అడవిపై గొడ్డలి వేటు

17 Oct, 2019 08:19 IST|Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌ : అధికారుల నిర్లక్ష్యంతో రానురాను అడవులు మాయమయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి. జిల్లాలో 1,83, 210 హెక్టార్ల విస్తీర్ణంలో అటవీ ఉండగా, ఇప్పటికే లక్ష హెక్టార్లకు పైగా క్షీణించిపోయింది. మిగిలిన భాగాన్నైనా కాపాడితేనే అడవుల జిల్లా అనే పేరు ఉంటుంది. లేదంటే ఒకప్పుడు అడవులు ఉండేవని చదువుకోవాల్సి వస్తుంది. క్షీణించిన అటవీలో గజ్వేల్‌ స్ఫూర్తితో సహజసిద్ధమైన అటవీని పెంచాలనే ప్రయత్నాలు ప్రారంభించినా..ఉన్న అటవీని రక్షించాలనే తపన అధికారుల్లో కనిపించకపోవడం గమనార్హం. 

దిగువ సిబ్బందిపైనే వేటు
అటవీలో గొడ్డలివేటు వంటి అలజడి జరిగినప్పుడు అటవీశాఖ అధికారులు దిగువ సిబ్బందిపైనే వేటు వేస్తారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి తాజాగా జరిగిన వాయిపేట్‌ సంఘటనలోనూ ఇలాంటి విమర్శలే వచ్చాయి. వాయిపేట్‌ ఘటనలో ఓ బీట్‌ ఆఫీసర్, ఓ సెక్షన్‌ ఆఫీసర్లపై సస్పెష్షన్‌ వేటు వేశారు. అయితే రేంజ్‌ ఆఫీసర్‌పై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై యువ సిబ్బందిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే సస్పెన్షన్‌ వేటు పడిన వారి స్థానంలో ఇతర సెక్షన్, బీట్‌ ఆఫీసర్లను నియమించారు. దీనిపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు వాయిపేట్‌ అటవీ విధ్వంసం జరిగినప్పుడు అక్కడే పనిచేసిన ఈ అధికారులకు తిరిగి అక్కడే పోస్టింగ్‌ ఇవ్వడం విస్మయం కలిగిస్తోంది. అయితే గ్రామస్తులతో మమేకమయ్యే పరిస్థితి ఉండడంతోనే వారికి తిరిగి అక్కడే పోస్టింగ్‌ ఇచ్చినట్లు అటవీశాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. 

అధికారుల వైఫల్యం..
అటవీశాఖ పరంగా జిల్లాలో తొమ్మిది రేంజ్‌లు ఉండగా, 75 సెక్షన్లు, 170 బీట్లు ఉన్నాయి. సాధారణంగా సెక్షన్, బీట్‌ ఆఫీసర్లకు ద్విచక్ర వాహనాలను ప్రభుత్వమే కల్పించింది. నిరంతరం అటవీని పర్యవేక్షించాల్సిన వీరు విధుల్లో నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయన్న విమర్శలు లేకపోలేదు. బీట్‌ ఆఫీసర్‌ నెలలో 30 రోజులు, సెక్షన్‌ ఆఫీసర్‌ నెలలో 20 రోజులు తమ విస్తీర్ణం పరిధిలో తిరిగి అటవీకి సంబంధించిన సమాచారాన్ని పైఅధికారులకు చేరవేస్తుండాలి. అలాగే డ్యూటీకి సంబంధించి నిరంతరంగా డైరీలో నమోదు చేస్తుండాలి. వీరిపై ఫారెస్టు రేంజ్‌ అధికారి పర్యవేక్షణ ఉండాల్సి ఉన్నా నామమాత్రం అవుతుంది. దీంతోనే క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడుతుందన్న విమర్శలు ఉన్నాయి.

వాయిపేట ఘటన ఒక్కరోజుతో జరిగింది కాదని, ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలోని చెట్లను నరికివేయడానికి కొన్ని రోజులు పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తం ఘటన జరిగే వరకు బీట్, సెక్షన్‌ అధికారులకు కనీసం సమాచారం లేకపోవడం ఇక్కడ విస్మయం కలిగిస్తోంది. దీన్నిబట్టి క్షేత్రస్థాయిలో అటవీ అధికారులు పర్యవేక్షించడం లేదన్నది తేటతెల్లం అవుతోంది. కింది నుంచి పైవరకు అధికారులు పట్టణ ప్రాంతాల్లో ఉంటూ అడపాదడపా విధులకు వెళ్తుండడంతోనే ఇలాంటి సంఘటనలు జరిగినా సమాచారం ఉండడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అటు స్మగ్లర్లు కానీ, ఇటు గ్రామస్తులు గాని అనువైన సమయం కోసం ఎదురుచూసి ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. వాయిపేట ఘటన దసరాకు ముందు జరిగినట్టు చెబుతున్నారు. ఆ సమయంలో అటవీ అధికారులు దృష్టి సారించకపోవడంతో ఈ నష్టం జరిగిపోయింది. 

పోస్టులు ఖాళీయే..
అటవీశాఖ క్షేత్రస్థాయిలో ఖాళీ పోస్టులు వెక్కిరిస్తున్నాయి. ప్రతీ 400 హెక్టార్లకు ఒక బీట్‌ ఆఫీసర్‌ ఉండాల్సి ఉండగా ఎన్నో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 170 బీట్‌ ఆఫీసర్‌ పోస్టులకు ఇటీవల వరకు కేవలం 35 మంది మాత్రమే పనిచేశారు. తాజాగా 65 మందిని ప్రభుత్వం నియమించింది. మరోపక్క సెక్షన్‌ ఆఫీసర్లకు సంబంధించి 75 పోస్టులకు 10 ఖాళీగా ఉన్నాయి. ఇక జిల్లా అటవీశాఖ అధికారి (డీఎఫ్‌ఓ) తర్వాత 3 ఎఫ్‌డీఓ పోస్టులు ఆదిలాబాద్, ఇచ్చోడ, ఉట్నూర్‌కు ఉన్నాయి. వీరి కింద 9 మంది ఎఫ్‌ఆర్‌ఓలు ఉన్నారు. డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్, సెక్షన్‌ ఆఫీసర్, బీట్‌ ఆఫీసర్‌.. ఇలా అటవీ శాఖలో అధికారుల పోస్టులు వికేంద్రీకృతమై ఉన్నాయి. నిరంతరం పర్యవేక్షణ సరిగ్గా జరిగితేనే అటవీని రక్షించే పరిస్థితి ఉంటుంది. లేదంటే అడవులు మైదానాలుగా తయారయ్యే పరిస్థితి లేకపోలేదు. 

మరిన్ని వార్తలు