గ(క)ల్తీ.. ఎరువులు

20 Jan, 2018 18:14 IST|Sakshi
కాయలు లేని వంకాయ తోట

ముంచిన ఎరువులు

పంటకు నీరుపెట్టినా కరగని వైనం

నాణ్యత లేని ఎరువులు అంటగట్టిన వ్యాపారి

నందిమల్లగడ్డలో రైతుల ఆక్రందన వెలుగులోకి..

అధికారులు దృష్టిసారించినా ఆగని అక్రమాలు

ఎరువుల రికార్డులు నిర్వహించని వ్యాపారులు

నందిమల్ల్లగడ్డ గ్రామానికి చెందిన రైతు లక్ష్మణ్‌ రెండు మళ్లలో వంకాయ తోట సాగుచేశాడు. 15 రోజుల క్రితం వనపర్తిలోని ప్రియాంక ఎరువుల దుకాణంలో కొనుగోలు చేసిన ఎరువును పంటకు వేశాడు. తడి ఆరకుండా నీళ్లు పెడుతున్నా ఎరువు కరగడం లేదు. అందులో సున్నపురాళ్లు, గులకరాళ్లు ఉన్నట్లు బాధిత రైతు గుర్తించి లబోదిబోమన్నాడు. ఇలా చాలామంది రైతులను నకిలీ ఎరువులు నిలువునా ముంచాయి.
 

సాక్షి, వనపర్తి : జిల్లాలోని వీపనగండ్ల మండలంలో ఓ వ్యాపారి నుంచి రైతులు వరి విత్తనాలను కొనుగోలుచేసి నాటితే నారుకు బదులు మొత్తం తుంగనే మొలిచింది. దీనిని తుంగ దశలోనే గుర్తించడంతో కోట్ల రూపాయల పంటనష్టం నుంచి రైతులు బయటపడగలిగారు. ఇదే కోవలో వనపర్తి మండలంలోనూ నకిలీ ఎరువులను విక్రయించడంతో అన్నదాతలు పూర్తిగా నష్టపోయారు. ఇలా కల్తీ ఎరువులు రైతులను నిలువునా ముంచుతున్నాయి. అక్రమ సంపాదన రుచిమరిగిన వ్యాపారు లు వాటిని యథేచ్ఛగా అంటగడుతున్నారు. నకిలీ ఎరువు లు, విత్తనాలు, పురుగు మందులు విక్రయిస్తే కఠినచర్యలు తప్పవని సీఎం కేసీఆర్‌ హెచ్చరించినా క్షేత్రస్థాయిలో మార్పు కనిపించడం లేదు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌కు ముందు నుంచే ప్రభుత్వం అక్రమ వ్యాపారులపై పీడీ యాక్ట్‌ కేసులు నమోదుచేసి కఠినచర్యలు తీసుకునేలా ప్రత్యేక ఆర్డినెన్స్‌ తీసుకొచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ అమలుకాలేదు.    

‘నకిలీ’ దుకాణం
వనపర్తి పట్టణంలో కేశవులు అనే వ్యాపారి ప్రియాంక ఫర్టిలైజర్స్‌ పేరుతో ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు విక్రయిస్తున్నాడు. ఈ దుకాణంలో వనపర్తి మండలంలోని నందిమళ్ల గడ్డకు చెందిన కొందరు రైతులు   చాలారోజులుగా ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు కొనుగోలు చేస్తున్నారు. తెలిసిన వ్యాపారి కావడంతో పెద్దగా నిరక్షరాస్యులైన రైతులు ఏటా వ్యాపారి చెప్పిన ఎరువులనే తీసుకెళ్లేవారు. గత ఖరీఫ్‌లో విత్తనాలు, ఎరువులనే కొనుగోలుచేసినా పెద్దగా పంట దిగుబడి రాలేదు. ప్రస్తుతం ఈ ప్రాంతంలోని చాలా మంది రైతులు వేరుశనగ, వరి, వంకాయ, చిక్కుడు, టమాట పంటలను సాగుచేశారు. రెండు నెలల క్రితం పంటలు సాగుచేసే సమయంలో వ్యాపారి కేశవులు వద్ద మందు 20–20రకం అడుగు మందును సుమారు 20మంది రైతులు కొనుగోలుచేశారు. సదరు వ్యాపారి జిల్లాలోని చాలామంది రైతులకు ఇలాంటి విత్తనాలు, ఎరువులనే విక్రయించినట్లు తెలిసింది.  
 

వెలుగులోకి వచ్చింది ఇలా..
చేనులో ఎదుగుదల లోపించడంతో ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకోక రైతులు మరోసారి మరోసారి అడుగు మందు చల్లారు. అయినా పంటలో మార్పు లేకపోవడంతో మోసపోయామని గ్రహించిన రైతులు వ్యవసాయశాఖ అధికారులు, పోలీసులను ఆశ్రయించారు. రైతులు రెండు రోజులు క్రితం నాణ్యత లేని ఎరువులను విక్రయించిన వ్యాపారి దుకాణం ఎదుట ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న వ్యవసాయశాఖ అధికారులు, పోలీసులు దుకాణాన్ని తనిఖీ చేయగా విస్తుగొలిపే వాస్తవాలు బయటపడ్డాయి. ఎలాంటి అనుమతి లేకుండా గ్రీన్‌గోల్డ్‌ అనే కంపెనీకి చెందిన 20–20 అడుగు మందు, 3–15, 20–20–0 ఎరువులు బస్తాల కొద్దీ పట్టుబడ్డాయి. వీటి శాంపిళ్లను సేకరించిన అధికారులు నివేదిక కోసం ఎరువుల ప్రయోగశాలకు పంపించారు. రిపోర్టు వస్తే సదరు ఎరువుల వ్యాపారిపై కేసు నమోదుచేస్తామని అధికారులు స్పష్టంచేశారు.  
 

ఈ –పాస్‌ వచ్చినా అదేతీరు..
ప్రభుత్వం జనవరి 1వ తేదీ నుంచి ఈ పాస్‌ యంత్రాల ద్వారానే ఎరువులు విక్రయించాలని నిబంధనలు కఠినతరం చేసింది. ఇందుకు సంబంధించి కలెక్టర్‌ శ్వేతామహంతి, వ్యవసాయ శాఖ అధికారులు వరసుగా డీలర్ల దుకాణాల వద్దకు వెళ్లి పరిశీలిస్తున్నారు. అయినా ప్రియాం క ఫర్టిలైజర్‌ దుకాణం నిర్వాహకుడు ఎరువుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయలేదు. అతని వద్ద ఎన్ని కంపెనీలకు చెందిన ఎరువులు ఉన్నా యో కూడా లెక్కచెప్పడం లేదు.

రిపోర్టు రాగానే చర్యలు
రైతుల ఫిర్యాదు మేరకు నష్టపోయిన పంటలను పరిశీలించాం. రైతులకు అమ్మిన ఎరువుల శాంపిళ్లను ల్యాబ్‌కు పంపించాం. ప్రియాంక ఫర్టిలైజర్‌ దుకాణాన్ని తాత్కాలికంగా మూసివేశాం. రెండు రోజుల్లో తెరిపించి మొత్తం లెక్కగట్టి 6 ఏ సెక్షన్‌ కింద కేసునమోదు చేసి జేసీ కోర్టులో హాజరుపరుస్తాం. నకిలీ ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అమ్మితే కఠినచర్యలు తీసుకుంటాం.
సుజాత, వ్యవసాయశాఖ అధికారి, వనపర్తి జిల్లా 

మరిన్ని వార్తలు