తప్పంతా సిబ్బందిదేనట!

15 Apr, 2019 13:01 IST|Sakshi
విచారణ జరుపుతున్న డీఎంఈ (ఫైల్‌)

నకిలీ ఉద్యోగుల వ్యవహారంలో అసలు నిందితులను వదిలేసిన వైనం!

స్వయంగా విచారించిన డీఎంఈ ∙పైస్థాయి వారిని వదిలేసి సిబ్బందిపై చర్యలు

ఆయా, సూపర్‌వైజర్‌ తొలగింపు

ఇద్దరు స్టాఫ్‌నర్సులకు మెమోలు

నిజామాబాద్‌అర్బన్‌: ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో నకిలీ ఉద్యోగుల వ్యవహారంపై చేపట్టిన దర్యాప్తు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తం గా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో ఉన్నతాధికారుల విచారణ కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉంది. అసలు సూత్రదారులను వదిలే సి, తప్పంతా కింది స్థాయి సిబ్బందిదేనని అధికారులు తేల్చడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనలో ఆయా, సూపర్‌వైజర్‌లపై వేటు వేసిన ఉన్నతాధికారులు.. ఇద్దరు స్టాఫ్‌నర్సులకు మెమోలు జారీ చేసి చేతులు దులుపుకోవడం గమనార్హం. సాక్షాత్తూ డీఎంఈ రమేశ్‌రెడ్డి విచారణ జరిపినా అసలు నిందితులు బయటకు రాకపోవడమేమిటో అంతు చిక్కడం లేదు.

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం.. 
జిల్లా ఆస్పత్రిలో రెండు నెలల పాటు ఎలాంటి అనుమతి లేకుండా 17 మంది ఉద్యోగులుగా కొనసాగుతూ వైద్యం చేసిన ఘటన బయటకు రావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏకంగా జిల్లా ఆస్పత్రిలో నకిలీ ఉద్యోగులు తిష్ట వేసి, ఏకంగా అత్యవసర విభాగంలోనూ వైద్యచికిత్సలు అందించడం అప్పట్లో కలకలం రేపింది. ఆస్పత్రిలోని 328వ గదిలో అక్రమార్కులు తమ దందా కొనసాగించడం, బాధితుల నుంచి డబ్బులు వసూలు చేయడం, ఈ గదిలోనే నకిలీ ఉద్యోగులకు విధులు కేటాయించడం చేశారు.

దాదాపు రెండు నెలలు ఉద్యోగుల పేరిట ప్రైవేట్‌ వ్యక్తులు ఆస్పత్రిలో ఇంజక్షన్లు, ఇతరత్రా చికిత్సలు అందించడం చేశారు. అయితే, అత్యవసర విభాగంలో ఓ రోగికి యువకుడు సూది మందు ఇచ్చే విధానంలో తేడా కనిపించడాన్ని గమనించిన ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాములు ఆ యువకుడ్ని వారించాడు. అసలు నువ్వు ఎవరని ఇంజక్షన్‌ ఇస్తున్న యువకుడ్ని సూపరింటెండెంట్‌ గట్టిగా నిలదీస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తాను కొత్తగా రిక్రూట్‌ అయినట్లు సదరు వ్యక్తి చెప్పడంతో అవాక్కయిన రాములు అసలు విషయం ఆరా తీయగా నకిలీ ఉద్యోగుల యవ్వారం బయట పడింది. మొత్తం 17 మంది నకిలీ ఉద్యోగులు ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో పని చేస్తున్నట్లు తేలింది. ఈ విషయం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది
 
డీఎంఈ విచారించినా.. 
ఈ వ్యవహారంపై కలెక్టర్‌తో పాటు ప్రభుత్వం కూడా తీవ్రంగా స్పందించింది. వైద్య విద్య సంచాలకుడు (డీఎంఈ) రమేశ్‌రెడ్డి ఆస్పత్రికి స్వయంగా విచారణ జరిపారు. మాక్లూర్‌ మండలానికి చెందిన ఓ యువకుడు.. జిల్లా ఆస్పత్రిలో కొలువుల పేరిట కొంత మంది యువతీయువకుల నుంచి డబ్బులు వసూలు చేసి, వారిని ఆస్పత్రిలో ఉంచి పని చేయించినట్లు తేలింది. బాధితులతో పాటు నిందితుడ్ని విచారించిన డీఎంఈ.. ఆస్పత్రి అధికారులపై తీవ్రంగా మండిపడ్డారు.

ప్రైవేట్‌ వ్యక్తులు ఆస్పత్రిలో నేరుగా వైద్యసేవలు అందించడం, శిక్షణ పేరిట కొనసాగడంపై ఎందుకు  పసిగట్టలేకపోయారని గట్టిగా క్లాస్‌ తీసుకున్నారు. దీంతో ఆస్పత్రిలోని కీలక అధికారులపై చర్యలు తప్పవని అంతా భావించారు. ఏం జరిగిందో ఏమో కానీ, తప్పంతా చిరుద్యోగులేనని ఉన్నతాధికారులు వారిపై కొరడా ఝళింపించారు. ఆయా, సూపర్‌వైజర్‌ను విధుల నుంచి తొలగించారు. అలాగే, అత్యవసర విభాగం, ఓపీ విభాగం వద్ద విధులు నిర్వర్తించే స్టాఫ్‌నర్సులకు మెమోలు జారీ చేసి, అధికారులు చేతులు దులుపుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ముందుకు సాగని కేసు 
నకిలీ ఉద్యోగుల వ్యవహారంలో బాధితులు ఒకటో టౌన్‌లో ఫిర్యాదు చేశారు. మాక్లూర్‌ మండలం గుత్పకు చెందిన సతీష్‌ ఉద్యోగాల పేరిట డబ్బుల తీసుకుని తమను జిల్లా ఆస్పత్రిలో చేర్పించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సతీష్‌ను ప్రశ్నించిన అధికారులు.. మోపాల్‌ మండలం కాల్‌పోల్‌కు చెందిన గోపాల్‌ పేరును వెల్లడించాడు. ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. నెల రోజులు గడిచినా కేసు విచారణ కొలిక్కి తేలేక పోయారు. అసలు సూత్రదారులను వెలికి తీయడంలో జాప్యం జరుగుతుండడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము మోసపోయమని, తమకు న్యాయం చేసి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. 

ఇద్దరిని తొలగించాం.. 
నకిలీ ఉద్యోగుల వ్యవహారంలో ఒక ఆయాతో పాటు సంబంధిత ఫ్లోర్‌ సూపర్‌వైజర్‌ను తొలగించాం. ఇద్దరు స్టాఫ్‌నర్సులకు మెమోలు జారీ చేశాం. ఆస్పత్రి నిర్వహణలో కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఇలాంటి ఘటనలు జరుగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. – డా.రాములు, ఆస్పత్రి సూపరింటెండెంట్‌  

మరిన్ని వార్తలు