దూరదృష్టి ఉంటే అద్భుత ఫలితాలు

9 May, 2018 01:35 IST|Sakshi
శిక్షణకు హాజరైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు (ఇన్‌సెట్‌లో) మాట్లాడుతున్న స్పీకర్‌ మధుసూదనాచారి

      గ్రామీణుల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు కృషిచేయాలి 

      ఎన్‌ఐఆర్‌డీ శిక్షణ కార్యక్రమంలో స్పీకర్‌ మధుసూదనాచారి

హైదరాబాద్‌: నాయకుడికి దూరదృష్టి ఉంటే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని శాసన సభ స్పీకర్‌ మధుసూదనాచారి అన్నారు. రాజేంద్రనగర్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ సంస్థ (ఎన్‌ఐఆర్‌డీ)లో 14 రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గ్రామీణాభివృద్ధిపై నిర్వహిస్తున్న నాలుగు రోజుల శిక్షణను ఆయన మంగళవారం ప్రారంభించి మాట్లాడారు.

గ్రామీణులకు ప్రభుత్వ పథకాల గురించి తెలియకపోవడంతో వారి జీవన విధానంలో ఇప్పటికీ ఎలాంటి మార్పూ లేదన్నారు. ప్రజలకు అవసరమైన వాటిని తెలుసుకుని అందుకు అనుగుణంగా ప్రజాప్రతినిధులు, అధికారులు పనిచేయాలన్నారు. పల్లెనిద్ర, పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వారా ఇప్పటికీ ప్రపంచానికి తెలియని కులాల వారిని కలుసుకున్నానని, అదేవిధంగా ప్రజాప్రతినిధులంతా తమ నియోజకవర్గ సమస్యలపై అవగాహన పెంచుకుని అభివృద్ధికి తోడ్పడాలని చెప్పారు.  

అవగాహన పెంచుకుంటాను
మొదటిసారి నాకు ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది. ఈ శిక్షణ ద్వారా గ్రామీణుల సమస్యలపై అవగాహన పెంచుకుని వారికి సేవ చేసేందుకు కృషిచేస్తాను.  
– సుష్మాపాటిల్, బీఎస్పీ ఎమ్మెల్యే, ఉత్తరప్రదేశ్‌ 

సేవ చేసేందుకు శిక్షణ ఉపయోగం 
గ్రామీణులకు కేంద్ర, రాష్ట్ర పథకాలను పూర్తిస్థాయిలో అందిం చేందుకు ఈ శిక్షణ ఉపయోగపడనుంది. నా నియోజకవర్గ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు కృషిచేస్తాను. గ్రామీణ ప్రాంత ప్రజలతోనే అభివృద్ధి సాధ్యం.
– పవన్‌సైనీ, బీజేపీ ఎమ్మెల్యే, హరియాణా  

మరిన్ని వార్తలు