1:10 నిష్పత్తిలో ఇంటర్వ్యూలు!

10 Oct, 2017 03:14 IST|Sakshi

అధ్యాపక పోస్టుల భర్తీపై వీసీల కమిటీ సిఫారసులు

మెరిట్‌ ఆధారంగానే స్క్రీనింగ్‌.. ప్రత్యేకంగా పరీక్ష లేదు

సాక్షి, హైదరాబాద్‌: యూనివర్సిటీల్లో 1,061 అధ్యాపక పోస్టుల భర్తీకి అనుసరించాల్సిన విధానంపై వైస్‌ చాన్స్‌లర్ల కమిటీ కీలక సిఫారసు చేసింది. ఇప్పటివరకు వర్సిటీల్లో అధ్యాపక పోస్టుల భర్తీలో దరఖాస్తు చేసుకున్న అందరిని ఇంటర్వ్యూలకు పిలిచే విధానానికి పుల్‌స్టాఫ్‌ పెట్టాలని నిర్ణయించింది. ఒక్కో సబ్జెక్టులో ఒక్కో పోస్టుకు పది మందిని మెరిట్స్, రిజర్వేషన్, రోస్టర్‌ ఆధారంగా ఇంటర్వ్యూలకు (1:10 నిష్పత్తిలో) ఎంపిక చేయాలని సూచించింది.

ఈ మేరకు వర్సిటీల్లో అధ్యాపక పోస్టుల భర్తీలో అనుసరించాల్సిన విధానంపై ప్రభుత్వం నియమించిన వైస్‌ చాన్స్‌లర్ల కమిటీ రెండు రోజుల కింద ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను స్క్రీనింగ్‌ చేసేందుకు ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించాల్సిన అవసరం లేదని పేర్కొంది. దరఖాస్తు చేసుకున్న వారి మెరిట్స్‌ ఆధారంగా స్క్రీనింగ్‌ చేయాలని సూచించింది. ఆ మెరిట్‌ నిర్ణయానికి ఆరు ప్రధాన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని వెల్లడించింది.

ఒక్కో అంశానికి 10 మార్కుల చొప్పున 60 మార్కులకు వెయిటేజీ ఇచ్చి, మెరిట్‌ ఉన్న వారిని ఇంటర్వ్యూలకు ఎంపిక చేయాలని సూచించినట్లు తెలిసింది. అలాగే ఇంటర్వ్యూలో 4 కీలక అంశాల్లో అభ్యర్థిని బట్టి 40 మార్కుల వరకు కేటాయించే విధానాన్ని సూచించినట్లు సమాచారం. తద్వారా ఇంటర్వ్యూలను త్వరగా పూర్తి చేయవచ్చని పేర్కొన్నట్లు తెలిసింది. ఏ వర్సిటీ నోటిఫికేషన్‌ను ఆ యూనివర్సిటీనే ఇవ్వాలని, ఒక వర్సిటీలో దరఖాస్తు చేసుకున్న వారు మరో యూనివర్సిటీలోనూ పోస్టు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సిఫారసు చేసినట్లు తెలిసింది.

ఇంటర్వ్యూ కమిటీలో రాష్ట్రంలోని యూనివర్సిటీలకు చెందిన వారు కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని సబ్జెక్టు నిపుణుడిగా నియమించాలని సూచించినట్లు తెలిసింది. తద్వారా పోస్టుల భర్తీని పారదర్శకంగా చేపట్టవచ్చని సూచించినట్లు సమాచారం. స్క్రీనింగ్‌ కమిటీలో వైస్‌ చాన్స్‌లర్, డీన్, డిపార్ట్‌మెంట్‌ హెడ్, ఇద్దరు సబ్జెక్టు ఎక్స్‌పర్ట్స్, ఇంటర్వ్యూ కమిటీలో వైస్‌ చాన్స్‌లర్, డీన్, రిజిస్ట్రార్, సబ్జెక్టు ఎక్స్‌పర్ట్‌ ఉండాలని పేర్కొన్నట్లు తెలిసింది. న్యాయశాఖ అభిప్రాయం తర్వాత ఈ 1,061 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసే అంశంపై ప్రభుత్వం కసరత్తు చేయనుంది.

మెరిట్‌ నిర్ణయానికి ఆరు ప్రధాన అంశాలు..
► పోస్టు గ్రాడ్యుయేషన్‌లో మార్కులు
► అకడమిక్‌ రికార్డు (స్లెట్, నెట్, పీహెచ్‌డీ, విదేశాల్లో చదువులు)
► పబ్లికేషన్స్‌.. వివిధ అధ్యయన పత్రాలు, రచనలు..
► ఫెలోషిప్‌లు, పరిశోధనలు, ప్రాజెక్టులు.. వాటి ఫలితాలు
► సర్వీసు, అనుభవం (కాంట్రాక్టు లేదా ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిన పని చేస్తున్న కాలం, ప్రైవేటు కాలేజీల్లో బోధన అనుభవం)
► అవార్డులు, రివార్డులు)

ఇంటర్వ్యూ కమిటీ పరిగణనలోకి తీసుకునే 4 అంశాలు
లెక్చర్స్, పరిశోధనలు, సబ్జెక్టు విశ్లేషణ, అభ్యర్థి వ్యక్తిత్వం తదితరాలు. 

మరిన్ని వార్తలు