పసిడి పేరుతో బురిడీ!

23 Mar, 2017 00:31 IST|Sakshi

- బ్యాంకులో నకిలీ బంగారం తాకట్టు
- రూ.19.40 లక్షల గోల్డ్‌ లోన్‌ తీసుకున్న ఘనుడు


జమ్మికుంట (హుజూరాబాద్‌): కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలోని కరూర్‌ వైశ్యాబ్యాంక్‌లో పసిడి పేరుతో ఓ వ్యక్తి బురిడీ కొట్టించాడు. నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి రూ.19.40 లక్షల వరకు గోల్డ్‌లోన్‌ తీసుకున్నాడు. ఇతనికి బ్యాంకులో పనిచేసే అప్రైజర్‌ సహకరించినట్లు ఆరోపణలు వినిపిస్తు న్నాయి. కరూర్‌ వైశ్యాబ్యాంకులో కొన్నేళ్లుగా పట్టణానికి చెందిన ముక్క సునీల్‌ కుమార్‌ అప్రైజర్‌గా పనిచేస్తున్నాడు. దాదాపు రూ.5 కోట్ల వరకు పలువురికి బ్యాంకు నుంచి గోల్డ్‌లోన్‌ ఇప్పించాడు. 2016 జూలై నుంచి ఫిబ్రవరి 2017 వరకు పట్టణానికి చెందిన వ్యాపారి చిటికేశి జయప్రకాశ్‌ ద్వారా కిలో బంగారం తాకట్టు పెట్టించి రూ.19.40 లక్షల వరకు రుణం ఇప్పించాడు.

మొదట రూ.80 వేలు రుణంగా తీసుకున్న జయప్రకాశ్‌.. నకిలీ బంగారాన్ని తాకట్టుపెడుతూ.. భారీ ఎత్తున నగదు తీసుకున్నాడు. కాగా, ఫిబ్రవరిలో వైజాగ్‌ రీజియన్‌ కార్యాలయం నుంచి వచ్చిన వారు లాకర్లు తనిఖీ చేయగా, నకిలీ బంగారం బయట పడింది.  విషయాన్ని బయటకు పొక్క కుండా వెంటనే అప్రైజర్‌గా పనిచేసే వ్యక్తిని ప్రశ్నించారు. రికవరీ కోసం సునీల్‌ సస్పెన్స్‌ ఖాతాలో రూ.20 లక్షల వరకు రెండు చెక్కులతో డబ్బులను డిపాజిట్‌ చేయించుకున్నారు. ఖాతాను ప్రస్తుతం హోల్డ్‌లో పెట్టారు. ఈ విషయాన్ని ఇటీవల ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురాగా, బ్యాంకు మేనేజర్‌ సాయిబాబు బుధవారం రాత్రి పోలీస్‌స్టేషన్‌లో సీఐ ప్రశాంత్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా, తనను బలిపశువు చేశారంటూ సునీల్‌కుమార్‌ మనోవేదనతో అనారోగ్యం పాలై హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. రుణం తీసుకున్న జయప్రకాశ్‌ పరారీలో ఉన్నాడు.

మరిన్ని వార్తలు