న్యూసెన్సే!

24 Apr, 2020 07:45 IST|Sakshi

విపత్కర పరిస్థితుల్లోనూ వేళాకోళాలే

‘డయల్‌–100’కు ఆగని అనవసర కాల్స్‌

రెండు రోజుల్లో ఈ కోవకు చెందినవి 4464

సోమ, మంగళవారాల్లో మొత్తం 21 వేల ఫోన్లు

లాక్‌డౌన్, కొవిడ్‌ సంబంధిత కాల్స్‌ పెద్ద సంఖ్యలోనే

సాక్షి, సిటీబ్యూరో: కొవిడ్‌ అనుమానిత కేసు కనిపించింది...  ఎక్కడైనా ఎక్కువ మంది గుమిగూడి ఉన్నారు...ఏదైనా దుకాణంలో అధిక ధరలకు విక్రయిస్తున్నారు...అనారోగ్యానికి గురికావడంతో సహాయం అవసరమైంది...   ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటివి ఎదురైనప్పుడు అందరికీ గుర్తుకువచ్చే సంఖ్య ‘100’. ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తామో..అదే స్థాయిలో స్పందన ఉండాలని ఆశిస్తాం. అలాంటి విలువైన ‘డయల్‌–100’కు ప్రస్తుత తరుణంలోనూ ఆకతాయిల బెడద తప్పట్లేదు. అభ్యంతరకరంగా మాట్లాడుతున్న కాలర్లూ ఎక్కువగానే ఉంటున్నారు. సహాయం కోసం కాకుండా కేవలం ‘సమాచారం’ తెలుసుకోవడానికీ అనేక మంది ఫోన్లు చేస్తున్నారు. సోమ, మంగళ వారాల్లో డయల్‌–100కు 21 వేలకు పైగా ఫోన్‌ కాల్స్‌ రాగా... వాటిలో 20.7 శాతం న్యూసెన్స్‌ కాల్స్‌ కావడం గమనార్హం. ‘డయల్‌–100’కు రాష్ట్రం నలుమూలల నుంచి సోమ, మంగళవారాల్లో 21,524 కాల్స్‌ వచ్చాయి. ఇలా వచ్చిన ఫోన్లలో బ్లాంక్‌ కాల్స్, న్యూసెన్స్‌ కాల్స్, అనవసరవిషయాలను ప్రస్తావించే ఫోన్ల సంఖ్య 4464గా నమోదైంది. సోషల్‌మీడియా, పోలీసు అధికారిక వెబ్‌సైట్లు అందుబాటులోకి వచ్చినా... ఇప్పటికీ ఫలానా అధికారి ఫోన్‌ నెంబర్‌ కావాలనో, ఫలానా పోస్టులో ఏ అధికారి ఉన్నారనో తెలుసుకోవడానికి ‘100’ ఫోన్లు చేస్తున్న వారు భారీ సంఖ్యలోనే ఉంటున్నారని అధికారులు చెబుతున్నారు. సోమ, మంగళవారాల్లోనే ఈ తరహా కాల్స్‌ సంఖ్య 4991గా నమోదైంది. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో నివసిస్తున్న విద్యాధికులు సైతం ఈ తరహాలో ఫోన్లు చేస్తుంటడం సిబ్బందికి తలనొప్పులు తెచ్చిపెడుతోంది. 

చిత్ర విచిత్ర ‘వేధింపులూ’ ఎక్కువే...
ఈ కంట్రోల్‌ రూమ్‌లో పని చేసే సిబ్బందికి ప్రస్తుత తరుణంలోనూ ‘వేధింపులు’ తప్పట్లేదు. కొందరు ఫోన్లు చేసి పోలీసు విభాగం, సంబంధిత అంశాలతో సంబంధంలేనివి అడుగుతున్నారు. అలాంటి వారికి సిబ్బంది నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తే దూషణలకు దిగుతున్నారు. అసభ్యపదజాలం కాకపోయినా... అభ్యంతరకరంగా, ఎదుటి వారి మనస్సుకు బాధ కలిగేలా మాట్లాడుతుంటారు. కొందరు ఆకతాయిలైతే పదేపదే ఫోన్లు చేయడంతో పాటు ఏమీ మాట్లాడకుండా ఉండటమో, వెంటనే కట్‌ చేసేయడమో చేస్తుంటారు. వీటిని అధికారికంగా బ్లాంక్‌ కాల్స్‌గా పరిగణిస్తున్న సిబ్బంది పక్కన పెట్టేస్తున్నారు. అలాంటి నెంబర్లను బ్లాక్‌ చేసే అవకాశం ఉన్నప్పటికీ... భవిష్యత్తులో వారికే ఏదైనా ఇబ్బంది ఎదురైనా, అత్యవసరం అయినప్పుడు ఆ వ్యవహారం ‘నాన్న పులి’ కథ మాదిరిగా మారుతుందనే ఉద్దేశంతో ‘డయల్‌–100’ సిబ్బంది ఉపేక్షిస్తున్నారు. 

కొవిడ్, లాక్‌డౌన్‌ కాల్సూ పెద్ద సంఖ్యలోనే...
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, లాక్‌డౌన్‌ నేపథ్యంలో డయల్‌–100 సిబ్బంది నిర్విరామంగా, అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. తమకు ఫోన్‌ చేసిన వారు పూర్తి స్థాయిలో వివరాలు అందించకున్నా, అందించలేకున్నా వీలున్నంత వరకు సహాయసహకారాలు అందిచడానికే ప్రయత్నిస్తున్నారు. ప్రజలకు ఎలాంటి అవసరం వచ్చినా ‘100’కు ఫోన్‌ చేయమంటూ ప్రభుత్వం ప్రకటించడంతో కొవిడ్‌ సంబంధిత, లాక్‌డౌన్‌కు సంబంధించిన కాల్స్‌ కూడా పెద్ద సంఖ్యలోనే వస్తున్నాయి. సోమ, మంగళవారాల్లోనే వీటికి సంబ«ంధించి  3916 ఫోన్లు వచ్చాయి. వీటిలో 265 కోవిడ్‌ అనుమానితులకు సంబంధించినవి కాగా... 3651 లాక్‌డౌన్‌ సంబంధితమైవి. వీటిపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్న డయల్‌–100 అధికారులు ఆ కాల్స్‌ను సంబంధిత విభాగాలు, పోలీసుస్టేషన్లు, కార్యాలయాలకు బదిలీ చేస్తున్నారు. అత్యవసరంగా స్పందించాల్సిన, తీవ్రమైన ఉల్లంఘనలకు సంబంధించిన ఫోన్ల సమాచారాన్ని  టాస్క్‌ఫోర్స్, ఎస్‌ఓటీ వంటి ప్రత్యేక విభాగాలకు అందిస్తున్నారు. తాజా పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో ఉన్న పోలీసులకు పోటీగా డయల్‌–100 సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఆదేశాలను ఉల్లంఘిచిన వ్యవహారాల పైనా ఫోన్లు వస్తున్నాయి. హాస్టల్‌ ఖాళీ చేయమని నిర్వాహకులు వేధిస్తున్నారని, ఇంటి అద్దె కోసం యజమానాలు డిమాండ్‌ చేస్తున్నారనీ బాధితులు డయల్‌–100ను ఆశ్రయిస్తున్నారు. 

లాక్‌డౌన్‌ సంబంధిత కాల్స్‌ వివరాలివి...
జనం గుమిగూడటంపై సమాచారం    :1712
రవాణా ఇబ్బందులకు సంబంధించి    :316
ఆహారం దొరకట్లేదని    :441
నిర్ణీత సమయం మించి దుకాణాలు తెరవడంపై    : 183
అధిక ధరకు నిత్యావసరాలు విక్రయంపై    :82  
హాస్టల్‌ నుంచి ఖాళీ చేయిస్తున్నారంటూ    :6
నిత్యావసర రవాణా వాహనాలు ఆపారంటూ    :19
అత్యవసర విధులు సిబ్బందిని ఆపారంటూ    :6
రేషన్‌ సరఫరాలో ఇబ్బందులపై    :775
యజమానులు అద్దె డిమాండ్‌ చేస్తున్నారంటూ    :111
(సోమ, మంగళవారాల డేటా ఆధారంగా...)

మరిన్ని వార్తలు