సంపద దోచుకునేందుకే బూటకపు ఎన్‌కౌంటర్లు 

12 Mar, 2018 07:38 IST|Sakshi
స్వామి చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న వరవరరావు 

దాడబోయిన స్వామి సంస్మరణ సభలో విరసం నేత వరవరరావు

కాజీపేట అర్బన్‌: ప్రకృతి సంపద దోచుకుని కార్పొరేట్‌ సంస్థలకు దారదత్తం చేసేందుకే పాలకులు బూటకపు ఎన్‌కౌంటర్లకు పాల్పడుతున్నారని విరసం నేత వరవరరావు అన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ చీకటి ఒప్పందాలకు ప్రతీకనే ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌ అని పేర్కొన్నా రు. ఛత్తీస్‌గఢ్‌ – తెలంగాణ సరిహద్దులో ఇటీవల జరిగి న ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన దాడబోయిన స్వామి అలియాస్‌ ప్రభాకర్‌ సంస్మరణ సభను ఆదివారం కాజీపేట మండలం రాంపేట గ్రామంలోని స్వగృహం లో స్వామి సోదరుడు సమ్మయ్య, బంధువులు ఏర్పాటు చేశారు.

స్వామి చిత్రపటానికి పూలమాల వేసి నివాళుర్పించిన అనంతరం వరవరరావు మాట్లాడుతూ ఉన్నత విద్యనభ్యసించిన స్వామి ప్యారా టీచర్‌గా గ్రామాలు తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్నాడని, బూర్జువా రాజకీయాలు నచ్చక అప్పటి పీపుల్స్‌వార్‌ నేటి మావోయిస్టు పార్టీలో 1999 సంవత్సరం చేరి అన తి కాలంలో సెంట్రల్‌ రీజినల్‌ బ్యూరో ప్రెస్‌ ఇన్‌చార్జి, డీసీఎంగా ఎదిగాడని పేర్కొన్నారు. 2009లో చిదంబరం గ్రీన్‌హంట్‌ పేరిట, నేడు రాజ్‌నాథ్‌సింగ్‌ సమాధాన్‌ ఆపరేషన్‌ పేరిట ఆదివాసులను బూటకపు ఎన్‌కౌంటర్లలో చంపుతున్నారని అన్నారు.

మావోయిస్టుల ఏజెండానే మా ఏజెండా అని నమ్మబలికిన కేసీఆర్‌ ఆధికారంలోకి రాగానే 39 మంది ఎన్‌కౌంటర్లలో బలిచేయడం దారుణమన్నారు. ఈ సందర్భంగా పౌరహక్కుల, ప్రజాసంఘాల నాయకులు జోహర్లు అర్పిస్తూ విప్లవగీతాలు ఆలపించారు. కార్యక్రమంలో స్వామి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, ప్రజాసంఘాల నాయకులు బండి దుర్గప్రసాద్, బాసిత్, రమాదేవి, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు