ఎలాంటి సర్టిఫికెటైనా అందిస్తాడు..

11 Dec, 2016 08:02 IST|Sakshi
నిందితుడు అబ్దుల్‌ సత్తార్‌ అల్‌ హజరీ

నాంపల్లి: విదేశాలకు వెళ్తున్న వారికి ఎలాంటి సర్టిఫికెట్‌నైనా అందించే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈసీఎన్ఆర్‌ లేని వారు ఎంప్లాయిమెంట్‌ వీసాపై విదేశాలకు వెళ్లే అవకాశం లేక పోవడంతో దీనిని అవకాశంగా మార్చుకున్న అతను ఎస్‌సీఎస్‌సీల తయారీని ఉపాధిగా మార్చుకున్నాడు..

వివరాల్లోకి వెళితే..
నాంపల్లి రెడ్‌హిల్స్‌కు చెందిన అబ్దుస్‌ సత్తార్‌ (46) ఇంటర్‌ చదివి, ఆ తర్వాత గ్రాఫిక్‌ డిజైనింగ్‌ కోర్సు చేశాడు. అనంతరం ఉపాధి కోసం 1995లో  సౌదీ అరేబియాకు వెళ్లి 2008 నగరానికి తిరిగి వచ్చాడు. సీసీటీవీ ఇన్స్టాలేషన్ బిజినెస్‌ చేస్తున్న సత్తార్‌ గ్రాఫిక్‌ డిజైనర్‌గా తనకున్న అనుభవంతో నేర్చుకున్న విద్యను నకిలీ విద్యార్హతల సర్టిఫికెట్ల తయారీని ఎంచుకున్నాడు. సికింద్రాబాద్‌లోని రీజినల్‌ పాస్‌ పోర్టు ఆఫీస్‌ వద్ద ఏజెంట్‌గా చెలమణి అవుతూ ఈసీఎన్ఆర్‌ పాస్‌పోర్టు తిరస్కరణదారుల డాటాను సేకరించి వారికి సర్టిఫికెట్‌లు ఇప్పిస్తానని నమ్మించి ఒక్కో సర్టిఫికెట్‌గా ఒక్కో రేటు వసూలు చేసేవాడు.

ఎస్‌ఎస్‌సీ  సర్టిఫికెట్స్‌కు రూ.15000, ఇంటర్‌ సర్టిఫికెట్‌కు రూ.20000, డిగ్రీ, ఆపైన సర్టిఫికెట్స్‌ కోసం రూ.25వేలు వసూలు చేసేవాడు. ఓయూ, జేఎన్టీయూ...ఇలా ఏ యూనివర్సిటీ సర్టిఫికెట్‌ అయినా తయారు చేసి ఇచ్చేవాడు. ఈసీఎన్ఆర్‌ పాస్‌పోర్టు కోసం ఎస్‌ఎస్‌సీ సర్టిఫికెట్, బర్త్‌ సర్టిఫికెట్, ఓటర్‌ ఐడీ, ఆధార్‌ కార్డులు రెడీ చేసి పాస్‌పోర్టు స్లాట్‌లు కూడా బుక్‌ చేసేవాడు. రెడ్‌హిల్స్‌లోని తన ఇంటి నుంచే ఈ దందా నిర్వహించేవాడు. అతని బారిన పడి మోసపోయిన వ్యక్తులు ఈ విషయాన్ని వెస్ట్‌ జోన్ టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దృష్టికి రావడంతో దాడులు నిర్వహించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ కోసం నాంపల్లి పోలీసులకు అప్పగించారు.

మరిన్ని వార్తలు