి కావు. ఈ కొత్త విధానం ద్వారా ఎవరికీ ఇబ్బంది లేకుండా ఉంటుందని, ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో ఇది కీలకంగా మారుతుందని ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు.

మూడు రకాల ఆప్షన్లు..
అదృశ్యమైన వారి వివరాలు, వాంటెడ్‌ క్రిమినల్స్‌ వివరాలను సరిపోల్చుకునేందుకు మూడు ఆప్షన్స్‌ను టీఎస్‌కాప్‌ యాప్‌లో క్రోఢీకరిస్తున్నారు. ఒకటి మిస్సింగ్‌ ఆప్షన్, రెండోది వాంటెడ్‌ ఆప్షన్, మూడోది మీడియా ఆప్షన్‌ కింద అందుబాటులోకి తెచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా ఏ నేరంలో అరెస్టయినా మీడియా ముందు ప్రవేశపెట్టినప్పటి ఫొటోలను యాప్‌లో అప్‌లోడ్‌ చేశారు. దీని ద్వారా ఎప్పటికప్పుడు నిందితుల డేటా అప్‌డేట్‌ అవడంతో పాటు అదృశ్యమైన వారి వివరాలు యాప్‌లో ఉండేలా చేస్తున్నారు.

మరిన్ని వార్తలు