మాయ మాటలతో మోసం

23 Sep, 2017 12:15 IST|Sakshi

దొంగబాబాల నగ్న సంచారం

బుడ్మి గ్రామస్తులను బురిడీ కొట్టించిన వైనం

‘సాక్షి’ కథనంతో వెలుగులోకి..

ఒక్కొక్కరుగా బయటకొస్తున్న బాధితులు

బాన్సువాడ టౌన్‌(బాన్సువాడ) :
కూతురి ఆరోగ్యాన్ని బాగు చేస్తామని నమ్మించి ఆభరణాలతో పరారైన ఘటనలో బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఒక్కరు, ఇద్దరు కాదు.. చాలా మందికి టోకరా వేసినట్లు వెలుగులోకి వచ్చింది. మోసానికి పాల్పడింది ఒక్కరు కాదు.. ఓ ముఠా అని తేలింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బుడ్మి గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటనను ‘సాక్షి’ గురువారం ప్రచురించిన విషయం విదితమే. దీంతో గ్రామంలో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. దొంగ బాబాల చేతిలో తాము కూడా మోసపోయామని ఒక్కొక్కరు బయటకొస్తున్నారు. ‘సాక్షి’ ప్రతిని«ధులతో బాధితులు తమ గోడును వెల్లబోసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 17న గ్రామంలో యాపకల్లు, తేనె అమ్మేందుకు వచ్చిన ఓ మహిళ ఇంటింటికీ తిరుగుతూ, ఏయే ఇంట్లో ఏయే సమస్యలున్నాయో అడిగి తెలుసుకుంది. తనకు తెలిసిన స్వామీజీ ఉన్నారని, ఆయన ఎన్నో రోగాలను నయం చేస్తాడని, తన బంధువుకు కూడా నయం చేశాడని స్థానికులను నమ్మబలికింది. ఆయనకు చెబితే ఏ సమస్య అయినా రెండు, మూడ్రోజుల్లో పరిష్కారమవుతుందని చెప్పి వెళ్లిపోయింది.

ఆ తర్వాతి రోజే, అల్లం మురబ్బా విక్రయించేందుకు గ్రామంలోకి వచ్చిన దొంగ బాబాను స్థానికులు పిలిచి ఒక్కొక్కరుగా తమ సమస్యలు వివరించారు. సదరు బాబా ఒక ఫోన్‌ కాల్‌ చేయగా, పది నిమిషాల వ్యవధిలోనే రెండు సుమోల్లో మరో 8 మంది దొంగబాబాలు అక్కడ ప్రత్యక్షమయ్యారు. వారికి పెద్ద పెద్ద గడ్డాలు, మీసాలు, తల పాగాలు పెట్టుకొని నగ్నంగా వచ్చిన దుండగులు.. బాధితుల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. వారి చేతిలో రాయి పెట్టి మంత్రం వేస్తున్నట్లు నటించి రుద్రాక్షలు, తాయత్తులు, శివలింగాలు ప్రత్యక్షం చేయడంతో గ్రామస్తులు వారిని నమ్మారు. దొంగ బాబాలు అడిగిన మేర డబ్బులు సమర్పించుకున్నారు. ఇలా 15 మంది నుంచి ఒక్కొక్కరి వద్ద సుమారు రూ.3 వేల వరకు వసూలు చేసి, అక్కడి నుంచి ఉడాయించారు. అయితే, ఈ వ్యవహారం బయటకు రాలేదు. అయితే, రెండున్నర తులాల బంగారం, నగదు కోల్పోయిన ఓ కుటుంబం తమకు జరిగిన అన్యాయాన్ని వెల్లడించడంతో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు.

నాకు రుద్రాక్ష ప్రత్యక్షమైంది
ఈనెల 18న మా ఊరికి కొందరు స్వాములు నగ్నంగా వచ్చారు. నా చేయిలో రాయి పెట్టి ఏమేమో చేశారు. వెంటనే నా చేయిలో రుద్రాక్ష ప్రత్యక్షమైంది. దాన్ని మెడలో వేసుకోమన్నారు. వేసుకున్నా. ఇప్పటికీ రుద్రాక్ష నా మెడలోనే ఉంది. వారి మోసాలను ఊరిలోని వాళ్లందరం కూడా
గమనించలేకపోయాం.     – పండరిగౌడ్, బాధితుడు

ఊర్లో నగ్నంగా తిరిగారు
మూడు, నాలుగు రోజుల కింద చాలా మంది స్వాములు వచ్చారు. వారికి పెద్ద పెద్ద గడ్డాలు, మీసాలు ఉన్నాయి. శరీరంపై ఎలాంటి దుస్తులు లేవు. వారిని చూస్తే నిజంగా స్వాముల వలే ఉన్నారు. అయితే చాలా మంది వద్ద డబ్బులు, బంగారం ఎత్తుకెళ్లారని తెలిసింది. ఇలాంటివారిపై అధికారులు నిఘా ఉంచాలి.                – సురేందర్‌గౌడ్, బుడ్మి

మరిన్ని వార్తలు