‘ఫేక్‌’బుక్‌ సర్కార్‌! 

3 Nov, 2017 01:01 IST|Sakshi

సోషల్‌ మీడియాలో ప్రభుత్వం పేరిట నకిలీ ఖాతాలు

సర్కారుదేనని మభ్యపెట్టేలా అధికారిక లోగోలతో ఏర్పాటు

ప్రభుత్వ ఉత్తర్వుల పేరుతో తప్పుడు ప్రచారాలు 

 ఫోర్జరీ సర్క్యులర్లతో అధికారవర్గాల్లోనూ గందరగోళం

గత నెలలో భారీ వర్షాలతో సెలవులంటూ నకిలీ సర్క్యులర్‌

ఓ ఉన్నతాధికారి నియామకం అంటూ పోస్టులు

సినిమాలకు సంబంధించిన అంశాలనూ షేర్‌ చేసిన వైనంపరువు తీసే అంశాలతో ప్రభుత్వానికి ఇబ్బందులు

తప్పుడు సమాచారంతో ప్రజలకు సమస్యలు

అసలు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారిక ఖాతాయే లేదు

సీఎంవోకు అధికారిక పేజీ ఉన్నా.. దీటుగా ఎన్నో నకిలీలు

పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం.. 

ఉలుకూపలుకూ లేని సైబర్‌ విభాగం

సాక్షి, హైదరాబాద్‌: ఫేస్‌బుక్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేరుతో ఖాతా కనిపించింది.. ప్రభుత్వ ఖాతా కదాని లైక్‌ చేశారు, ఫాలో అవుతున్నారు.. ఓ రోజు భారీ వర్షాలు పడటంతో మరునాడు స్కూళ్లు, కాలేజీలకు సెలవు అని సర్క్యులర్‌ వచ్చింది.. మరోసారి ఎవరో అధికారికి పెద్ద ప్రమోషన్‌ అని ప్రకటన వెలువడింది.. ఏదో సినిమాకు సంబంధించిన పోస్టు ఈ ఖాతాలో షేర్‌ చేసి కనిపించింది.. అవన్నీ నిజమేనని నమ్మితే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే అది రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ఖాతా కాదు.

అచ్చం అలా మభ్యపెట్టేలా రూపొందిన నకిలీ ఖాతా. ఫేస్‌బుక్‌లో ప్రభుత్వం పేరిట ఇలాంటి నకిలీ ఖాతాలు చాలా ఉన్నాయి. కొందరు మాయగాళ్లు ఏకంగా ప్రభుత్వ లోగోలు, నకిలీ సర్క్యులర్లతో చెలరేగుతున్నారు. ఏది నకిలీ, ఏది అసలుదని తెలియని గందరగోళం నెలకొంది. ఫేస్‌బుక్, ట్వీటర్, వాట్సాప్‌ వంటి సోషల్‌ మీడియాలో రోజూ వందలాది కామెంట్లు, పోస్టింగ్‌లు విచ్చలవిడిగా వైరల్‌ అవుతున్నాయి. ఈ నకిలీ ఖాతాల్లో ప్రభుత్వం పరువు తీసేలా ఎన్నో పోస్టులు, ప్రచారాలు జరుగుతున్నాయి. ఇలాంటి వాటికి కళ్లెం వేయాల్సిన ప్రభుత్వ ఐటీ విభాగం, మీడియా విభాగం, సైబర్‌ నేరగాళ్ల ఆటకట్టించాల్సిన అధికార యంత్రాంగం కళ్లప్పగించి చూస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో ప్రభుత్వం పేరిట ఖాతాల వ్యవహారంపై ‘సాక్షి’పరిశీలన జరిపితే.. పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. 

సెలవు సృష్టించిన వాట్సాప్‌ 
గత నెల (అక్టోబర్‌) రెండో తేదీన సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. మరుసటి రోజు ఉదయం ‘గవర్నమెంట్‌ ఆఫ్‌ తెలంగాణ నోటిఫికేషన్‌’పేరుతో ఓ నకిలీ సర్క్యులర్‌ బయటికి వచ్చింది. భారీ వర్షం కారణంగా ఆ రోజు (మూడో తేదీన) సెలవు దినంగా ప్రకటించినట్లు అందులో పేర్కొన్నారు. అన్ని వాట్సాప్‌ గ్రూపుల్లో ఈ నోటిఫికేషన్‌ వైరల్‌ అయింది. ఉదయం 8 గంటల సమయంలో కార్యాలయాలకు బయలుదేరే వేళ వచ్చిన ఈ నోటిఫికేషన్‌ ఉద్యోగులను అయోమయంలో పడేసింది. సెలవు దినమా.. ఆఫీసులకు వెళ్లాలా, వద్దా.. తేల్చుకోలేక కొందరు ఉద్యోగులు ఇంటి దగ్గరే ఆగిపోయారు.

సెక్షన్‌ ఆఫీసర్‌ అంటూ ఓ సంతకంతో వచ్చిన ఈ సర్క్యులర్‌ను చూసి ఉన్నతాధికారులు సైతం బిత్తరపోవడం గమనార్హం. అదెలా వచ్చింది, ఎవరు సృష్టించారనేదీ ఇప్పటికీ తెలియరాలేదు. ఇక డీజీపీ అనురాగ్‌శర్మ ఈ నెల 12న పదవీ విరమణ చేయనున్నారు. అయితే అక్టోబర్‌ 31న ఐపీఎస్‌ అధికారి తెన్నేటి కృష్ణప్రసాద్‌కు డీజీపీ బాధ్యతలు అప్పగించినట్లుగా ‘గవర్నమెంట్‌ ఆఫ్‌ తెలంగాణ’పేరుతో ఉన్న నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాలో ఓ పోస్టు హల్‌చల్‌ చేసింది. ఆ ఫేస్‌బుక్‌ పేజీ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లోగోతో సహా ఉండడంతో గంటల వ్యవధిలోనే ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దీంతో అధికారులు సైతం విస్తుపోవాల్సి వచ్చింది. 

పదుల సంఖ్యలో ఖాతాలు 
ఫేస్‌బుక్‌లో తెలంగాణ ప్రభుత్వం పేరుతో నకిలీ ఖాతాలు, పేజీలు పదుల సంఖ్యలో చెలామణిలో ఉన్నాయి. వాటి నిర్వాహకులు దర్జాగా తమ ఖాతాలకు ‘తెలంగాణ గవర్నమెంట్, టీఎస్‌ గవర్నమెంట్, గవర్నమెంట్‌ ఆఫ్‌ తెలంగాణ, తెలంగాణ గవర్నమెంట్‌ అప్‌డేట్స్‌..’ఇలా రకరకాల పేర్లను పెట్టారు. ఏకంగా ప్రభుత్వ అధికారిక లోగోను కవర్‌ ఫొటోగా, ప్రొఫైల్‌ పిక్చర్లుగా వాడుకున్నారు. అసలు విషయం ఏమిటంటే.. తెలంగాణ ప్రభుత్వం తరఫున అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతా ఇప్పటివరకు లేదు. తెలంగాణ సీఎంవో పేరుతో అధికారిక పేజీ ఉన్నప్పటికీ అదే పేరుతో మరిన్ని నకిలీ ఖాతాలు ఉన్నాయి.

అచ్చం ప్రభుత్వ ఖాతాల్లా మభ్యపెట్టేలా ముఖ్యమంత్రి ఫోటోలు, అసెంబ్లీ, తెలంగాణ చారిత్రక కట్టడాల చిత్రాలు పెట్టడం గమనార్హం. కానీ వీటిలో తప్పుడు ప్రచారాలు, నకిలీ సర్క్యులర్లు, చవకబారు పోస్టింగ్‌లు ఉంటున్నాయి. తెలంగాణ గవర్నమెంట్‌ పేరుతో ఉన్న కొన్ని ఫేస్‌బుక్‌ పేజీల్లో ఏకంగా సినిమా గాసిప్‌లు కూడా ఉన్నాయి. ఫేస్‌బుక్‌లో ఏ పేరుతోనైనా ఖాతా తెరిచే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రభుత్వం పేరు, లోగోలు దుర్వినియోగం చేసే వారిని నియంత్రించాల్సిన అవసరముంది. 

పట్టించుకోని అధికారవర్గాలు 
ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చి, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్న నకిలీ సోషల్‌ మీడియా ఖాతాలను నియంత్రించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. రాష్ట్రంలో ప్రత్యేకంగా సైబర్‌ విభాగం ఉన్నా.. నకిలీ ఖాతాల ఆట కట్టించే చర్యలేవీ చేపట్టడం లేదు. ఇప్పటికైనా స్పందించకపోతే.. అధికారిక సమాచారంగా ప్రజలను నమ్మించి మోసం చేసే ముఠాలు చెలరేగే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని వార్తలు